ఓసేయ్.. నిన్ను వదలను, నీ అంతు చూస్తా: రాజ్ తరుణ్ వీడియో వైరల్
రాజ్ తరుణ్ - లావణ్య- మాల్వీ మల్హోత్రాల వ్యవహారం టాలీవుడ్‌లో తీవ్ర చర్చనీయాంశమైంది. లావణ్య అనే యువతి తాను , రాజ్ తరుణ్ రిలేషన్‌లో ఉన్నామని.. 11 ఏళ్లుగా కలిసే ఉంటున్నామని తీరా ఇప్పుడు తనను దూరం పెట్టి మరో అమ్మాయితో అఫైర్ పెట్టుకున్నాడని సంచలన వ్యాఖ్యలు చేయడంతో పాటు ఏకంగా పోలీస్ స్టేషన్ గడప తొక్కింది.తాను గర్భం దాల్చితే రాజ్ తరుణ్ అబార్షన్ చేయించాడని ఆరోపించింది. దీనికి సంబంధించిన మెడికల్ రిపోర్టులు, దాదాపు 170 ఫోటోలను పోలీసులకు అందజేసింది. హీరోయిన్ మాల్వీ మల్హోత్రా ట్రాప్‌లో రాజ్ తరుణ్ పడ్డారని.. అతనిని వదిలివేయమని అడిగితే ఆమె, తన సోదరుడు కలిసి తనను బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేసింది.
తనపై ఆరోపణలు వచ్చిన వెంటనే హీరో రాజ్ తరుణ్ స్పందించారు. లావణ్య తనకు ఎప్పటి నుంచో తెలుసునని, ఇద్దరం కలిసి సహజీవనం చేసిన మాట వాస్తవమేనని అంగీకరించారు. 2017 వరకు లావణ్యతో రిలేషన్‌లో ఉన్నానని.. కానీ తర్వాత ఆమె డ్రగ్స్‌కు బానిస అయ్యిందని దాంతో దూరం పెట్టినట్లు రాజ్ తరుణ్ చెప్పారు. మాల్వీ కూడా మీడియా ముందుకు వచ్చి లావణ్య ఆరోపణలపై క్లారిటీ ఇచ్చారు.

రాజ్‌తరుణ్ తనకు ఫ్రెండ్ మాత్రమేనని.. అతనితో ఆరు నెలలుగా మాట్లాడలేదని స్పష్టం చేసింది. తన పరువు ప్రతిష్టకు భంగం కలిగేలా మాట్లాడినందుకు గాను ఆమె హైదరాబాద్ ఫిలింనగర్ పోలీస్ స్టేషన్‌లో లావణ్యపై ఫిర్యాదు చేసింది. రాజ్ తరుణ్‌పై 420, 493, 506 కింద కేసు నమోదైందని .. పోలీసులు వారం రోజుల పాటు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి, ఆధారాలు పరిశీలించాకే కేసు నమోదు చేశారని న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర చెప్పారు. ఈ వరుస ట్విస్టుల నేపథ్యంలో రాజ్ తరుణ్ ఓ వీడియోను రిలీజ్ చేసి అందులో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
'' తన జీవితంలో అమ్మాయి అనే టాపిక్ వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. చిన్నప్పటి నుంచి తన ఫ్రెండ్స్ .. అమ్మాయిలతో తిరుగుతుంటే నేను ఇంటి దగ్గర అమ్మకి కొత్తిమీర, కరివేపాకు తెచ్చుకుంటూ తిరిగేవాడిని. మా ఫ్రెండ్స్‌ని చూస్తే అసూయ..అమ్మాయిలతో మాట్లాడాలంటే భయం. మన జీవితంలో లవ్వు, గివ్వు సెట్ కావని అప్పుడే అర్ధమయ్యింది. సిన్సియర్‌గా వెళ్లి అమ్మానాన్నలను నాకు పెళ్లి చేయమని అడిగా.. మొదట్లో వాళ్లు కంగారు పడ్డారు. కానీ నా కరువుని అర్ధం చేసుకుని ఓ మంచి సంబంధం చూశారు. ఇంకేముంది పెళ్లి సెట్, మంటపం సెట్, రాబందులు (అదే చుట్టాలు) వచ్చారు . పండక్కి గంగిరెద్దుని రెడీ చేసినట్లు నన్ను పెళ్లి పీటలపై కూర్చోబెట్టారు ''.
'' చిన్నప్పటి నుంచి సినిమాల్లో చూపించినట్లు గ్రాండ్‌గా పెళ్లి, ఆ తర్వాత కార్యం ఊహించుకున్నా. పంతులు పెళ్లి కూతురిని తీసుకురామ్మా అని చెప్పారు. వాళ్ల చెల్లి వెళ్లి ఒక ఉత్తరం పట్టుకొచ్చింది.. అది (పెళ్లికూతురు).. నా నోటితో నేను చెప్పలేను మీకు అర్ధమయ్యే ఉంటది. మొగుడు పోయి ముండ ఏడుస్తుంటే.. రంకు మొగుడొచ్చి రాయి విసిరినట్లు చుట్టాలందరూ వచ్చి ఎదవ ఎటకారాలు. చచ్చిన పాముని ఇంకెంత సేపు చంపుతారండి.. వాళ్లని కాదు, దాన్ని (పెళ్లి కూతురు) అనాలి. ఓసేయ్ నువ్వెక్కడున్నా పట్టుకుంటా , నీ అంతు చూస్తా. రేపే నీ ఫోటో ఆన్‌లైన్‌లో పెడతా. మీరందరూ అది కనబడితే దయచేసి నాకు చెప్పండి.. ప్లీజ్ '' అంటూ రాజ్ తరుణ్ ముగించారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు.. లావణ్య గురించేనా, లేక తన పీటలపై పెళ్లి ఆగిపోయిందా, ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు అంటూ నెటిజన్లు బుర్ర గొక్కుంటున్నారు.


Click it and Unblock the Notifications











