Guntur Kaaram Mass Strike రికార్డు సృష్టిస్తున్న గుంటూరు కారం గ్లింప్స్.. మహేష్ ఊర మాస్ లుక్ వైరల్
అతడు, ఖలేజా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మరోసారి ప్రేక్షకులను ఆలరించేందుకు సిద్దమయ్యారు. మహేష్ బాబు కెరీర్ లో 28వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌లో ఎస్ రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. స్టార్ హీరోయిన్లు పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో లెజెండ్ సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా మే 31న SSMB28 టైటిల్, గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు గుంటూరు కారం అంటూ గ్లింప్స్ రిలీజ్ చేయగా అభిమానుల నుంచి భారీ రెస్పాన్స్ లభించింది. ఈ గ్లింప్స్ వివరాల్లోకి వెళితే.
SSMB28 టైటిల్ అనౌన్స్‌మెంట్ కార్యక్రమం బుధవారం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ థియేటర్‌లో అభిమానుల సమక్షంలో వైభవంగా జరిగింది. సూపర్ స్టార్ అభిమానుల కేరింతల నడుమ, అభిమానుల చేతుల మీదుగానే సాయంత్రం 6:03 గంటలకు 'మాస్ స్ట్రైక్' పేరుతో మహేష్ బాబు సినిమా గ్లింప్స్‌ను అట్టహాసంగా విడుదల చేశారు.

మహేష్‌బాబు-త్రివిక్రమ్ హ్యాట్రిక్ మూవీకి గుంటూరు కారం అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను డిసైడ్ చేశారు. గుంటూరు నేపథ్యంలో రూపొందుతోన్న యాక్షన్, ఎంటర్‌టైనర్ అనే విషయం స్పష్టమైంది. మహేష్ చిటికెతో ప్రారంభమైన గ్లింప్స్‌లో కర్రసాముతో రౌడీ గ్యాంగ్‌ను చితక్కొట్టే సన్నివేశం మాస్ ప్రేక్షకులను ఆకట్టుకొన్నది. ఎరుపు రంగ చెక్ షర్ట్ ధరించి, తలకి ఎర్ర కండువా చుట్టుకొని ఉన్న మహేష్ సరికొత్త లుక్ ఆకట్టుకొన్నారు.
తన అభిమానుల అంచనాలకు తగినట్టుగా మహేష్ బాబు మాస్ అవతారంలో నోటిలో నుంచి స్టైల్‌గా బీడీని తీసి, దానిని స్టైల్‌గా వెలిగించి "ఏంది అట్టా చూస్తున్నావు.. బీడీ 3D లో కనపడుతుందా అంటూ తనదైన శైలిలో డైలాగ్ చెప్పి మహేష్ ఫ్యాన్స్‌ను ఫిదా చేశారు. భారీ బ్లాస్ట్ తో జీప్ గాల్లో ఎగరగా, మహేష్ తన కాలి దుమ్ముని దులుపుకొని నడుస్తున్నట్లుగా వీడియోని ముగించిన తీరు మెప్పిస్తున్నది.

ఇక గుంటూరు కారం టైటిల్‌కు తగినట్టే అభిమానుల, సినిమా ప్రేమికుల నుంచి భారీ స్పందన వ్యక్తమవుతున్నది. కొద్ది నిమిషాల్లోనే 2 మిలియన్ వ్యూస్ సాధించింది. కేవలం మూడు గంటల్లోనే ఈ చిత్రం 7 మిలియన్లకుపైగా వ్యూస్ సాధించింది. ఇంకా రికార్డు స్థాయి వ్యూస్ సాధించేందుకు పరుగులు పెడుతున్నది.
గుంటూరు కారం చిత్రం సంక్రాంతి కానుకగా 2024 సంవత్సరం జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. సంగీత ప్రపంచంలో సంచలనాలు సృష్టిస్తున్న తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఎడిటర్‌గా జాతీయ అవార్డ్ గ్రహీత నవీన్ నూలి, కళా దర్శకునిగా ఏఎస్ ప్రకాష్, ఛాయాగ్రాహకుడిగా పీఎస్ వినోద్ వ్యవహరిస్తున్నారు.

తారాగణం: మహేష్ బాబు, పూజా హెగ్డే, శ్రీలీల
రచన, దర్శకత్వం: త్రివిక్రమ్
నిర్మాత: ఎస్.రాధాకృష్ణ(చినబాబు)
బ్యానర్: హారిక అండ్ హాసిని క్రియేషన్స్
సంగీతం: తమన్
డీఓపీ: పి.ఎస్.వినోద్
ఆర్ట్ డైరెక్టర్: ఎ.ఎస్. ప్రకాష్
ఎడిటర్: నవీన్ నూలి
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్


Click it and Unblock the Notifications











