Pawan Kalyan Review on MSVPG: మన శంకర వరప్రసాద్ మూవీపై పవన్ కళ్యాణ్ రివ్యూ
అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం మన శంకర వరప్రసాద్ గారు. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదలై ఈ చిత్రం ఇప్పటికే 300 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించి చిరంజీవి కెరీర్‌లోనే తొలి 300 కోట్ల రూపాయల సినిమాగా నిలిచింది. దాంతో మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. కుటుంబ, యువ ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తున్నారు. విడుదలై 10 రోజులు కావొస్తున్నా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్నాడు చిరు.
షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత సాహు గారపాటితో కలిసి చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల మన శంకర వరప్రసాద్ గారు చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుండగా.. భీమ్స్ సిసిరోలియో సంగీత దర్శకత్వం వహించారు, తమ్మిరాజు ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. మన శంకర వరప్రసాద్ గారులో చిరంజీవి సరసన లేడీ సూపర్‌స్టార్ నయనతార హీరోయిన్‌గా నటించారు. టాలీవుడ్ అగ్ర కథానాయకుడు విక్టరీ వెంకటేష్ గెస్ట్ రోల్‌లో అలరించారు. వీరితో పాటు కేథరిన్ థ్రెసా, మాస్టర్ రేవంత్, బేబీ ఐరా, హర్షవర్థన్‌లు తదితరులు నటించారు.

ఇప్పటి వరకు మన శంకర వరప్రసాద్ గారు మూవీ ఇండియాలో ఇప్పటి వరకు 175.85 కోట్ల రూపాయల నెట్... 208.7 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు సాక్‌నిక్ నివేదించింది. ఇక ఓవర్సీస్‌లో 40.3 కోట్ల రూపాయల కలెక్షన్స్‌తో కలిపి ప్రపంచవ్యాప్తంగా 249 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లుగా వెల్లడించింది. అయితే చిత్ర నిర్మాతలు మాత్రం మన శంకర వరప్రసాద్ గారు మూవీ వరల్డ్ వైడ్‌గా 300 కోట్ల రూపాయల మార్క్ దాటినట్లు ప్రకటించింది. మెగాస్టార్ ఊపు చూస్తుంటే అవలీలగా 400 కోట్ల రూపాయల మార్క్ దాటే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
చిరంజీవి మూవీ విజయం సాధించడం పట్ల అభిమానులతో పాటు మెగా ఫ్యామిలీ కూడా సంతోషం వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే చిరంజీవి కుమారుడు, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ తేజ్, ఇతర కుటుంబ సభ్యులు సినిమాను చూసి చిత్ర యూనిట్‌ను అభినందిస్తున్నారు. రెండ్రోజుల క్రితం ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ కూడా మన శంకర వరప్రసాద్ గారు మూవీ విజయం సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ.. తన మావయ్యను ఆకాశానికి ఎత్తేస్తూ చిత్ర యూనిట్‌ను ప్రశంసించారు. తాజాగా చిరంజీవి సోదరుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ చిత్ర యూనిట్‌ను అభినందించారు. ఈ మేరకు పవన్ నిర్మాణ సంస్థ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్స్క్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి పోస్ట్ చేశారు.
మెగా బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న మెగాస్టార్ చిరంజీవి గారు, మన శంకర వరప్రసాద్ గారు టీమ్ మొత్తానికి హృదయపూర్వక అభినందనలు. నాలుగు దశాబ్దాలకు పైగా చిరంజీవి గారు ప్రజల హృదయాలలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుని, తన నటన, హాస్యం, నృత్యంతో అదే అభిరుచి, ఉత్సాహంతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. ఇది ఆయన అద్భుతమైన సినీ ప్రస్థానంలో మరో విజయవంతమైన చిత్రం. ఈ సంక్రాంతికి మరో బ్లాక్‌బస్టర్ అందించినందుకు దర్శకుడు అనిల్ రావిపూడి గారికి ప్రత్యేక అభినందనలు. మెగాస్టార్, విక్టరీ వెంకటేష్ గారిని ఒకే ఫ్రేమ్‌లో చూడటం నిజంగా చాలా ఆనందంగా ఉంది అని పవన్ అన్నారు.
సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో గారు సినిమాకు గొప్ప ఎనర్జీని అందించే అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ప్రేక్షకులను బలంగా ఆకట్టుకున్న చిత్రాన్ని అందించినందుకు నిర్మాతలు సాహు గారపాటి గారికి, సుస్మిత గారికి ప్రత్యేక అభినందనలు. ఈ విజయవంతమైన ప్రయాణంలో భాగమైనందుకు నయనతార, షైన్ స్క్రీన్స్ సినిమా, గోల్డ్‌బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు కూడా శుభాకాంక్షలు అని పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











