‘మహాసముద్రం’ రిలీజ్ డేట్ ప్రకటన: ఇద్దరు హీరోల మధ్య యుద్ధం అప్పటి నుంచే
గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో వరుసగా మల్టీస్టారర్ మూవీలు వస్తూనే ఉన్నాయి. ప్రేక్షకుల ఆలోచనా ధోరణిలో మార్పులు కనిపించడంతో హీరోలు ధైర్యం చేస్తున్నారు. దీంతో దర్శక నిర్మాతలు అదే తరహా చిత్రాలు రూపొందించేందుకు ముందుకు వస్తున్నారు. ఇందులో భాగంగానే టాలెంటెడ్ హీరో శర్వానంద్.. లవర్ బాయ్ సిద్ధార్ద్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రమే 'మహాసముద్రం'. 'RX 100' సినిమా ద్వారా తెలుగు చిత్ర సీమకు పరిచయం అయిన దర్శకుడు అజయ్ భూపతి ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించారు.
మూడు నాలుగు రోజులుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో కొత్త చిత్రాలకు సంబంధించిన విడుదల తేదీలు ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలోనే 'మహాసముద్రం' చిత్రాన్ని ఆగస్టు 19న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు ఆ చిత్ర యూనిట్ కొద్ది సేపటి క్రితమే ప్రకటించింది. ఇక, ఈ చిత్రంలో అదితి రావ్ హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా చేస్తున్నారు. బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ ఇందులో స్పెషల్ సాంగ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సున్నితమైన భావోద్వేగాలతో కూడిన ప్రేమకథతో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు.

'RX 100' వంటి హిట్ సినిమాను తెరకెక్కించినా.. రెండో ప్రాజెక్టు విషయంలో చాలా గ్యాప్ తీసుకున్నాడు దర్శకుడు అజయ్ భూపతి. సుదీర్ఘ విరామం తర్వాత అతడు తన డ్రీమ్ ప్రాజెక్టు 'మహాసముద్రం'ను పట్టాలెక్కించేశాడు. వాస్తవానికి ఈ సినిమాలో నటించేందుకు గానూ ఎంతో మంది హీరోలకు కథను చెప్పినా.. వాళ్లెవరూ దీనికి పచ్చజెండా ఊపలేదు. కొందరు ఒప్పుకున్నా.. హోల్డ్‌లో పెట్టి ఉంచారు. ఈ నేపథ్యంలో టాలెంటెడ్ హీరో శర్వానంద్, సిద్దార్ధ్ కాంబినేషన్‌లో దీన్ని తీస్తున్నాడు. ఇద్దరు హీరోల మధ్య ప్రేమ విషయంలో జరిగే యుద్ధంతో ఈ మూవీ రూపొందుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.


Click it and Unblock the Notifications











