చిక్కుల్లో మహేష్‌బాబు.. ఆ స్కాంలో సూపర్‌స్టార్‌కు నోటీసులు.. అసలేం జరిగిందంటే?
ఇండియాలో సినీతారలు సినిమాలతో పాటు బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ ద్వారా యేటా వందల కోట్ల ఆదాయం పొందుతున్నారు. టాలీవుడ్ టూ బాలీవుడ్‌లలో ఎందరో స్టార్స్ బ్రాండ్ అంబాసిడర్‌లుగా దూసుకెళ్తున్నారు. కేవలం 30 సెకన్ల యాడ్‌లో నటిస్తే చాలు కోట్లు వచ్చి పడుతుండటంతో ఒకరిని చూసి మరొకరు వాణిజ్య ప్రకటనల్లో నటిస్తున్నారు. అయితే సెలబ్రెటీగా సామాజిక బాధ్యత కూడా తమ చేతుల్లో ఉందన్న సంగతిని చాలామంది విస్మరిస్తున్నారు. నకిలీ ఉత్పత్తులు, నాసిరకం బ్రాండ్స్, మోసపూరిత విధానాలను తెలియకుండా కొందరు.. తెలిస కొందరు ప్రమోట్ చేసి చిక్కుల్లో పడుతున్నారు.
బ్రాండ్ ప్రమోషన్‌తో ఇబ్బందులు
ఇటీవలి కాలంలో సినీనటులు , సెలబ్రెటీలు బ్రాండ్ ప్రమోషన్ విషయంలో లీగల్‌గా ఇబ్బందులు పడుతున్నారు. బెట్టింగ్ యాప్ కేసులో టాలీవుడ్ యాంకర్లు, సినీతారలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లపై హైదరాబాద్ పోలీసులు కేసులు నమోదు చేయడంతో పాటు విచారణకు కూడా పిలిచారు. ఇక మహదేవ్ బెట్టింగ్ యాప్, క్యూనెట్ వంటి సంస్థలకు ప్రమోషన్ చేసిన సెలబ్రెటీలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఇతర లా ఎన్‌ఫోర్స్‌మెంట్ సంస్థలు వెంటాడుతున్నాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు కూడా బ్రాండ్ ప్రమోషన్ విషయంలో ఇబ్బందుల్లో పడ్డారు.

సురానా గ్రూప్‌పై ఈడీ దాడులు
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోన్న సురానా గ్రూప్ చెన్నైలోని స్టేట్ బ్యాంక్ నుంచి వేల కోట్ల రూపాయలు రుణాన్ని తీసుకుని ఎగ్గొట్టినట్లుగా 2012లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కేసు నమోదు చేసింది. ఆర్ధిక లావాదేవీల కోణం ఉండటంతో ఈడీ రంగంలోకి దిగింది. దీనిలో భాగంగా ఈ సంస్థ ఛైర్మన్ ఇతర కీలక వ్యక్తుల ఇళ్లు, కార్యాలయాలపై దాడులు నిర్వహించింది. సురానా గ్రూప్ అనుబంధ సంస్థలైన సాయి సూర్య డెవలపర్స్, భాగ్యనగర్ ప్రాపర్టీస్ సంస్థలు వెంచర్ల పేరుతో రూ.100 కోట్లకు పైగా ప్రజలను మోసి చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో ఈ సంస్థ యజమానులు సతీష్ చంద్ర, నరేంద్ర సురానాలను పోలీసులు గతంలోనే అరెస్ట్ చేశారు.
మహేశ్‌కు గతంలోనే ఈడీ నోటీసులు
100 కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు జరిగినట్లు గుర్తించిన ఈడీ.. రూ.74 కోట్ల నగదును సీజ్ చేసింది. అయితే సాయి సూర్య డెవలపర్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా మహేశ్ బాబు వ్యవహరించారు. ఇందుకు గాను ఆయనకు రూ.5.9 కోట్లను పారితోషికంగా చెల్లించినట్లుగా ఈడీ ఆధారాలు సేకరించింది. ఈ చెల్లింపులు ఎలా చేశారన్న దానిపై ఈడీ అధికారులు గతంలోనే మహేశ్ బాబును విచారించాయి. తాజాగా సాయి సూర్య డెవలపర్స్ స్కాంకు సంబంధించి మరో కేసులో మహేశ్‌బాబుకు నోటీసులు వెళ్లినట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి.
సాయి సూర్య డెవలపర్స్‌పై ఫిర్యాదు
ఓ మహిళా డాక్టర్, మరో వ్యక్తి కలిసి హైదరాబాద్ శివార్లలోని బాలాపూర్ గ్రామంలో చెరో ఫ్లాట్ కొనడానికి 34 లక్షల 80 వేలు చెల్లించారు. అన్ని అనుమతులు ఉన్నాయని భావించడంతో పాటు మహేశ్ బాబు బ్రాండ్ అంబాసిడర్ కావడంతో విశ్వసించిన వారిద్దరూ డబ్బు చెల్లించారు. తర్వాత ఆ ప్రాంతంలో ఎలాంటి లేఔట్ లేదని తెలుసుకున్న బాధితులు.. మోసపోయామని గ్రహించి సాయి సూర్య ప్రతినిధులను నిలదీశారు. దీంతో పలు వాయిదాల్లో కేవలం 15 లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చారు. పలుమార్లు ఒత్తిడి తెచ్చినప్పటికీ మిగిలిన డబ్బును మాత్రం చెల్లించకపోవడంతో బాధితులు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమీషన్‌ను ఆశ్రయించారు.
మహేశ్‌కు వినియోగదారుల ఫోరం నోటీసులు
ఈ ఫిర్యాదును విచారణకు స్వీకరించిన కమీషన్.. సాయి సూర్య డెవలపర్స్, దాని యజమాని కంచర్ల సతీష్ చంద్రగుప్తాతో పాటు ఈ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన సూపర్‌స్టార్ మహేశ్ బాబును మూడో ప్రతివాదిగా చేర్చింది. అలాగే సోమవారం విచారణకు హాజరు కావాల్సిందిగా మహేశ్ బాబుకు కమీషన్ నోటీసులు జారీ చేసినట్లుగా వార్తలు వచ్చాయి. దీనిపై మహేశ్ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మరి సూపర్‌స్టార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











