MAA Elections పూర్తి.. గతమెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయి పోలింగ్.. ఎవరికీ ప్లస్?
చాలా కాలంగా చర్చనీయాంశంగా మారిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది.. వాస్తవానికి ఎన్నికల ప్రక్రియ రెండు గంటల లోపు ముగియాల్సి ఉండగా ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానల్స్ కోరిక మేరకు మరో గంట సేపు పొడిగించారు. అయితే ఈ సారి ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయి పోలింగ్ నమోదు కావడం ఆసక్తికరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

ఏకగ్రీవం అయ్యేలా
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అంటే తెలుగు నటీనటులకు సంబంధించి ఒక అసోసియేషన్ బాగుంటుందనే ఉద్దేశంతో చిరంజీవి ఫౌండర్ ప్రెసిడెంట్గా 1993వ సంవత్సరంలో అసోసియేషన్ మొదలైంది. అయితే గత రెండు మూడు టర్మ్ లకు ముందు వరకు కూడా ఈ ఎన్నికలు ఏకగ్రీవంగా జరుగుతూ వచ్చాయి. 2015లో సాధారణ ఎన్నికలను తలపించేలా రాజేంద్రప్రసాద్, నటి జయసుధ మధ్య జరిగిన పోటీలో రాజేంద్రప్రసాద్ 'మా' అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2017-19 'మా' అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి అసోసియేషన్ సభ్యులు శివాజీ రాజాను ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు..

గత ఎన్నికల్లో కూడా అలాగే
అయితే మళ్లీ 2019-2021 ఎన్నికలు తారస్థాయికి చేరాయి. గతంలో ఒకే ప్యానెల్‌లో ప్రెసిడెంట్, జనరల్ సెక్రెటరీగా పనిచేసిన శివాజీరాజా, నరేశ్‌లు ప్రెసిడెంట్ పదవికి కోసం పోటీపడ్డారు. అసోసియేషన్ నిధుల విషయంలో అవకతవకలుకి పాల్పడ్డారంటూ ఒకరినొకరు తీవ్రంగా విమర్శించుకునే స్థాయికి దారి తీసిన పరిస్థితుల్లో ఎన్నికలు జరగగా నరేష్ 'మా' అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

వాడి వేడిగా
గత ఎన్నికలతో పోలిస్తే, ఈసారి ఎన్నికలు మరింత ఉత్కంఠగా మారాయి. ఎన్నికల ప్రకటన కూడా రాకుండా వాడీవేడీగా చర్చలు, ఆరోపణలు, సవాళ్లు, ప్రతి సవాళ్లతో ప్రచారం సాగింది. 'మా' ఎన్నికల్లో అధ్యక్షుడిగా బరిలో దిగుతున్నట్లు ప్రకాశ్ రాజ్ ప్రకటించగా, ఆ తర్వాత మంచు విష్ణు, సీవీఎల్ నరసింహారావు, హేమ, జీవిత రాజశేఖర్ తదితరులు కూడా తాము అధ్యక్ష బరిలో ఉంటానని ప్రకటించారు.

అనేక ట్విస్టుల
అయితే చివరికి ఎన్నికల్లో అధ్యక్ష పోటీలో లేమని జీవిత, హేమ ప్రకటించి ఇద్దరూ ప్రకాశ్‌రాజ్ ప్యానెల్‌కు మద్దతు తెలిపారు. ఈ క్రమంలో ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణు, సీవీఎల్ నరసింహారావులు నామినేషన్‌లు సమర్పించారు. ఆ తర్వాత 'మా' అధ్యక్ష బరిలో నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. చివరికి ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు ప్యానెల్స్ పోటీకి దిగగా వారి మధ్య ప్రచారం వ్యక్తిగత దూషణల వరకూ వెళ్లింది.

ప్రస్తుతం ‘మా' సభ్యులు ఎంతమంది?
మా ఎన్నికల పోలింగ్ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జరిగింది. ప్రస్తుతం మా లో మొత్తం 905 మంది సభ్యులు ఉండగా, 883 వాలిడ్ ఓటర్లు ఉన్నారు. ఇక ఈరోజు జరిగిన ఓటింగ్ లో మా ఎన్నికల చరిత్రలో కొత్త రికార్డు నమోదయింది. ఈ సారి ఓటు హక్కు 665(605 నేరుగా+60 పోస్టల్ బ్యాలెట్లు) మంది వినియోగించుకున్న కారణంగా 83 శాతం పోలింగ్ నమోదు అయింది. గత ఎన్నికల్లో 474 ఓట్లు మాత్రమే పోల్ అయ్యాయి.
Recommended Video

'మా' అధ్యక్షుడు ఎవరు అవుతారు అంటే?
'మా' అసోసియేషన్‌లో 26 మంది ఎక్సిక్యూటివ్ కమిటీ సభ్యుల కోసం జరిగే ఓటింగ్‌లో ఒక్కో ఓటరు 26 ఓట్లు వేయాలి. మొత్తం పోలైన ఓట్లలో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారిని విజేతగా ప్రకటిస్తారు. అధ్యక్షుడైనా, ఈసీ సభ్యుడైనా ఇదే నిబంధన వర్తిస్తుంది. అయితే ఇక్కడే ఓ ఆసక్తికరమైన విషయం ఉంటుంది. ఎన్నికల్లో రెండు వేర్వేరు ప్యానెల్స్‌లో ఉండి పోటీ చేసిన అభ్యర్థులు గెలిచాక ఒకే ప్యానెల్‌గా మారాల్సి ఉంటుంది. అధ్యక్షుడిగా ఎవరైతే విజేతగా నిలుస్తారో అతని ఆధ్వర్యంలో మిగతా సభ్యులు పనిచేయాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications











