ప్రధాని మోదీనే తిట్టాడు.. మా సభ్యులను తిట్టరనే గ్యారెంటీ ఏంటి? ప్రకాశ్ రాజ్‌పై నరేష్ ఫైర్
తెలుగు సినిమా పరిశ్రమలో మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (మా) ఎన్నికల అంశం వాడివేడిగా మారింది. విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ ప్యానల్, మంచు విష్ణు ప్యానెల్ మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు ఆసక్తికరమైన చర్చకు దారి తీస్తున్నాయి. అలాగే రెండు ప్యానెల్స్ రూపొందించుకొంటున్న మ్యానిఫెస్ట్ గురించిన అంశాలు ఇంట్రెస్టింగ్‌గా మారాయి. మంచు విష్ణుకు మాజీ మా అధ్యక్షుడు వీకే నరేష్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సంక్షేమం దిశగా మా సంస్థ కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. సినీ పరిశ్రమను సేవ్ చేసే గుణం ఉండాలి.. కానీ షేవ్ చేసే ప్యానెల్ ఉండకూడదు అని వీకే నరేష్ అన్నారు.
ప్రకాశ్ రాజ్‌కు ఎవరు సపోర్ట్ చేస్తున్నారో బయటకు వచ్చి చెప్పాలి. గతంలో మా ప్యానెల్ పోటీ చేస్తున్న సమయంలో నాగబాబు వచ్చి మద్దతు తెలిపారు. దాంతో మాకు కొంత సానుకూల పరిస్థితులు, మనోధైర్యం కలిగింది. మా ప్రసిడెంట్‌ను అందరూ కలిసి ఎన్నుకొన్నప్పుడు.. 14 మంది విడిపోయి మేమే నిజమైన కమిటీ అని చెప్పారు. ఆ విషయాన్ని నేను ప్రస్తావంచాను. అందుకే కొందరు స్పాన్సర్ టెర్రరిజం ఉందని చెప్పాను. ప్రస్తుత పరిస్థితుల్లో దాసరి లేని లోటు కనిపిస్తున్నది. ఎన్నికల తర్వాత ఇండస్ట్రీకి పెద్ద దిక్కు కావాలి. ఎన్నికల తర్వాత ఆ విషయంపై నేను, మోహన్ బాబు కలిసి మీటింగ్ పెడుదాం అని వీకే నరేష్ అన్నారు.

మంచు విష్ణు ప్యానెల్ ఎలాంటి వివాదాలకు తావు లేని ప్యానెల్. ఎవరైనా వివాదంగా ఉంటే మేము వారిని ప్యానెల్ నుంచి తొలగిస్తాం అని అన్నారు. పోసాని, పవన్ కల్యాణ్ వివాదం గురించి అడిగిన ప్రశ్నకు దాటవేతకు వీకే నరేష్ ప్రయత్నించారు.
ప్రకాశ్ రాజ్ స్పీచ్ నేను ఫాలో అయ్యాను. ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్. అలాంటి దేశంలో జరిగిన ఓటింగ్‌ను కించపరిచేలా మాట్లాడారు. నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి..ప్రధాని అయిన వ్యక్తిని, కోట్ల మంది ఎన్నుకొన్న వ్యక్తిని ప్రకాశ్ రాజ్ దిగజారినట్టు మాట్లాడారు. ప్రధాని మోదీని కించపరిచే విధంగా మాట్లాడిన ప్రకాశ్ రాజ్.. మా సభ్యులను వ్యతిరేకించరనే గ్యారెంటీ ఏమున్నది అని వీకే నరేష్ ప్రశ్నించాడు. కన్నడ సినీ పరిశ్రమలో ప్రకాశ్ రాజ్ పోటీ చేశాడు. అక్కడ ఫలితం ఏమైందో మీకు తెలుసు అని వ్యంగ్యాస్త్రాలను విసిరారు. మా సంఘానికి ఎన్నికలు రావొద్దని అనుకొన్నాం. కానీ పోటీ తప్పలేదు. అందుకే మంచు విష్ణుకు మద్దతు తెలియజేస్తున్నాను అని వీకే నరేష్ తెలిపారు.
చెన్నైలో తెలుగు సినీ పరిశ్రమ ఉన్నప్పుడు తెలుగు వారికి ఓ సంస్థ ఉండాలని తెలుగు సినీ నటుల అసోసియేషన్ సూపర్ స్టార్ కృష్ణ ఇంటిలో ఏర్పడింది. హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ఏర్పడింది. అలాంటి సంస్థలో ఏ భాషకు చెందిన నటులైనా సభ్యత్వం తీసుకోవచ్చు. స్థానికతను పక్కన పెడితే.. తెలుగు వాళ్లే అధ్యక్షుడు కావాలి. తెలుగువాడిగా గర్వంగా చెబుతున్నా అని ప్రకాశ్ రాజ్‌పై వీకే నరేష్ ఘాటుగా స్పందించారు.


Click it and Unblock the Notifications











