Guntur karam: మహేశ్ మూవీ మళ్లీ వాయిదా.. ఈ సారి వాళ్లు షాకిచ్చారుగా!
ఫలితాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లే హీరోల్లో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఒకడు. ఆ మధ్య వరుసగా మూడు బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టిన అతడు.. గత ఏడాది వచ్చిన 'సర్కారు వారి పాట'తో మంచి ఫలితాన్ని అందుకోలేకపోయాడు. దీంతో ఈ సారి ఎలాగైనా భారీ సక్సెస్‌ను సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఇందులో భాగంగానే ఇప్పుడు మహేశ్ బాబు 'గుంటూరు కారం' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రంపై ఆరంభం నుంచే అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి.
'అతడు', 'ఖలేజా' వంటి క్లాసిక్ చిత్రాల తర్వాత సూపర్ స్టార్ మహేశ్ బాబు - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రమే 'గుంటూరు కారం'. దీనికి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ గత ఏడాదిలోనే మొదలైంది. ఆ వెంటనే మొదటి షెడ్యూల్ కూడా సక్సెస్‌ఫుల్‌గానే కంప్లీట్ చేసుకున్నారు. అయితే, తర్వాత మహేశ్ బాబు ఇంట్లో వరుస విషాదాలు చోటు చేసుకోవడం.. అతడు కరోనా వ్యాధి బారిన పడడం వంటి కారణాల వల్ల చిత్రీకరణకు కొన్ని ఆటంకాలు ఎదురయ్యాయి. ఇవి అయిపోయిన తర్వాత కూడా చిత్ర యూనిట్ మరో షెడ్యూల్‌ను జరిపి.. ఇప్పుడు గ్యాప్ తీసుకుంది.

'గుంటూరు కారం' మూవీకి ఆటంకాలు ఎదురు కావడం వల్ల ముందుగా అనుకున్న సమయానికి విడుదల కావడం లేదు. దీంతో చిత్ర యూనిట్ సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి ప్రారంభం కావాల్సిన మరో షెడ్యూల్ కూడా వాయిదా పడిపోయింది. దీనికి కారణం కొందరు సీనియర్ అండ్ టాప్ ఆర్టిస్టుల డేట్స్ అడ్జస్ట్ కాకపోవడమే అని తెలిసింది. గతంలో మహేశ్ బాబు డేట్స్ వల్ల ఇది లేట్ అవగా.. ఇప్పుడు ఆర్టిస్టులు కాల్షీట్లు దొరక్క వాయిదా పడుతోంది. దీనిపై ఫ్యాన్స్ మాత్రం తీవ్ర నిరాశలో ఉన్నారు.
ఇదిలా ఉండగా.. మహేశ్ బాబు హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కిస్తోన్న 'గుంటూరు కారం' సినిమాను హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే, శ్రీలీల ఇందులో హీరోయిన్లుగా చేస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం ఇస్తున్నాడు. ఇందులో ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం సహా ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











