మహేశ్ బాబుతో సినిమానా? అనిల్ రావిపూడి షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్‌లో వరుస విజయాలు సాధించడం మాటలు కాదు. హిట్, సూపర్ హిట్, బ్లాక్‌బస్టర్‌లను ఒకదాని తర్వాత ఒకటి అందుకోవడం అంటే అది నిజంగా సాహసమే. కానీ దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi)మాత్రం అవన్నీ తనకు 'కొట్టిన పిండే' అన్న స్థాయిలో మరోసారి నిరూపించుకున్నాడు. ఒకటీరెండు కాదు... ఏకంగా తొమ్మిది వరుస విజయాలతో ఇండస్ట్రీలో 'హిట్ మెషిన్'గా తనకంటూ ప్రత్యేక బ్రాండ్‌ను క్రియేట్ చేసుకున్నాడు.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన తాజా సినిమా 'మన శంకరవరప్రసాద్ గారు'. నయనతార హీరోయిన్‌గా నటించగా, విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో కనిపించారు. జనవరి 12న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఈ విజయం నేపథ్యంలో అనిల్ రావిపూడి గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

ఈ ఇంటర్వ్యూలో పాన్ ఇండియా సినిమాలపై తన అభిప్రాయాలను చాలా ఓపెన్‌గా పంచుకున్నాడు అనిల్ రావిపూడి. 'ఇతర దర్శకులు పాన్ ఇండియా సినిమాలతో తెలుగు సినిమా స్థాయిని పెంచుతున్నారు. దాని వల్ల టాలీవుడ్ కలెక్షన్లు భారీగా పెరుగుతున్నాయి. అందుకే నాకు ఎలాంటి రిగ్రెట్ లేదు' అని అన్నారు. అయితే పాన్ ఇండియా సినిమాలు చేయడం అంత ఈజీ కాదని కూడా స్పష్టం చేశారు.' హీరోలు మాకు అవకాశం ఇవ్వడం కాదు... మేమే కథ తీసుకెళ్లి వారిని ఎగ్జైట్ చేయాలి. ఆ స్థాయిలో కథ ఉండాలి'అని చెప్పుకొచ్చారు.
స్టార్స్ మార్కెట్ పూర్తిగా మారిపోయిందని, ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్‌లో ఆలోచించాల్సి ఉంటుందని అనిల్ చెప్పారు. 'ఆ స్థాయి కథలు రాయాలంటే మన ఆలోచన విధానంలో కూడా మార్పు రావాలి. స్కేలు పెరిగింది... దానికి తగ్గట్టే స్టోరీ, ప్రెజెంటేషన్ ఉండాలి' అని అన్నారు. ఉదాహరణగా జూనియర్ ఎన్టీఆర్ తో రెండు సినిమాల వరకు దగ్గరగా వెళ్లామని, కానీ అవి సెట్స్‌పైకి రాలేదని వెల్లడించారు. 'తారక్ అంటే నాకు చాలా ఇష్టం'అని కూడా చెప్పారు.
ఇక మహేశ్ బాబు తో చేసిన 'సరిలేరు నీకెవ్వరు' తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అని గుర్తు చేసుకున్నారు. అయితే ఇప్పుడు మహేష్ బాబు పూర్తిగా నెక్స్ట్ లెవెల్‌కు వెళ్లిపోయాడని, పాన్ ఇండియా మార్కెట్‌తో అతని రేంజ్ పూర్తిగా మారిపోయిందని చెప్పారు. 'ఇప్పుడు మహేశ్ బాబుతో అలాంటి సినిమాలు చేయాలంటే తీయలేం.. మరింత పెద్ద స్కేల్‌లో ఆలోచించాలి'అని స్పష్టం చేశారు. ప్రస్తుతం తాను చేస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్‌లే తనకు సరైనవని, కానీ రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో మాత్రం తప్పకుండా పాన్ ఇండియా లెవెల్ సినిమాలు చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చారు. 'అద్భుతమైన కథ దొరికితే కచ్చితంగా పాన్ ఇండియా మూవీ తీస్తా' అని చెప్పారు.
అలాగే చిరంజీవితో ఈ సినిమా చాలా ముందే రావాల్సిందని, గతంలో రెండు మూడు సార్లు కలిసి సినిమా చేయాలనుకున్నా మెటీరియలైజ్ కాలేదని, ఎట్టకేలకు ఇప్పుడు అది సక్సెస్ కావడం ఆనందంగా ఉందని అనిల్ చెప్పారు. మొత్తానికి, వరుస విజయాలతో దూసుకెళ్తున్న అనిల్ రావిపూడి... ఇకపై పాన్ ఇండియా దిశగా కూడా అడుగులు వేయబోతున్నట్టు స్పష్టమవుతోంది. స్టార్ హీరోలతో, భారీ స్కేల్ సినిమాలతో ఆయన నుంచి రాబోయే ప్రాజెక్ట్స్ ఎలా ఉండబోతున్నాయో చూడాలంటే ఇంకొద్దికాలం వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











