బండి భగీరథ్ పోక్సో కేసు: ట్వీట్‌తో మంచు మనోజ్ సంచలనం
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ వర్గాల్లో అత్యంత వివాదాస్పదమైన అంశం బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు వ్యవహారమే. బండి భగీరత్ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడే కావడం భారీ చర్చకు దారి తీసింది. మైనర్ బాలికపై బలవంతంగా లైంగిక దాడి జరపారనే ఆరోపణలపై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఈ కేసుపై సినీ, రాజకీయ, సాధారణ ప్రజలు స్పందిస్తున్నారు. బాధితురాలికి వెంటనే న్యాయం జరగాలి. ఈ కేసులో రాజకీయ జోక్యం ఉండకూడదు అని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సినీ నటుడు మంచు మనోజ్ సోషల్ మీడియాలో ఘాటుగా స్పందించారు. బాధితురాలికి అండగా నిలుస్తూ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ వివరాల్లోకి వెళితే..
కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ గారి కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు వ్యవహారం నన్ను పూర్తిగా కదిలించింది. మైనర్ బాలికలపై అఘాయిత్యం, లైంగిక దాడి కేసుల్లో బాధితులకు తక్షణమే న్యాయం జరిగేలా పోక్సో యాక్ట్‌ను తీసుకొచ్చారని నేను బలంగా నమ్ముతాను. ఈ కేసు వ్యవహారంలో అధికారం, హోదా, రాజకీయ పలుకుబడి, సమాజంలో స్థాయి అనే అంశాలు జోక్యం చేసుకోకూడదు అనేది నా అభిప్రాయం. చట్టం, రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం ప్రతీ అమ్మాయికి సమాన న్యాయం జరగాలి అని మనోజ్ అన్నారు.

మైనర్ బాలికలపై అఘాయిత్యాలకు సంబంధించిన కేసులను సత్వరమే పరిష్కరించాలి. కేసు దర్యాప్తులో పారదర్శకత ఉండాలి. విచారణ జవాబుదారీగా ఉండాలి. కేసు నమోదు, సత్యాన్వేషణ విషయంలో ఎలాంటి జాప్యం ఉండకూడుదు. ఈ వ్యవహారంలో మౌనం దాల్చడం, ఒకరికి ఓక న్యాయం, మరొకరికి మరో న్యాయం అనే పద్దతి ఉండకూడదు. న్యాయ వ్యవస్థపై ప్రజల విశ్వాసం కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అని మంచు మనోజ్ పేర్కొన్నారు.
పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు రాజకీయ రంగానికి చెందిన వారా? రాజకీయ ప్రముఖులా? అనే విషయాన్ని విస్మరించాలి. వాస్తవం బయటకు రావాలి. బాధితులకు సత్వర న్యాయం జరగాలి. ఈ కేసులో దర్యాప్తు వేగంగా జరుగుతుంది. స్వేచ్చగా విచారణ కొనసాగుతుంది. పారదర్శకతను పాటిస్తారు. ఏ వైపు నుంచైనా వచ్చే ఒత్తిడి, ఇన్‌ఫ్లూయెన్స్‌కు తలవొగ్గరని భావిస్తున్నాను. ఈ కేసు చట్ట నిబంధనలకు అనుగుణంగా కొనసాగాలని మనస్పూర్తిగా కోరుకొంటున్నాను. చట్టానికి ఎవరూ అతీతులు కారు అనే సందేశాన్ని పంపేలా బాధితులకు న్యాయం జరగాలి అని మంచు మనోజ్ సంచలనమైన రీతిలో ట్వీట్ చేశారు.
గతంలో కూడా సామాజిక సమస్యలు, వివాదాస్పదమైన సంఘటనల విషయంలో కూడా మంచు మనోజ్ ఘాటుగా స్పందించారు. తాజాగా బండి భగీరథ్ విషయంలో ఆయన స్పందించిన తీరుపై సోషల్ మీడియాలో హర్షం వ్యక్తమవుతున్నది. బాధితులకు ఆయన అండగా నిలిచేలా ట్వీట్ చేయడాన్ని అభినందిస్తున్నారు.
ఇక మంచు మనోజ్ కెరీర్ విషయానికి వస్తే.. ఇటీవల ఆయన సినీ ప్రయాణంలో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. భైరవం అనే చిత్రం ద్వారా మళ్లీ నటించడం మొదలుపెట్టారు. మిరాయి అనే చిత్రంలో విలన్ పాత్రలో కనిపించి సినీ విమర్శకులు, ప్రేక్షకుల ప్రశంసలు అందుకొన్నారు. ప్రస్తుతం వాట్ ది ఫిష్, డేవిడ్ రెడ్డి అనే చిత్రంలో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications