మా ఎలక్షన్స్ లో ట్విస్ట్… తెర మీదకు మరో 'మా'.. చేతులు జోడించి అడుగుతున్నా అంటూ!
సెప్టెంబర్ నెలలో జరగవలసిన మా ఎన్నికలు ఇప్పటి నుంచే రచ్చ రేపుతున్న సంగతి తెలిసిందే.. ప్రకాష్ రాజ్ బరిలోకి దిగుతున్నా అని ప్రకటించినది మొదలు ఇప్పటి దాకా ఈ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. ఐదో వ్యక్తిగా బరిలోకి దిగిన సీవీఎల్ నరసింహ రావు ఆంధ్ర తెలంగాణా అంటూ కొత్త కోణం రేపారు. ఈ క్రమంలో ఇప్పుడు మరో దర్శకుడు తెరమీదకు వచ్చారు.

ఏపీ - తెలంగాణా రచ్చ
తాజాగా మీడియా ముందుకు వచ్చిన సివిఎల్ నరసింహారావు 'మా'లో తెలంగాణ కళాకారులకు అన్యాయం జరుగుతోందని చెబుతూ మా అసోసియేషన్ లో కూడా తెలంగాణ అసోసియేషన్, ఆంధ్ర అసోసియేషన్ అంటూ రెండు శాఖలుగా ఏర్పాటు చేయాలని కోరారు. తాజాగా ఈ వ్యాఖ్యల మీద 'మా ఆంధ్రప్రదేశ్' వ్యవస్థాపకుడు దర్శకుడు దిలీప్ రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు.

రెండు 'మా'లు కావాలి
జూన్ 29న మీడియాతో మాట్లాడిన ఆయన తెలుగు రాష్ట్రాలు రెండు విడిపోయిన అనంతరం ఆంధ్రప్రదేశ్ లో 'మా ఆంధ్ర ప్రదేశ్' పేరుతో 24 విభాగాల యూనియన్ నెలకొల్పినట్లు ఆయన చెప్పుకొచ్చారు. అంతే కాక దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని కార్మిక శాఖ నుంచి రిజిస్ట్రేషన్ కూడా ఉందని ఇప్పటికే కార్మిక శాఖ ఆమోదం కూడా పొందామని చెప్పుకొచ్చారు.

మాకు ముందే ఉంది
సినీ నటి కవిత అధ్యక్షురాలిగా, నరసింహారాజు ప్రధాన కార్యదర్శిగా, అన్నపూర్ణమ్మ కార్యదర్శిగా ఉన్న ఈ ఆంధ్ర ప్రదేశ్ యూనియన్ లో టీవీ/సినిమా రంగాలకు చెందిన 24 విభాగాలకు చెందిన సాంకేతిక నిపుణులు, నటీనటులు మొత్తం 500 మంది సభ్యులుగా ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు. రాష్ట్ర విభజన జరిగింది కాబట్టే 'మా ఆంధ్రప్రదేశ్' స్థాపించారని పేర్కొన్న ఆయన తాము హైదరాబాదులో ఉన్న మా సంస్థకు వ్యతిరేకం కాదని చెప్పుకొచ్చారు.

చేతులు జోడిస్తున్నా
అంతేకాక ఆయన మాట్లాడుతూ ఒక తల్లిపాలు తాగే వాళ్ళు, ఒక చెట్టు కింద నుండి వచ్చిన వాళ్ల మధ్య విభేదాలు, వివాదాలు, వర్గాలు పోటీపోటీగా ఉండడంతోనే ఈ మా ఎన్నికలు ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశంగా అయ్యాయని అన్నారు. ఇక సినిమా పెద్దలైన చిరంజీవి, మోహన్ బాబు, బాలకృష్ణ తదితరులు కలుగజేసుకుని మా ఎన్నికలను ఏకపక్షంగా చేయమని చేతులు జోడిస్తున్నానని ఆయన అన్నారు.

ఏమంటారో
పోటీలో ఉన్న అందరితో సంప్రదింపులు జరిపి ఒకరికి కొంతకాలం మరొకరికి మిగతా కాలం పదవిని కట్టబెట్టి ఎన్నికలు లేకుండా ఏకపక్షం చేసి పరిశ్రమ స్థాయిని మరింత చేయవలసిందిగా ఆయన కోరారు. ఈ వ్యవహారం మీద మా నుంచి కానీ, పోటీ చేసిన అభ్యర్ధుల నుంచి అయినా సరైన స్పందన వస్తుందో లేదో వేచి చూడాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











