భారతీయుల్లో స్వాతంత్ర కాంక్ష రగిల్చే కాగడానవుతా: ‘మణికర్ణిక’ తెలుగు ట్రైలర్
ఝాన్సీరాణి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చారిత్రాత్మక చిత్రం 'మణికర్ణిక'. కంగనా రనౌత్ టైటిల్ రోల్ పోషించిన ఈచిత్రానికి క్రిష్ జాగర్లమూడి, కంగనా దర్శకత్వం వహించారు. జనవరి 25న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో ప్రమోషన్ల స్పీడు పెంచారు.
ఈ చిత్రాన్ని హిందీతో పాటు తెలుగు, తమిళంలో కూడా విడుదల చేస్తున్నారు. గత నెలలో హిందీ ట్రైలర్ విడుదలవ్వగా... శుక్రవారం హైదరాబాద్‌లో తెలుగు ట్రైలర్ ఆవిష్కరించారు. ఆంగ్లేయ ప్రభుత్వం గ్రద్దలాగా ఝాన్సీపై దృష్టి నిలిపి కూర్చుంది. ఝాన్సీకి సరైన సమయంలో వారసుడు లభించకుంటే వారు ఝాన్సీని కూడా ఆక్రమిస్తారు... అనే డైలాగుతో ట్రైలర్ మొదలైంది.
'లక్ష్మీబాయి అనే నేను నా చివరి రక్తపు బొట్టు ఉన్నంతవరకు అంకిత భావంతో ఝాన్సీకి సేవ చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను.' అంటూ కంగనా చెప్పే డైలాగులు ఆసక్తిరేకెత్తిస్తున్నాయి. మనం పోరాడదాం... దాని వల్ల మన భావితరాలు స్వాతంత్ర వేడుక జరుపుకుంటాయి. ఛత్రపతి శివాజీ మహారాజుగారి స్వరాజ్య స్వప్నాన్ని పునర్జీవింపచేస్తాను. ప్రతి భారతీయుడిలో స్వాతంత్ర కాంక్షను రగిల్చే కాగడానవుతాను.... అంటూ రాసిన డైలాగులు సినిమాపై ఆసక్తిని పెంచాయి.
మణికర్ణికగా జన్మించి ఆమె లక్ష్మిభాయిగా ఎలా మారింది. ఎలాంటి పరిస్థితుల్లో ఝాన్సీ రాణిగా బాధ్యతలు చేపట్టింది. తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి చేసిన సాహసాలు, తీసుకున్న నిర్ణయాలు ఇలా ప్రతి అంశం సినిమాలో చూపించబోతున్నారు.

ఈ చిత్రం క్రిష్ దర్శకత్వంలో మొలైలైంది. దాదాపు 80 శాతం షూటింగ్ పూర్తయిన అనంతరం పలు కారణాలతో ఆయన తప్పుకోవడంతో.... మిగతా భాగాన్ని కంగనా రనౌత్ తన దర్శకత్వంలో పూర్తి చేశారు. నిర్మాత కమల్ జైన్ జీ స్టూడియోస్‌తో కలిసి దాదాపు 180 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. జనవరి 25న సినిమా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











