Manoj Manchu's Kannappa Review: కన్నప్ప మూవీపై మంచు మనోజ్ రివ్యూ.. ఆ 20 నిమిషాలైతే..
మంచు విష్ణు కలల ప్రాజెక్ట్ కన్నప్ప చిత్రం జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. భారీ బడ్జెట్, భారీ స్టార్ క్యాస్టింగ్, భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా రివ్యూలు బయటికొస్తున్నాయి. ఈ క్రమంలో కన్నప్పను మోహన్ బాబు రెండో కుమారుడు మంచు మనోజ్ వీక్షించారు. హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమ్యాక్స్‌లో ఈ సినిమాను వీక్షించిన ఆయన థియేటర్ నుంచి బయటికొస్తూ.. కన్నప్పపై రివ్యూ ఇచ్చారు. మరి కన్నప్ప సినిమాపై మనోజ్ ఎలాంటి రివ్యూ ఇచ్చారో చూస్తే..
వివాదాలలో మంచు ఫ్యామిలీ
టాలీవుడ్‌లోని పెద్ద కుటుంబాల్లో ఒకటైన మంచు ఫ్యామిలీ గత కొద్దినెలలుగా వివాదాలతో సతమతం అవుతున్న సంగతి తెలిసిందే. అన్నదమ్ములు, తండ్రీ కొడుకుల మధ్య గొడవలు చోటు చేసుకుని బజారుకెక్కారు. తొలుత విష్ణు- మనోజ్‌ల మధ్యలో మొదలైన గొడవ చివరికి తండ్రీ కొడుకుల వివాదంగా దారి తీసింది. ఏకంగా జిల్లా కలెక్టర్ రంగంలోకి దిగి మోహన్ బాబు - మంచు విష్ణుల మధ్య పంచాయతీ నిర్వహించారు. భూమా మౌనిక రెడ్డిని మనోజ్ పెళ్లి చేసుకోవడం మోహన్ బాబుకు, విష్ణుకు ఇష్టం లేదని అప్పట్లో మీడియాలో కథనాలు వచ్చాయి. మనోజ్ పెళ్లి వేడుకలో వీరిద్దరూ అంటీ ముట్టనట్లుగా వ్యవహరించడం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. ఓ రాత్రి విష్ణు తన అనుచరులతో మనోజ్ ఇంటి వద్ద రచ్చ చేసిన వీడియో హాట్ టాపిక్‌గా మారింది.

పోటాపోటీ ఫిర్యాదులు
ఈ ఘటనలతో మనోజ్ చాలాకాలం పాటు కనిపించలేదు. సినిమాలకు బ్రేక్ ఇచ్చి భార్యాబిడ్డలతోనే గడిపారు. అలాగే మంచు ఫ్యామిలీలోనూ ఆయన ఏ కార్యక్రమంలోనూ సందడి చేయలేదు. ఓ రోజున తీవ్రగాయాలతో నడవలేని స్థితిలో మనోజ్ ఆసుపత్రిలో కనిపించడం.. సోదరుడు, తండ్రిపై ఫిర్యాదులతో గతేడాది టాలీవుడ్ మొత్తం మంచు ఫ్యామిలీ చుట్టూనే తిరిగింది. ఈ గొడవల్లో ఓ విలేకరిపై మోహన్ బాబు దాడి చేయడం సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో మోహన్‌బాబుపై కేసు నమోదవ్వగా ఆయనకు న్యాయస్థానం నుంచి బెయిల్ లభించింది.
కన్నప్పపై మనోజ్ సెటైర్లు
ఈ గొడవల్లో పరోక్షంగా కన్నప్ప చిత్రంపై మంచు మనోజ్ వ్యాఖ్యలు చేశారు. కన్నప్ప దొంగప్పా, శివయ్యా అని పిలిస్తే శివుడు రాడు, కన్నప్ప చిత్ర నిర్మాణానికి డబ్బు ఎక్కడి నుంచి తెచ్చారంటూ అంటూ మనోజ్ ప్రశ్నించారు. అలాగే మోహన్ బాబు యూనివర్సిటీకి చెందిన నిధులును కన్నప్ప కోసం విష్ణు వాడారంటూ ఆరోపించారు. అక్కడితో ఆగకుండా కన్నప్ప చిత్రానికి పోటీగా తను నటించిన భైరవాన్ని దించుతానని సవాల్ విసిరే దాకా పరిస్ధితి వచ్చింది. అయితే మనోజ్ కొంతకాలం నుంచి మెత్తబడినట్లుగా కనిపిస్తోంది. అన్నయ్య విష్ణు, తండ్రి మోహన్ బాబు గురించి ఎక్కడా మాట్లాడటం లేదు.
కన్నప్పను వీక్షించిన మనోజ్
కన్నప్ప సినిమా రిలీజ్ సందర్భంగా చిత్ర యూనిట్‌కు ఆల్‌ది బెస్ట్ చెప్పాడు. తాజాగా సినిమా చూసేందుకు ఐమ్యాక్స్‌కు వచ్చాడు. అనంతరం థియేటర్ నుంచి బయటికి వస్తూ మీడియా ప్రతినిధులతో మనోజ్ ముచ్చటించారు. 'సినిమా చాలా చాలా బాగుంది. ప్రభాస్ గారు వచ్చినప్పటి నుంచి సినిమా నెక్ట్స్ లెవల్‌కు వెళ్తుంది. లీడ్ యాక్టర్లు .. క్లైమాక్స్‌లో ఇంత గొప్ప పర్ఫార్మన్స్ చేస్తారని కలలో కూడా అనుకోలేదు. చాలా అద్భుతంగా చేశారు. నేను అనుకున్న దాని కంటే 1000 రెట్లు బాగుంది. టీమ్ మొత్తానికి కంగ్రాట్స్.. మీ ఎఫర్ట్స్ ఫలించాలని దేవుడిని కోరుకుంటున్నా. సినిమా గొప్ప విజయం సాధించాలని.. మీరు పెట్టిన డబ్బు వెయ్యింతలుగా తిరిగి రావాలని కోరుకుంటున్నా. ముందు 5 నిమిషాలు మిస్ అయ్యా.. రేపొచ్చి చూస్తా' అని మనోజ్ తెలిపారు. ప్రస్తుతం కన్నప్ప చిత్రానికి మనోజ్ ఇచ్చిన రివ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











