విజయ నిర్మల మృతి: చరిత్ర సృష్టించారు, మీకు మీరే సాటి.. మంచు మనోజ్ ఉద్వేగం
ప్రముఖ నటి, దర్శకురాలు, ప్రముఖ నటుడు సూపర్ స్టార్ కృష్ణ సతీమణి విజయనిర్మల మృతి టాలీవుడ్ ఇండస్ట్రీని విషాదంలో ముంచెత్తింది. బుధవారం రాత్రి ఆమె గుండెపోటుతో మరణించిందనే వార్త విని యావత్ సినీ లోకం శోక సముద్రంలో మునిగిపోయింది. ఈ మేరకు విజయ నిర్మల మృతి పట్ల స్పందిస్తూ ఆమె కుటుంబానికి పలువురు సినీ, వ్యాపార, ఇతర పరిశ్రమల ప్రముఖులు తమ తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
మంచు మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ విజయ నిర్మల మృతిపై స్పందిస్తూ ట్వీట్ చేశాడు. ''మీరు వచ్చారు. హిస్టరీ క్రియేట్ చేశారు. మీలాంటి నటన కనబర్చడం ఇంకెవ్వరి వల్ల కాదు. ఇప్పుడు మీరు మా అందరిని వదిలి దూరంగా వెళ్లారు. మీ ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను'' అని మనోజ్ పేర్కొన్నాడు.

బుధవారం అర్థరాత్రి గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ విజయనిర్మల (73) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో ఉన్న ఆమె మృతి చెందటం సినీ లోకాన్ని కలచివేసింది. 1946 సంవత్సరం ఫిబ్రవరి 20న విజయనిర్మల తమిళనాడులో జన్మించారు. ఏడేళ్ల వయసులో బాలనటిగా తమిళ చిత్రం మత్స్యరేఖ సినిమాతో సినీరంగ ప్రవేశం చేశారు. 11 ఏళ్ల వయసులో 'పాండురంగ మహత్యం' సినిమాతో తెలుగులో ఆమె పరిచయమయ్యారు. మొదటి భర్త కృష్ణమూర్తితో విడిపోయిన తర్వాత విజయనిర్మల సూపర్ స్టార్ కృష్ణను రెండవ వివాహం చేసుకోవడం జరిగింది. ఆమెకు హీరో నరేష్ ఒక్కడే సంతానం. 200 పైగా చిత్రాల్లో నటించిన విజయ నిర్మల ఎనో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు.


Click it and Unblock the Notifications











