ప్లాన్ మార్చిన మహేశ్ బాబు: దుబాయ్ ఫ్లైట్ ఎక్కేందుకు సిద్ధమయ్యాడుగా!
ఆ మధ్య భారీ పరాజయాలతో ఇబ్బందులను ఎదుర్కొని.. ఇటీవలి కాలంలో వరుసగా 'భరత్ అనే నేను', 'మహర్షి', 'సరిలేరు నీకెవ్వరు' వంటి సూపర్ డూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. గత సంక్రాంతికి సందడి చేసిన అతడు.. తర్వాతి సినిమా కోసం ఎంతో సమయాన్ని తీసుకున్నాడు. ఈ క్రమంలోనే కుటుంబ కథా చిత్రాల దర్శకుడు పరశురాంతో కలిసి 'సర్కారు వారి పాట' అనే సినిమాను ప్రకటించాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో కలిసి మహేశ్ నిర్మిస్తున్నాడు.
ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రకటన ఎప్పుడో వెలువడినప్పటికీ.. పూజా కార్యక్రమాలు మాత్రం ఇటీవలే జరిగాయి. దీంతో సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం అవుతుందన్న టాక్ వినిపించింది. ఇలాంటి సమయంలో 'సర్కారు వారి పాట' జనవరి మూడో వారం నుంచి రెగ్యూలర్ షూటింగ్ జరుపుకోనుందని ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఇందులో భాగంగానే మొదటి షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో జరపబోతున్నారని, ఇందులో మహేశ్ బాబు, కీర్తి సురేష్ కాంబినేషన్ సీన్లను తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. దీని తర్వాత వెంటనే అమెరికాకు పయనం అవుతుందని అన్నారు.

అయితే, తాజా సమాచారం ప్రకారం.. హైదరాబాద్‌లో జరగాల్సిన షెడ్యూల్‌ను వాయిదా వేసిందట చిత్ర యూనిట్. అంతేకాదు, ఊహించని విధంగా దుబాయ్‌లో షెడ్యూల్ జరుపుకోడానికి సన్నాహాలు చేసినట్లు తెలిసింది. అక్కడ కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించిన తర్వాత భాగ్యనగరంలో షూటింగ్ ప్రారంభిస్తారని సమాచారం. ఇక, ఈ సినిమాలో బ్యాంకులను మోసం చేసి విదేశాలకు వెళ్లిపోతోన్న బడా వ్యాపారవేత్తలను టార్గెట్ చేయబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇక, ఈ సినిమాలో మహేశ్ బాబు రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడని కూడా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











