Major: అడివి శేష్‌కు గుర్తుండిపోయే కానుక.. మేజర్ తల్లి పంపిన గిఫ్ట్‌ను చూపించిన హీరో
ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు ఉన్నారు. కానీ, వారిలో చాలా తక్కువ మంది మాత్రమే విలక్షణ నటనతో విశేషమైన గుర్తింపును దక్కించుకున్నారు. తద్వారా అందరిలో ప్రత్యేకంగా నిలుస్తున్నారు. అలాంటి వారిలో యంగ్ స్టార్ అడివి శేష్ ఒకడు. విలన్ పాత్రలు చేస్తూ కెరీర్‌ను ఆరంభించిన ఈ టాలెంటెడ్ కుర్రాడు.. ఆ తర్వాత హీరోగా మారాడు. అప్పటి నుంచి సినిమా సినిమాకూ వైవిధ్యాన్ని చూపిస్తూ సత్తా చాటుతున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలి కాలంలో అడవి శేష్ వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతున్నాడు. ఫలితంగా రెట్టించిన ఉత్సాహంతో ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తూ దూసుకెళ్తున్నాడు.
ఈ మధ్య కాలంలో వరుస విజయాలతో ఫుల్ ఫామ్‌లో ఉన్న అడివి శేష్ ప్రస్తుతం శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో 'మేజర్' అనే సినిమా చేస్తున్నాడు. ముంబైలో జరిగిన ఉగ్రదాడుల్లో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీన్ని భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. ఇక, ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్ సినిమా రేంజ్‌ను మరింతగా పెంచేశాయి. దీంతో ఈ చిత్రంపై దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని ఇండస్ట్రీలూ దృష్టి సారించాయి.

క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న 'మేజర్' మూవీ షూటింగ్ ప్రారంభమై చాలా కాలమే అవుతోంది. అయితే, మధ్యలో రెండు సార్లు కరోనా లాక్‌డౌన్ రూపంలో ఆటంకాలు ఏర్పడడంతో షూటింగ్‌కు బ్రేకులు పడుతూ వచ్చాయి. ఇక, సుదీర్ఘ విరామం తర్వాత కొద్ది రోజుల క్రితమే ఈ సినిమా షూటింగ్ పున: ప్రారంభం అయింది. హైదరాబాద్‌లోని ఓ ఫిల్మ్ స్టూడియోలో వేసిన ప్రత్యేకమైన సెట్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఆ తర్వాత ముంబైలో ఓ షెడ్యూల్‌ను కూడా విజయవంతంగా పూర్తి చేశారు. ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా వెంటనే ప్రారంభించేశారు. ప్రస్తుతం ఆ పనులే జరుగుతున్నాయి.
ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'మేజర్' మూవీ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రయాణంలో అడివి శేష్.. మేజర్ ఫ్యామిలీకి ఎంతో క్లోజ్ అయ్యాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా తెలిపాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ హీరోకు సందీప్ తల్లి స్పెషల్ గిఫ్టును ఇచ్చారు. ఈ విషయాన్ని శేష్ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. 'మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ మదర్ ధనలక్ష్మి ఆంటీ దీన్ని (టీషర్ట్) నాకు గిఫ్టుగా ఇచ్చారు. ఈరోజు ఈ టీషర్ట్‌ను ధరించాను' అని రాసుకొచ్చాడు. అలాగే, టీషర్ట్ వేసుకున్న ఫొటోను కూడా షేర్ చేశాడు.

'మేజర్' మూవీ కోసం అడివి శేష్ ఎంతగానో కష్ట పడిన విషయం తెలిసిందే. లుక్ టెస్ట్ కోసం అతడు ఎన్నో జాగ్రత్తలు కూడా తీసుకున్నాడు. ఇక, ఈ సినిమాకు కథా సహకారం కూడా అందించాడు. ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు నిర్మాణ సంస్థ జి మహేష్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బాలీవుడ్ భామ సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. శోభిత దూళిపాళ్ల కీలక పాత్రను చేస్తోంది. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











