Mahesh Babu : విచారణకు రాలేను .. ఈడీకి షాకిచ్చిన మహేశ్ బాబు
టాలీవుడ్ అగ్ర కథానాయకుడు , సూపర్‌స్టార్ మహేశ్ బాబుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు ఇచ్చిన వ్యవహారం చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేసిన మహేశ్ ఎంత పారితోషికం తీసుకున్నారు? దాని చెల్లింపులు ఎలా చేశారు? అనేది ఆరా తీయడానికే ఈడీ నోటీసులు ఇచ్చినట్లుగా వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వ్యవహారం కీలక మలుపు తిరిగింది.
సినిమాలతో బిజీగా ఉంటూనే బ్రాండ్ అండార్స్‌మెంట్స్‌తో కోట్లు సంపాదిస్తున్నారు మహేశ్ బాబు. టాలీవుడ్‌లోనే కాదు.. దక్షిణాది ఇండస్ట్రీలోనూ బ్రాండ్ ప్రమోషన్ విషయంలో మహేశ్ దరిదాపుల్లో ఏ హీరో లేరు. ఐదు సెకన్ల యాడ్‌లో నటించినందుకు రూ.5 కోట్లు తీసుకున్న సూపర్‌స్టార్ అప్పట్లో మౌంటేన్ డ్యూ కోసం రూ.12 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుని ఇండస్ట్రీకి షాకిచ్చారు. సినిమాలు, వ్యాపారాలు, బ్రాండ్ ప్రమోషన్‌తో ఏడాదికి రూ.200 కోట్ల పైనే సంపాదిస్తున్నారు మహేశ్.

ఇటీవలి కాలంలో సినీతారలు , ఇతర సెలబ్రెటీలు బ్రాండ్ ప్రమోషన్ విషయంలో చట్టపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. బెట్టింగ్ యాప్ కేసులో టాలీవుడ్ యాంకర్లు, సినీతారలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. గతేడాది మహదేవ్ బెట్టింగ్ యాప్, క్యూనెట్ వంటి సంస్థలకు ప్రమోషన్ చేసిన సెలబ్రెటీలు ఇప్పటికీ కేసులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే మహేశ్ బాబు కూడా ఇబ్బందుల్లో పడ్డారు.
హైదరాబాద్ కేంద్రంగా వ్యాపారాలు నిర్వహిస్తున్న సురానా గ్రూప్ చెన్నైలోని స్టేట్ బ్యాంక్ నుంచి వేల కోట్ల రూపాయలు రుణాన్ని తీసుకుని ఎగ్గొట్టినట్లుగా 2012లోనే సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో భాగంగా ఈడీ అధికారులు ఈ సంస్థ ఛైర్మన్ ఇతర కీలక వ్యక్తుల ఇళ్లు, కార్యాలయాలపై దాడులు నిర్వహించింది. సురానా గ్రూప్ అనుబంధ సాయి సూర్య డెవలపర్స్, భాగ్యనగర్ ప్రాపర్టీస్ సంస్థలు వెంచర్ల పేరుతో రూ.100 కోట్లకు పైగా ప్రజలను మోసి చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో ఈ సంస్థ యజమానులు సతీష్ చంద్ర, నరేంద్ర సురానాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈడీ కూడా రంగంలో దిగి దాదాపు రూ.100 కోట్ల అక్రమ లావాదేవీలకు సంబంధించిన పత్రాలను గుర్తించింది. అలాగే రూ.74 కోట్ల నగదును సీజ్ చేసింది. సాయి సూర్య డెవలపర్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా మహేశ్ బాబు వ్యవహరించారు. ఇందుకు గాను రూ.5.9 కోట్లను పారితోషికంగా చెల్లించినట్లుగా ఈడీ ఆధారాలు సేకరించింది. ఈ చెల్లింపులు ఎలా చేశారన్న దానిపై ఈడీ అధికారులు మహేశ్ నుంచి ఆరా తీసేందుకు ఆయనకు నోటీసులు ఇచ్చి ఈ నెల 28న తమ ఎదుట హాజరు కావాల్సిందిగా ఆదేశించింది.
దీంతో మహేశ్ విచారణకు హాజరవుతారా? లేదా? అన్న దానిపై టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో సూపర్‌స్టార్ షాకిచ్చారు. ముందుగా నిర్దేశించిన కార్యక్రమాలు , సినిమా షూటింగ్ కారణంగా సోమవారం (ఏప్రిల్ 28)న తాను విచారణకు హాజరు కాలేనని , మరో తేదీ నిర్ణయించాల్సిందిగా ఈడీ అధికారులకు ఈమెయిల్ ద్వారా విజ్ఞప్తి చేశారు మహేశ్. దీనిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తి మారింది.


Click it and Unblock the Notifications











