Mahesh Babu కు తీవ్ర విషాదం.. సూపర్ స్టార్‌కు మాతృవియోగం.. మరణానికి కారణం ఏమిటంటే?
సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి ఇకలేరు. గత కొద్దికాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఇందిరాదేవి సూపర్ స్టార్ కృష్ణ మొదటి భార్య అనే విషయం తెలిసిందే. మాతృవియోగంతో బాధపడుతున్న మహేష్ బాబుకు అభిమానులు, స్నేహితులు, సన్నిహితులు తదితరులు సంతాపం తెలియజేస్తున్నారు.

కొద్దికాలంగా అనారోగ్యంతో
మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవల సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే వేడుకల్లో చాలా నీరసంగా కనిపించారు. ఇటీవల తీవ్ర అస్వస్థలకు గురి కావడంతో ఆమెను గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్‌లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. గత వారం రోజులుగా ఆమెకు వెంటిలేటర్ సాయంతో చికిత్సను వైద్యులు అందించారు.

మహేష్ బాబుకు వరుస విషాదాలు
మహేష్ బాబుకు వరుస విషాదాలు తీవ్ర శోకానికి గురిచేస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం సోదరుడు రమేష్ బాబు అనారోగ్యంతో మృతి చెందడం తెలిసిందే. అలాగే పినతల్లి, దర్శకుడు విజయ్ నిర్మల స్వర్గస్తులయ్యారు. అలాగే తనకు ఇష్టమైన జర్నలిస్టు బీఏ రాజు కూడా మరణించడం లాంటి సంఘటనలు మహేష్ బాబు జీవితంలో ఇటీవల చోటు చేసుకొన్నాయి.

తల్లి గురించి మహేష్ బాబు
మహేష్ బాబుకు తన తల్లితో విడదీయలేనంత అనుబంధం ఉంది. పలు సందర్భాల్లో తన తల్లి గురించి చాలా సార్లు ఎమోషనల్‌గా చెప్పారు. నాకు మా అమ్మ దేవుడి లాంటి వారు. నేను ఏదైనా టెన్షన్ లేదా నెర్వస్‌గా ఉంటే ఆమె ఇంటికి వెళ్తుంటాను. ఆమె చేతితో కాఫీ తాగితే అన్ని టెన్షన్లు మాయం అవుతాయి. అలాంటి బంధం మా అమ్మతో ఉందని మహేష్ పలు మార్లు చెప్పారు.

మహేష్ బాబుకు సంతాపాలు
మహేష్ బాబు తల్లి మరణ వార్త వినగానే అభిమానులు భారీ స్థాయిలో ట్విట్టర్‌లో సంతాపం తెలిపారు. పలువురు సన్నిహితులు, స్నేహితులు, సినీ ప్రముఖులు స్వయంగా సంతాపం తెలిపి మానసిక ధైర్యాన్ని ఇచ్చారు. ఈ విషాద సమయంలో సోషల్ మీడియాలో మహేష్ బాబు ట్రెండింగ్‌లోకి వచ్చారు.

అంత్యక్రియలు ఎప్పుడంటే?
మహేష్ బాబు పీఆర్ టీమ్ అధికారికంగా మరణవార్తను ధృవీకరించి.. వివరాలను అందజేస్తూ.. ప్రముఖ నటుడు సూపర్ స్టార్ కృష్ణ గారి సతీమణి, సూపర్ స్టార్ మహేష్ బాబుగారి తల్లి శ్రీమతి ఘట్టమనేని ఇందిరాదేవి గారు కొద్దిసేపటి కిందట మృతి చెందారు. ఇందిరాదేవి గారు గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ రోజు ఉదయం తొమ్మిది గంటలకు అభిమానులు సందర్శన కోసం ఆమె పార్ధివదేహాన్ని పద్మాలయ స్టూడియోలో ఉంచి అనంతరం మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుపనున్నారు అని తెలిపారు.


Click it and Unblock the Notifications











