పరశురాంకు మహేశ్ బాబు డెడ్‌లైన్: ‘సర్కారు వారి పాట’ అంత త్వరగా పూర్తి అవుతుందా!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తోన్న తాజా చిత్రం 'సర్కారు వారి పాట'. పరశురాం దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతోంది. 'భరత్ అనే నేను', 'మహర్షి', 'సరిలేరు నీకెవ్వరు' వంటి భారీ హిట్ల తర్వాత వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుని వేరే దేశాలకు పారిపోతోన్న బడా వ్యాపారవేత్తలను టార్గెట్ చేస్తూ ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ లీకైంది.
ప్రస్తుతం 'సర్కారు వారి పాట' షూటింగ్ హైదరాబాద్ శివారు ప్రాంతమైన శంకరపల్లిలో జరుగుతోంది. రెండు రోజుల క్రితమే ప్రారంభమైన ఈ షెడ్యూల్ దాదాపు 20 రోజుల పాటు జరగనుందని తెలుస్తోంది. ఇందుకోసం అక్కడ ఓ ప్రత్యేకమైన సెట్‌ను కూడా నిర్మించారు. అందులోనే కీలక నటీనటులపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారని అంటున్నారు. అలాగే, ఓ పాటను కూడా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ ప్రభావం అంతకంతకూ పెరిగిపోతోన్న నేపథ్యంలో ఈ మూవీ షూటింగ్‌కు చాలా తక్కువ మంది సిబ్బందిని తీసుకెళ్తున్నారనే టాక్ వినిపిస్తోంది.

తాజా సమాచారం ప్రకారం.. 'సర్కారు వారి పాట' విషయంలో దర్శకుడు పరశురాంకు మహేశ్ బాబు డెడ్‌లైన్ విధించాడట. దీని బట్టి ఈ సినిమాను జూలై నాటికి పూర్తి చేయాలని చెప్పాడని తెలిసింది. ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించాలని కూడా వెల్లడించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో పాటు మహేశ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. థమన్ దీనికి సంగీతం సమకూర్చుతున్నాడు. 2022 సంక్రాంతికి ఇది విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











