Mahesh Babu: మహేష్ బాబుకు చేదు అనుభవం.. బెంగళూరు ఏఎంబీ వద్ద ఊహించని సంఘటన
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ( Mahesh Babu) క్రేజ్ ఏంటో మరోసారి బయటపడింది. తాజాగా బెంగళూరులో జరిగిన ఓ ఘటన సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏంటో స్పష్టంగా చాటిచెప్పింది. ఇప్పటివరకు పాన్ ఇండియా సినిమా చేయకపోయినా, మహేశ్ బాబుకు దేశవ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన చాలా అరుదుగా పబ్లిక్ అపియరెన్సెస్ ఇస్తారు. సోషల్ మీడియాలో కూడా పరిమితంగానే కనిపిస్తారు. అయినప్పటికీ తన సినిమాలు, వ్యక్తిత్వం, సామాజిక కార్యక్రమాల ద్వారా కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్నారు.
ఇటీవల బెంగళూరులో గాంధీనగర్ ప్రాంతంలో కొత్తగా నిర్మించిన ఎఎంబీ సినిమాస్ (AMB Cinemas) (కపాలి) మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవానికి మహేశ్ బాబు హాజరవుతారన్న సమాచారం వైరల్ గా మారింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. సూపర్ స్టార్‌ను చూసేందుకు వేలాది అభిమానులు గంటల తరబడి థియేటర్ పరిసరాల్లో వేచి ఉండటం విశేషం. మహేశ్ బాబు కారులో అక్కడికి చేరుకుని దిగగానే పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది.

అభిమానులు ఒక్కసారిగా ఆయన కారును చుట్టుముట్టడంతో "సూపర్ స్టార్.. సూపర్ స్టార్" అంటూ నినాదాలు మారుమోగాయి. సెల్ఫీలు, షేక్ హ్యాండ్ కోసం అభిమానులు ఎగబడటంతో మహేశ్ బాబు కొంతసేపు అక్కడే ఇరుక్కుపోయిన పరిస్థితి ఏర్పడింది. అభిమానుల అత్యుత్సాహం అదుపు తప్పడంతో భద్రతా సిబ్బంది, పోలీసులు తీవ్రంగా శ్రమించి మహేశ్ బాబును సురక్షితంగా లోపలికి తీసుకెళ్లారు. పరిస్థితిని కంట్రోల్ చేయడానికి పోలీసులు స్వల్పంగా లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చినట్లు సమాచారం. అదృష్టవశాత్తూ ఎలాంటి పెద్ద ప్రమాదం జరగలేదు.
ఈ ఘటన అనంతరం మహేశ్ బాబు సోషల్ మీడియా ద్వారా స్పందించారు. 'నమ్మ బెంగళూరులో AMB సినిమాస్ తలుపులు తెరుచుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇంతటి అద్భుతమైన థియేటర్‌ను సిద్ధం చేసిన టీమ్ మొత్తానికి నా అభినందనలు. మీ ప్రేమాభిమానాలకు హృదయపూర్వక ధన్యవాదాలు' అంటూ ట్వీట్ చేశారు. అభిమానుల ప్రేమకు మరోసారి కృతజ్ఞతలు తెలిపారు.
హైదరాబాద్ గచ్చిబౌలిలో 'ఏషియన్ సినిమాస్ తో కలిసి మహేశ్ బాబు ఏర్పాటు చేసిన AMB సినిమాస్ ఇప్పటికే అత్యుత్తమ థియేటర్ అనుభూతికి చిరునామాగా నిలిచింది. ఇప్పుడు అదే బ్రాండ్‌ను బెంగళూరుకు విస్తరించడం ద్వారా ఆయన వ్యాపార రంగంలో మరో కీలక ముందడుగు వేశారు. ముఖ్యంగా ఈ మల్టీప్లెక్స్ దక్షిణ భారతదేశంలోనే తొలి డాల్బీ సినిమా ఎక్స్‌పీరియన్స్ ను అందించనుండటం విశేషం. ప్రపంచ స్థాయి ఆడియో - విజువల్ టెక్నాలజీతో ఈ థియేటర్‌ను తీర్చిదిద్దారు.
ఇక మహేశ్ బాబు సినిమాల విషయానికి వస్తే, మహేశ్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళిదర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'వారణాసి'లో నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా 2027 ఏప్రిల్‌లో విడుదల కానుందని సమాచారం. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, మరో ఆరు- ఏడు నెలల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యే అవకాశముందట. రాజమౌళి దర్శకత్వం కావడంతో ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.


Click it and Unblock the Notifications











