లవ్ మ్యారేజ్ చేసుకొని దిక్కులేనివాడిగా చెన్నైలో..పవన్ కల్యాణ్ ఒక్కడే అలా అండగా.. మనోజ్ ఎమోషనల్
టాలీవుడ్‌లోని పెద్ద కుటుంబాల్లో ఒకటైన మంచు ఫ్యామిలీలో గత కొద్దినెలలుగా వివాదాలు, గొడవలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అన్నదమ్ముల మధ్యలో మొదలైన గొడవ చివరికి తండ్రీ కొడుకుల వివాదంగా దారి తీసింది. ఏకంగా జిల్లా కలెక్టర్ రంగంలోకి దిగి మోహన్ బాబు - మంచు విష్ణుల మధ్య పంచాయతీ నిర్వహించారు. ప్రస్తుతం రెండు వర్గాలు మౌనం దాల్చి ఎవరి పనుల్లో వారు ఉన్నారు. మంచు మనోజ్ చాలా కాలం తర్వాత భైరవం అనే సినిమా ద్వారా ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో మనోజ్ చురుగ్గా పాల్గొంటున్నారు. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పవన్ కళ్యాణ్ గురించి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఈ వివరాల్లోకి వెళితే..
విడాకులతో డిప్రెషన్‌లో మంచు మనోజ్
ప్రణతితో విడాకుల తర్వాత మూడు నాలుగేళ్లు డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారు మనోజ్. కొడుకు భవిష్యత్ గురించి ఆందోళన చెందిన ఆయన తల్లి నిర్మల.. మనోజ్‌ను తీర్ధయాత్రలకు తీసుకెళ్లారు. రిషికేష్‌లోని ఆశ్రమంలో ఎక్కువ సమయం గడిపిన మనోజ్.. అక్కడ రీఛార్జ్ అయ్యారు. తిరిగి హైదరాబాద్‌కు వచ్చిన ఆయన.. భూమా నాగిరెడ్డి కుమార్తె మౌనికా రెడ్డితో కనిపించడం షాక్‌కు గురిచేసింది. ఓ వినాయక మందిరం వద్ద వీరిద్దరూ కనిపించగా నాటి నుంచి వీరి వ్యవహారం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.

భూమా మౌనికా రెడ్డితో రెండో పెళ్లి
మౌనికను మనోజ్ పెళ్లి చేసుకోబోతున్నారని మీడియాలో కథనాలు వచ్చాయి. వాటిని నిజం చేస్తూ తాను మౌనికను పెళ్లాడబోతున్నట్లు ప్రకటించి షాకిచ్చారు మనోజ్. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో మౌనిక మెడలో మూడు ముళ్లు వేశారు మంచు మనోజ్. అయితే ఈ పెళ్లి మోహన్ బాబుకు, విష్ణుకు ఇష్టం లేదని అప్పట్లో ప్రచారం జరిగింది. పెళ్లి వేడుకలో వీరిద్దరూ అంటీ ముట్టనట్లుగా వ్యవహరించడం అనేక అనుమానాలకు తావిచ్చింది. కొద్దిరోజుల తర్వాత ఓ రాత్రిపూట విష్ణు కొందరితో మనోజ్ ఇంటి వద్ద రచ్చ చేసిన వీడియో వెలుగులోకి రావడంతో టాలీవుడ్ ఉలిక్కిపడింది.
చెన్నైకి మకాం మార్చిన మనోజ్
మంచు ఫ్యామిలీలో ఏదో జరుగుతోందని, అన్నాదమ్ముల మధ్య పడటం లేదని మీడియాలో ఫోకస్ మొత్తం అటే పెట్టింది. తర్వాత విషయం సద్దుమణగగా మనోజ్ చాలాకాలం పాటు కనిపించలేదు. సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఆయన ఫ్యామిలీ తాలూకా ఏ కార్యక్రమంలోనూ సందడి చేయలేదు. మోహన్ బాబు యూనివర్సిటీ వ్యవహారాల్లో మాత్రం అప్పుడప్పుడు మెరిసేవాడు. అయితే మౌనికతో కలిసి మనోజ్ కుటుంబానికి దూరంగా చెన్నైలో వేరు కాపురం పెట్టినట్లు వార్తలు వచ్చాయి. ఆ సమయంలో తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని తాజా ఇంటర్వ్యూలో మంచు మనోజ్ బయటపెట్టారు.
పవన్ పక్కకి పిలిచి క్లాస్ పీకారు
ఈ కష్టాలలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ తనకు అండగా నిలిచిన విషయాన్ని మనోజ్ గుర్తుచేసుకున్నారు. మా ఇంట్లో గొడవల సంగతి తెలిసిన పవన్ అన్న ఓ రోజున నన్ను పక్కకి పిలిచి ఎక్కడ ఉంటున్నావ్? ఏం చేస్తున్నావ్? అని అడిగారు. నేను చెన్నైలో ఉంటున్నానని చెప్పడంతో ఏమైంది? చెన్నైకి ఎందుకు వెళ్లిపోయావని అన్న అడిగారు. హైదరాబాద్‌లో కొంచెం ఇబ్బందిగా ఉందని మౌనికతో చెన్నైలో ఉంటున్నానని చెప్పానని మనోజ్ తెలిపారు.
నాకు అండగా నిలిచిన ఏకైక వ్యక్తి పవన్
మనసులో అలాంటివేమీ పెట్టుకోకుండా, నన్ను వచ్చి కలువు.. చెన్నై వచ్చినప్పుడే నేనే ఇంటికొస్తానని పవన్ చెప్పారని వెల్లడించారు. నాకు, మౌనికకు సపోర్ట్ చేసిన తొలి వ్యక్తి పవన్ కళ్యాణ్ అని .. భీమ్లా నాయక్ సెట్‌కి రమ్మని పిలిచి నాకు క్లాస్ పీకారు. ముందు బరువు తగ్గి.. హీరో అనే కాకుండా ఏ క్యారెక్టర్ అయినా చేసే టాలెంట్ నీలో ఉందని నాకు పవన్ అన్న ధైర్యం చెప్పారు. అని మంచు మనోజ్ గుర్తుచేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. పవన్ మంచి మనసుని ఆయన అభిమానులు ప్రశంసిస్తున్నారు.


Click it and Unblock the Notifications











