‘లక్ష్మీస్ ఎన్టీఆర్’కు స్వర్గం నుంచి ఎన్టీ రామారావు ఆశీర్వాదం.. ఇదే సాక్ష్యం!
'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రానికి స్వర్గం నుంచి ఎన్టీ రామారావు ఆశ్వీరం ఉందని, తాజాగా విడుదలైన టీజర్‌కు యూట్యూబ్ నుంచి వచ్చిన రెస్పాన్సే ఇందుకు సాక్ష్యం అంటూ వాదిస్తున్నారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఎన్టీఆర్ 23వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రంలో ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన లుక్ రివీల్ చేస్తూ టీజర్ వదిలారు.

12 గంటల్లో ఈ టీజర్ 1.1 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుందని, మా సినిమాకు స్వర్గం నుంచి ఎన్టీ రామారావు ఆశీర్వాదం ఉంది అనడానికి ఇంతకంటే సాక్ష్యం అవసరం లేదని వర్మ తన ట్వీట్లో చెప్పుకొచ్చారు.
వర్మ విడుదల చేసిన టీజర్లో... ఎన్టీఆర్ పాత్రలో కనిపించిన వ్యక్తి పర్ఫెక్టుగా సూటయ్యారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కుర్చీలో కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తూ, ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకొంటూ ఎన్టీఆర్ పాత్ర కనిపించింది.
ఎన్టీఆర్ జీవితంలోకి రెండవ భార్యగా లక్ష్మీ పార్వతి ఎంటరైన తర్వాత జరిగిన పరిణామాలు, ఆయన్ను వెన్నుపోటు పొడిచి అధికారం నుంచి తప్పించడం వెనక ఉన్నది ఎవరు? అనే అంశాలు ఈ చిత్రంలో చూపింబోతున్నట్లు ఇప్పటికే వెల్లడించిన వర్మ.... లక్ష్మీ పార్వతి పాత్ర పోషిస్తున్న కన్నడ నటి యజ్ఞ శెట్టి లుక్ ఇటీవలే విడుదల చేశారు.
రాకేష్ రెడ్డి నిర్మిస్తున్న ఈమూవీకి కల్యాణ్ మాలిక్ సంగీతం అందిస్తున్నారు. జనవరి 24న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు వర్మ కొన్ని రోజుల క్రితం ప్రకటించినప్పటికీ అందుకు సంబంధించిన హడావుడి అయితే కనిపించడం లేదు.


Click it and Unblock the Notifications











