కోట శ్రీనివాసరావును చితకబాదిన ఎన్టీఆర్ అభిమానులు.. ఇండస్ట్రీ నుంచి వెలి.. ఏం జరిగిందంటే?
నటనకు నిలువెత్తు రూపంలా నిలిచిన అరుదైన నటుల్లో కోట శ్రీనివాసరావు ఒకరు. దాదాపు 4 దశాబ్ధాలుగా తెలుగు వారిని తన నటనతో ఆకట్టుకుంటోన్న కోట శ్రీనివాసరావు జూలై 13న కన్నుమూశారు. ఆయన మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. గత కొన్నేళ్లుగా వయోభారం, అనారోగ్యంతో సినిమాలకు దూరంగా ఉంటున్న కోట శ్రీనివాసరావు ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఎన్నో మరపురాని పాత్రలు పోషించిన కోట జీవితంలో మాయని మచ్చగా నిలిచిన క్యారెక్టర్ ఒకటుంది. దీని కారణంగా ఆయన తన్నులు తినడంతో పాటు ఇండస్ట్రీని వీడాల్సిన పరిస్ధితి నెలకొంది. ఈ వివరాల్లోకి వెళితే..
కాంగ్రెస్ కంచుకోటను బద్ధలు కొట్టిన ఎన్టీఆర్
రంగస్థలం నుంచి సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన కోట శ్రీనివాసరావు నటుడిగా నిలదొక్కుకుంటున్న రోజులవి. సరిగ్గా ఆ సమయంలోనే విశ్వ విఖ్యాత నట సార్వభౌమ, నటరత్న నందమూరి తారక రామారావు సినీ జీవితానికి ముగింపు కలిపి ప్రజల కోసం రాజకీయాల్లోకి దిగారు. తెలుగుదేశం పార్టీని స్థాపించి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ కంచుకోటను బద్ధలు కొట్టారు. పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా సంక్షేమ కార్యక్రమాలు, సాహోసపేత నిర్ణయాలు తీసుకుంటున్న కాలమది.

మండలాధీశుడులో ఎన్టీఆర్‌ను అనుకరించిన కోట
అప్పటికే ఎన్టీఆర్ మరో అగ్ర కథానాయకుడు, సూపర్‌స్టార్ కృష్ణ మధ్య విభేదాలు ఉండగా.. రాజకీయాలు ఇద్దరి మధ్య దూరాన్ని పెంచాయి. అప్పటి భారత ప్రధాని రాజీవ్ గాంధీ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అధిష్టానం సూచన మేరకు ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీ రామారావు, తెలుగుదేశం పార్టీపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ కృష్ణ పలు చిత్రాలు తీశారు. వీటిలో మండలాధీశుడు ఒకటి. ఇందులో ఎన్టీఆర్‌ను పోలిన పాత్రను కోట శ్రీనివాసరావు పోషించారు.పెద్దాయన హావభావాలు, డైలాగ్స్‌ను అనుకరిస్తూ కోట ఈ పాత్రను ఇరగదీశారు. థియేటర్స్‌లో కోట శ్రీనివాసరావు నటనకు ప్రజలు జేజేలు పలికినప్పటికీ వ్యక్తిగతంగా కోట మాత్రం తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
కోటను చితకబాదిన ఎన్టీఆర్ అభిమానులు
ఎన్టీఆర్ అభిమానులు, తెలుగుదేశం కార్యకర్తలు కోట శ్రీనివాసరావు కనిపిస్తే చంపేద్దామన్న కసితో ఉన్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ విజయవాడలో ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చి తిరిగి రైలులో హైదరాబాద్ బయల్దేరారు. రామారావు రాకతో అప్పటికే బెజవాడ రైల్వేస్టేషన్ మొత్తం ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ శ్రేణులతో నిండిపోయింది. ఈ విషయం తెలియని కోట శ్రీనివాసరావు.. మరో రైలులో హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకున్నారు. ఆ గుంపు చూసి భయపడిన కోట శ్రీనివాసరావు.. ఎలాగోలా స్టేషన్ నుంచి బయటపడాలని అనుకున్నారు. అయితే ఎన్టీఆర్ అభిమానుల్లో ఒకరు కోటను గుర్తుపట్టి కేకలు వేయడంతో అంతా ఆయనను చుట్టుముట్టి స్టేషన్ వెనక్కి లాక్కెళ్లారు. తిట్లు, బూతులతో విరుచుకుపడటంతో పాటు చితక్కొట్టేశారు. అయితే పెద్దలు జోక్యం చేసుకోవడంతో కోటను వదిలిపెట్టారు.
కోటను ఆశీర్వదించిన ఎన్టీఆర్
మండలాధీశుడు ఎపిసోడ్ తర్వాత కోట శ్రీనివాసరావుకు టాలీవుడ్‌లోని ఓ వర్గం ఆఫర్లు ఇవ్వలేదని ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు. ఓ రకంగా ఆయనపై అనధికార నిషేధం నడిచిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే దీనికి ఫుల్‌స్టాప్ పెట్టకుంటే కెరీర్ ఇబ్బందుల్లో పడుతుందని గ్రహించిన కోట .. వెంటనే ముఖ్యమంత్రి ఎన్టీ రామారావును కలిసి వివరణ ఇచ్చుకోవాలని డిసైడ్ అయ్యారు. ఓ రోజున ఎయిర్‌పోర్ట్‌లో ఎన్టీఆర్‌కు కోట శ్రీనివాసరావు ఎదురెళ్లి నమస్కారం పెట్టారు. అప్పటికే ఈ ఎపిసోడ్ గురించి తెలిసి ఉండటంతో రామారావు గారు కొంత సీరియస్‌గానే ఉన్నారు. కానీ అన్ని పక్కనపెట్టి.. మీరు మంచి నటులని విన్నాను.. గాడ్ బ్లస్ యూ ఆరోగ్యం జాగ్రత్త అని కోటను వెన్ను తట్టారు పెద్దాయన. దాంతో వెంటనే ఎన్టీఆర్ పాదాలకు నమస్కరించి కోట వచ్చేశారు. స్వయంగా ఎన్టీఆర్.. కోటను క్షమించడంతో రామారావు అభిమానులు శాంతించగా, ఈ వివాదానికి తెరపడింది.


Click it and Unblock the Notifications











