Bramayugam పాన్ ఇండియా సినిమాతో మమ్ముట్టి.. హరర్ మూవీ ఎన్ని భాష్లలో? నిర్మాత ఎవరంటే?
దక్షిణాది సూపర్‌స్టార్ మమ్ముట్టికి తెలుగు సినిమా పరిశ్రమకు మంచి అనుబంధం ఉంది. తన కెరీర్ ఆరంభంలో తెలుగు సినిమాల్లో నటించి తనకంటూ అభిమానులను సొంతం చేసుకొన్నారు. మలయాళంలో బిజీ కావడంతో తెలుగు సినిమాలకు దూరమయ్యారు. కానీ సమయం దక్కితే, మంచి పాత్రలు తారసపడితే తెలుగు సినిమాల్లో నటించడం ఆపడం లేదు. తాజాగా ఆయన నటిస్తున్న పాన్ ఇండియా మూవీ భ్రమయుగం తెలుగులో నేరుగా రిలీజ్ కానున్నది. ఈ సినిమా వివరాల్లోకి వెళితే..
హారర్ థ్రిల్లర్ జోనర్‌లో రూపొందుతున్న భ్రమయుగం సినిమాను నిర్మాత చక్రవర్తి రామచంద్ర నిర్మిస్తున్నారు. నిర్మాతగా ఆయనకు ఇదే తొలి సినిమా. ఈ సినిమా ప్రారంభ వేడుక ఘనంగా నిర్వహించారు. మమ్ముట్టి నటిస్తున్న ఈ సినిమాకు రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహిస్తున్నారు.

భ్రమయుగం సినిమా ప్రారంభ వేడుకలో దర్శకుడు రాహుల్ సదాశివన్ మాట్లాడుతూ సూపర్ స్టార్ మమూక్కను డైరెక్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. కేరళలో మరుగనపడి ఉన్న సంఘటనలు, ఎవరికీ తెలియని చీకటి కోణాన్ని కథగా మలిచాం. గొప్ప సినిమాటిక్ అనుభూతిని అందించేందుకు చేస్తున్న ప్రయత్నానికి వెన్నుదన్నుగా నిలిచిన నిర్మాతలకు రుణపడి ఉంటాను. మమూక్క ఫ్యాన్స్‌కు విందు భోజనంలా ఉంటుంది అని అన్నారు.
మా ప్రారంభ చిత్రం మమ్ముట్టితో చేసే అవకాశం రావడం చాలా గొప్ప అనుభూతిని ఇస్తుంది. మమ్ముట్టి ఇమేజ్ ఈ సినిమాకు మంచి క్రేజ్ తీసుకు రావడమే కాకుండా, గొప్ప అనుభూతిని కలిగించే చిత్రంగా నిలుస్తుంది. అద్బుతమైన ప్రతిభావంతులు, సాంకేతిక నిపుణులతో రాహుల్ ఈ సినిమాను గొప్పగా అందించబోతున్నారు అని నిర్మాత రాహుల్ శివదాసన్ తెలిపారు.
నైట్ షిఫ్ట్ స్టూడియోస్ బ్యానర్ రూపొందుతున్న ఈ చిత్రం నిర్మాతల గొప్ప అభురుచికి సాక్ష్యంగా నిలువబోతున్నది. కంటెంట్ పరంగా, సాంకేతిక విలువల పరంగా ప్రమాణాలతో రూపొందుతున్నది. సరికొత్త కథనం, కథతో ఈ సినిమా మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందిస్తుంది అని చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు.
ఇక చక్రవర్తి రామచంద్ర గురించిన వివరాల్లోకి వెళితే.. గతంలో వైనాట్ స్టూడియోస్‌తో కలిసి సినిమాలు నిర్మించారు. ఇండిపెండెంట్ నిర్మాతగా మంచి పేరు ఉంది. తాజాగా నైట్ షిఫ్ట్ స్టూడియోస్ బ్యానర్‌ను స్థాపించి తన అభిరుచికి తగినట్టుగా సినిమాలు నిర్మించేందుకు సిద్దమయ్యారు. భ్రమయుగం సినిమాను కోచి, ఒట్టపాలెం ప్రాంతాల్లో షూట్ చేయనున్నారు.
భ్రమయుగం సినిమాలో అర్జున్ అశోకన్, సిద్దార్థ్ భరతన్, అమల్డా లిజ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.షెహనాద్ జలాల్ సినిమాటోగ్రాఫర్‌గా, జోతిష్ శంకర్ ప్రొడక్షన్ డిజైనర్‌గా, షఫీఖ్ మహ్మద్ఆలీ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం 2024 సంవత్సరంలో మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో రూపొందనున్నది.


Click it and Unblock the Notifications











