విజయ్ దేవరకొండ కు పోలీస్ పహరా.. రక్షణ వలయంలో కింగ్డమ్!
ఇటీవలి కాలంలో కొన్ని సినిమాలు వివాదాస్పదమవుతున్నాయి. తమ ప్రాంతం, భాష, సంస్కృతికి చెడ్డపేరు తీసుకొచ్చేలా.. తమ మనోభావాలు దెబ్బతినేలా ఆయా సినిమాలు ఉన్నాయంటూ పలు ప్రాంతాల్లో గొడవలు, నిరసనలు చోటు చేసుకున్నాయి. మరాఠా యోధుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఛావా రిలీజ్ సమయంలో కొన్ని వర్గాలు మండిపడ్డాయి. తమ మనోభావాలు దెబ్బతినేలా ఉన్న ఈ సినిమాను నిషేధించాలని పలు చోట్ల గొడవలు జరిగాయి. తాజాగా ఈ జాబితాలోకి చేరింది కింగ్డమ్.
కింగ్డమ్ బడ్జెట్ ఎంత?
జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన చిత్రం కింగ్డమ్. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు ఈ సినిమాను దాదాపు 130 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. సత్యదేవ్, వెంకీటేష్ వీపీ, అయ్యప్ప శర్మ, గోపరాజు రమణ, మనీష్ చౌదరి, బాబురాజ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించగా.. గిరిష్ గంగాధరన్, టీ జాన్‌లు సినిమాటోగ్రాఫర్లుగా వ్యవహరించారు. జూలై 31న కింగ్డమ్ చిత్రం రిలీజైంది.

కింగ్డమ్ కథ, పాత్రలపై తమిళుల ఆగ్రహం
అయితే ఈ సినిమా ఇప్పుడు తమిళనాడులో తీవ్ర నిరసనలకు కారణమైంది. శ్రీలంకలోని స్థానిక గ్రూపుకు, వలస వెళ్లిన గ్రూపుకు మధ్య వివాదం .. హీరో తన అన్నయ్యని కలుసుకోవడం చుట్టూ కింగ్డమ్ కథ జరుగుతుంది. ఈ సినిమా కథ గతంలో శ్రీలంకలో అస్తిత్వం కోసం తమిళ ప్రజలు సాగించిన పోరాటాన్ని గుర్తుచేస్తుంది. అయితే ఈ తమిళ ఈలం గ్రూపును కింగ్డమ్ సినిమాలో తప్పుగా చూపించడంతో పాటు వారిని స్మగ్లర్లుగా, దొంగలుగా చూపించడంపై తమిళనాడు ప్రజలు మండిపడుతున్నారు.
కింగ్డమ్ థియేటర్ల వద్ద నిరసన
కింగ్డమ్ చిత్రంలోని కంటెంట్, పాత్రలు తమిళ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ నామ్ తమిజార్ కచ్చి సంస్థకు చెందిన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కింగ్డమ్‌ను ప్రదర్శిస్తున్న థియేటర్ల వద్ద నిరసనకు దిగడంతో పాటు సినిమా ప్రదర్శనను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. కింగ్డమ్ పోస్టర్లను, ఫ్లెక్సీలను చించివేయడం వంటి ఘటనలు తమిళనాడు వ్యాప్తంగా జరుగుతున్నాయి. అటు సోషల్ మీడియాలోనూ కింగ్డమ్‌పై ట్రోలింగ్ జరుగుతోంది. కింగ్డమ్‌ను బాయ్‌కాట్ చేయాలని.. మా మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ సినిమాను తీయడానికి ఎవరు డబ్బు ఇచ్చారో చెప్పాలంటూ తమిళులు కామెంట్స్ పెడుతున్నారు.
కోర్టు సంచలన ఆదేశాలు
ఈ వ్యవహారం అటు తిరిగి, ఇటు తిరిగి మద్రాస్ హైకోర్టుకు చేరుకుంది. కింగ్డమ్ చిత్రాన్ని ప్రదర్శిస్తున్న థియేటర్ల వద్ద రక్షణ కల్పించాలంటూ ఈ సినిమా నిర్మాతలు ఎస్ఎస్ఐ ప్రొడక్షన్స్ దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం విచారించిన అనంతరం కీలక ఆదేశాలు వెలువరించింది. విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్‌ను ప్రదర్శించే థియేటర్‌లకు భద్రత కల్పించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని మద్రాస్ హైకోర్ట్ గురువారం ఆదేశించింది.
సెన్సార్ బోర్డ్ నిర్ణయమే ఫైనల్
సినీ దర్శక నిర్మాతలకు తమ అభిప్రాయాలను వ్యక్తీకరించే హక్కు ఉందని, సెన్సార్ బోర్డ్ సర్టిఫై చేసిన సినిమా ప్రదర్శనకు ఎవరూ అంతరాయం కలిగించలేరని.. థియేటర్ యజమానులను సినిమాను ప్రదర్శించకుండా బెదిరించలేరని జస్టిస్ డీ భరత చక్రవర్తి తన తీర్పులో పేర్కొన్నారు. సినిమాపై నిరసన వ్యక్తం చేయాలనుకుంటే దానికి ముందుగా పోలీసుల అనుమతి పొంది, నిర్ణీత ప్రదేశాలలో మాత్రమే ఆందోళనలు నిర్వహించాలని కోర్టు పేర్కొంది. ప్రజాస్వామ్యంలో ఎలాంటి వ్యతిరేక అభిప్రాయాన్ని వ్యక్తీకరించడానికైనా స్వేచ్ఛ ఉంటుందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. కోర్టు తీర్పుతో కింగ్డమ్ నిర్మాతలు, విజయ్ దేవరకొండ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.


Click it and Unblock the Notifications











