MSVPG: 30 వేల రూపాయలతో కుట్ర... మన శంకర వరప్రసాద్ గారికి తప్పిన గండం
గతంలో పైరసి తెలుగు చిత్ర పరిశ్రమకు పెద్ద గండంగా మారగా.. ప్రస్తుతం దాని స్థానంలో సోషల్ మీడియా వచ్చి చేరింది. సినిమాలు, హీరోలు, హీరోయిన్లు, ఇతర టెక్నీషియన్లను దెబ్బతీయడానికి కొందరు సోషల్ మీడియాను ఆయుధంగా మార్చుకుంటున్నారు. సినిమాల రిలీజ్ టైంలో ప్రత్యర్ధిపై ఉన్నవి లేనివి కల్పించి చెబుతూ నెగిటివ్ పబ్లిసిటీ చేస్తున్నారు. దీని ప్రభావంతో నిర్మాతలు నష్టపోతున్నారు. దీనిని కూడా దాటి సినిమాను దెబ్బకొట్టడానికి మరో కొత్త రకం వ్యూహాన్ని కొందరు అమలు చేస్తున్నారు. అదే రేటింగ్. కొద్దిరోజుల క్రితం ప్రముఖ నిర్మాత బన్నీ వాసు.. ఈ కుట్రను బయటపెట్టారు. ఒకరు సినిమాను ఎలా దెబ్బకొడతారో ఆయన కళ్లకు కట్టినట్లు వివరించారు. జనవరి 12న రిలీజ్ కానున్న మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ చిత్ర యూనిట్ ఇలాంటి కుట్రలకు అవకాశం లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేసుకుంది. ఈ వివరాల్లోకి వెళితే..
ఈషా మూవీపై నెగిటివ్ రివ్యూలు
గత నెలలో హెబ్బా పటేల్, త్రిగుణ్ తదితరులు కీలకపాత్రలు పోషించిన ఈషా చిత్రం అనేక అవాంతరాలను దాటుకుని ప్రేక్షకుల ముందుకొచ్చింది. హెచ్‌వీఆర్ ప్రొడక్షన్ బ్యానర్‌పై పోతుల హేమ వెంకటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మించగా శ్రీనివాస్ మన్నె దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్ సమర్పకుడిగా వ్యవహరించగా... బన్నీ వాసు ఈ సినిమాను విడుదల చేశారు. డిసెంబర్ 5న విడుదల కావాల్సిన ఈషా చిత్రం.. అనివార్య కారణాలతో డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ఈ సినిమాపై సోషల్ మీడియాలో నెగిటివ్ ట్రోలింగ్, రివ్యూలు వస్తుండటంతో చిత్రయూనిట్ ఆవేదన వ్యక్తం చేసింది.

30 వేల రూపాయలతో పక్కా స్కెచ్
తమ సినిమాను ఎలా తొక్కేస్తున్నారో నిర్మాత బన్నీవాసు వివరిస్తూ ఎమోషనల్ అయ్యారు. ఒక చిన్న ఫార్ములా ద్వారా.. ఒక 200 వందల టికెట్స్‌ని ఎవరో బుక్ చేస్తారు. ఆ తర్వాత తక్కువ రేటింగ్ కొట్టుకుంటూ వస్తే మన సినిమా కిందకి వచ్చేస్తుంది. సినిమా బాగుంటే రేటింగ్ లేస్తుంది, లేకపోతే 5.5, 5.6 వరకు వచ్చి ఆగిపోతుంది. సింగిల్ ప్రీమియర్ షో ద్వారా అవతలి వాళ్లు ఒక సినిమాను బుక్ మై షో ద్వారా కిందకి పడేయాలని అనుకుంటే 300 నుంచి 400 టికెట్లు .. అంటే 30 వేల నుంచి 50 వేల రూపాయలు ఖర్చు చేస్తే చాలు అని బన్నీ వాస్ తెలిపారు. 300 టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్లు నెగిటివ్‌గా కొడితే.. దానిని సరి చేయాలంటే మరో 300 టికెట్స్ కొన్నవాళ్లు పాజిటివ్‌గా కొట్టాల్సి ఉంటుందని ఆయన ఈ కుట్రను బయటపెట్టారు. బన్నీ వాసు చేసిన వ్యాఖ్యలు తెలుగు చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించగా.. ఇలాంటి గండాలను ఎదుర్కోవడానికి ఏం చేయాలన్న దానిపై సినీ ప్రముఖులు చర్చలు జరిపారు.
నెగిటివ్ రేటింగ్స్‌పై శంకర వరప్రసాద్ గారు టీమ్ యాక్షన్
సంక్రాంతికి రిలీజ్ కానున్న పెద్ద సినిమాల విషయంలో ఇలాంటి నెగిటివ్ రివ్యూలు, రేటింగ్స్ ప్రభావం పడకుండా చర్యలు చేపట్టారు. ఈ విషయంలో మన శంకర వరప్రసాద్ గారు టీమ్ సక్సెస్ అయ్యింది. బుక్ మై షోలో బోట్‌లను ఉపయోగించి నకిలీ రేటింగ్‌తో తమ సినిమాను ప్రత్యర్ధులకు లక్ష్యంగా మారకుండా చూసుకోగలిగారు. ఇందుకోసం మన శంకర వరప్రసాద్ గారు యూనిట్ ఇంతకుముందు ఏ తెలుగు సినిమా కూడా చేయని పనిని చేసింది. దీనిలో భాగంగా కోర్ట్ నుంచి ఒక ఉత్తర్వును పొందింది. దీని ప్రకారం బుక్ మై షో సహా ఇతర టికెటింగ్ పోర్టల్స్‌లో మన శంకర వరప్రసాద్ గారు సినిమాపై రేటింగ్‌లు, రివ్యూలను నిలిపివేసేలా కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
న్యాయస్థానం సంచలన తీర్పు
న్యాయస్థానం ఆదేశాల మేరకు బుక్ మై షో తన యాప్‌లో మార్పులు తీసుకొచ్చింది. ప్రస్తుతం బుక్ మై షో యాప్, పోర్టల్‌లో మన శంకర వరప్రసాద్ గారు సినిమాకు సంబంధించి యూజర్ ఇంట్రెస్ట్స్ డిస్‌ప్లే చేసే సమయంలో కింద కనిపించే రేటింగ్ పాయింట్స్ డియాక్టివేట్ అయ్యాయి. దాని స్థానంలో కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఇక్కడ రేటింగ్స్ అండ్ రివ్యూస్ డిసేబుల్ చేయబడ్డాయని రాసుంది. మన శంకర వరప్రసాద్ గారు తీసుకున్న నిర్ణయం బుక్ మై షో సహా ఇతర టికెటింగ్ పోర్టల్స్‌లో నకిలీ రేటింగ్స్‌కు వ్యతిరేకంగా ఒక కవచంగా పనిచేస్తుందని.. ఇతర సినిమాలు కూడా ఇదే విధానాన్ని భవిష్యత్తులో అనుసరించవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications











