నాపై కుట్ర జరుగుతోంది.. కావాలనే నన్ను ఇరికించారంటూ మంగ్లీ ఆవేదన..
తెలంగాణలో సంచలనం రేపుతున్న మైక్రో ఫైనాన్స్, శుభక్షేత్ర ఇన్‌ఫ్రా ఆర్థిక మోసం వ్యవహారం రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ప్రముఖ గాయని మంగ్లీ పేరు బయటకు రావడంతో వివాదం మరింత చర్చనీయాంశమైంది. అయితే తాజాగా సోషల్ మీడియా వేదికగా స్పందించిన మంగ్లీ.. ఈ మొత్తం వ్యవహారంలో తనకు ఎలాంటి ప్రమేయం లేదని స్పష్టం చేస్తూ మరోసారి క్లారిటీ ఇచ్చారు. బాధితులకు న్యాయం జరగాలని కోరుకుంటున్నానని, గతంలో చెప్పినట్లే ఇప్పటికీ వారికి అండగా ఉంటానని వెల్లడించారు.
మంగ్లీ చేసిన తాజా పోస్టులో.. "మైక్రో ఫైనాన్స్, శుభక్షేత్ర ఇన్‌ఫ్రా మోసాలతో బాధితులకు అన్యాయం జరిగింది. వారికి న్యాయం జరగాలి. బాధితులకు న్యాయం జరిగే వరకు నేను అండగా ఉంటాను. ఈ ఆర్థిక మోసంలో నాకు ఎలాంటి సంబంధం లేదు" అని పేర్కొన్నారు. అంతేకాదు, కొందరు వ్యక్తులు కావాలనే తన పేరును ఈ వివాదంలోకి లాగుతూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. నిరాధారమైన ఆరోపణలు చేస్తూ, నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కేసు నేపథ్యం ఏమిటి?
మైక్రో ఫైనాన్స్, శుభక్షేత్ర ఇన్‌ఫ్రా పేర్లతో నడిచిన కొన్ని ఆర్థిక పథకాలపై ఇటీవల పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తాయని, భూములపై పెట్టుబడి పెడితే డబుల్ రిటర్న్స్ ఇస్తామని చెప్పి అనేక మందిని ఆకర్షించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు, చిన్న వ్యాపారులు, గ్రామీణ ప్రాంతాల పెట్టుబడిదారులు ఈ స్కీమ్‌లలో పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది.
బాధితుల వాదన ప్రకారం.. ప్రారంభంలో కొంతమందికి చిన్న మొత్తాలు తిరిగి చెల్లించి నమ్మకం కల్పించి, తర్వాత పెద్ద మొత్తాలు సేకరించినట్లు సమాచారం. అనంతరం చెల్లింపులు నిలిచిపోవడంతో అనుమానాలు మొదలయ్యాయి. పలువురు తమ డబ్బులు తిరిగి రాకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. కోట్ల రూపాయల వరకు ఈ వ్యవహారంలో చిక్కుకున్నాయని ప్రచారం జరుగుతోంది.
మంగ్లీపై ఆరోపణలు ఎలా వచ్చాయి?
ఈ కేసులో కొందరు బాధితులు, మధ్యవర్తుల ద్వారా మంగ్లీ పేరు బయటకు వచ్చింది. ఆమె తన పాపులారిటీతో ప్రజలను ప్రోత్సహించిందని కొందరు ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను మంగ్లీ పూర్తిగా ఖండించారు. "నేను ఎవరినీ పెట్టుబడులు పెట్టమని చెప్పలేదు. నా పేరు వాడుకుని కొందరు ప్రయోజనం పొందాలని చూస్తున్నారు" అని ఆమె వర్గాలు చెబుతున్నాయి.
తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ మంగ్లీ కొందరిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. మరోవైపు బాధితులు కూడా తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు రెండు వైపుల కేసులుగా మారింది.
తాజా పోస్టులో మంగ్లీ.. "నిజం నిలకడపై తెలుస్తుంది. న్యాయ వ్యవస్థపై, చట్టంపై నాకు సంపూర్ణ నమ్మకం ఉంది" అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొందరు ఆమెకు మద్దతుగా నిలుస్తుండగా, మరికొందరు పూర్తి విచారణ తర్వాతే నిజాలు బయటపడతాయని అంటున్నారు.
ఇకపై ఏం జరుగుతుంది?
ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు దశలో ఉంది. బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదులు, ఆర్థిక లావాదేవీలు, సంబంధిత వ్యక్తుల పాత్రపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. మంగ్లీ పేరు వివాదంలోకి రావడంతో ఈ కేసుపై ప్రజల్లో ఆసక్తి మరింత పెరిగింది. నిజానిజాలు విచారణలో తేలాల్సి ఉంది. ఈ వ్యవహరంలో ఒకవైపు బాధితుల న్యాయపోరాటం, మరోవైపు మంగ్లీ తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేస్తుండంతో ఈ వివాదం హాట్‌టాపిక్‌గా మారింది.


Click it and Unblock the Notifications



