Manchu Vishnu: సుప్రీంకోర్టుకి మంచు విష్ణు.. అలా షాకిచ్చిన కన్నప్ప హీరో
తెలుగు చిత్ర పరిశ్రమలోని పెద్ద కుటుంబాల్లో మంచు ఫ్యామిలీ కూడా ఒకటి. ఎక్కడో చిత్తూరు జిల్లాలోని మారుమూల గ్రామం నుంచి వచ్చి ఎన్నో కష్టాలు పడి తెలుగు చిత్ర సీమలో తనకంటూ కొన్ని పేజీలు లిఖించుకున్నారు మోహన్ బాబు. నటుడిగా, నిర్మాతగా, పంపిణీదారుగా ఆయన టాలీవుడ్‌లో చెరగని ముద్రవేశారు. 50 ఏళ్ల సినీ జీవితంలో వందలాది చిత్రాల్లో నటించి తన కుటుంబాన్ని కూడా పై స్థాయిలో నిలబెట్టారు. ఇండస్ట్రీలోని పెద్ద మనుషుల్లో ఒకరిగా ప్రతి ఒక్కరూ ఆయనను గౌరవిస్తారు.
సక్సెస్ కాలేకపోతున్న మోహన్‌బాబు వారసులు
మోహన్ బాబు తర్వాత ఆయన సంతానం మంచు లక్ష్మీ, విష్ణు, మనోజ్‌లు పరిశ్రమలో అడుగుపెట్టారు. ఏవో కొన్ని సినిమాలు తప్పించి పెద్దగా వీరు ఆకట్టుకోలేకపోయారు. కెరీర్ పరంగా ఇప్పటికీ వీరంతా నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. మంచు విష్ణు మా అధ్యక్షుడిగా గెలిచి.. పరిశ్రమలోని 24 విభాగాలను కంట్రోల్ చేసే స్థాయికి చేరుకున్నారు. కానీ హీరోగా ఆయన సక్సెస్ కాలేకపోయారు. వెనక్కి తిరిగి చూసుకుంటే రెండు మూడు సినిమాలు తప్పించి పెద్దగా హిట్స్ లేవు.

ఫ్యామిలీకి దూరంగా మనోజ్
లక్ష్మీప్రసన్న కూడా హీరోయిన్‌గా చేయాలా? క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఉండాలో అర్ధం కాలేక అడపా దడపా మెరుస్తున్నారు. బుల్లితెరపై చేసిన ప్రయత్నం కూడా అంతగా కలిసిరాలేదు. చిన్న కుమారుడు మంచు మనోజ్ హీరోగా బాగానే క్లిక్ అయినప్పటికీ వ్యక్తిగత జీవితంలో సమస్యలతో సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. భూమా నాగిరెడ్డి కుమార్తె భూమా మౌనికను రెండో పెళ్లి చేసుకున్న మనోజ్ భార్యాబిడ్డలతోనే ఉంటున్నారు. సరిగ్గా గడిచిన ఏడాదిగా మంచు ఫ్యామిలీకి అస్సలు టైం బాలేదు.
మీడియా ప్రతినిధిపై మోహన్ బాబు దాడి
మనోజ్ అనుచరులు, బంధువులపై మంచు విష్ణు అర్ధరాత్రి దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ తర్వాత విషయం సద్దుమణగ్గా.. మోహన్ బాబు- మనోజ్‌లు పోటాపోటీగా ఫిర్యాదు చేసుకోవడం చర్చనీయాంశమైంది. ఏకంగా కలెక్టర్, పోలీస్ కమీషనర్ స్థాయిలో ఈ పంచాయతీ నడిచింది. ఈ గొడవను కవర్ చేయడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దురుసుగా ప్రవర్తించడంతో ఆయనపై కేసు నమోదైంది.
కన్నప్పపై మంచు ఫ్యామిలీ ఆశలు
తన కొడుకును హీరోగా నిలబెట్టేందుకు మోహన్ బాబు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో క్లాసిక్‌గా నిలిచిపోయిన కన్నప్పను రీమేక్ చేస్తున్నారు. దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్‌తో కన్నప్పను పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు మోహన్ బాబు. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ వంటి భారీ స్టార్ క్యాస్టింగ్‌తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. జూన్ 27న కన్నప్పను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుండగా ఈ సినిమాకు సంబంధించిన కీలక కంటెంట్ ఉన్న హార్డ్ డిస్క్ కనిపించకుండా పోవడంతో మంచు విష్ణు షాకయ్యారు. తమ సినిమాను ఉద్దేశపూర్వకంగా తొక్కేయడానికి కొందరు కుట్రలు చేస్తున్నారంటూ విష్ణు ఆరోపించారు. దీంతో ఆయన ఎలాంటి స్టెప్ తీసుకుంటారోనని ఉత్కంఠ నెలకొంది.
2019 నాటి కేసు
తాజాగా మంచు విష్ణు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఇది హార్డ్ డిస్క్‌కి సంబంధించినదో లేదంటే కుటుంబ గొడవల కోసమో కాదు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులో. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లుగా మంచు విష్ణుపై అధికారులు కేసు నమోదు చేశారు. దాదాపు ఆరేళ్లుగా ఈ కేసు అలాగే కొనసాగుతున్న నేపథ్యంలో దీని నుంచి బయటపడాలని భావించిన విష్ణు తాజాగా సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ బీవీ నాగరత్న ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. మరి దీనిపై సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు వెలువరిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











