ఆ విషయంలో ప్రభాస్ డైలమా: మారుతి ప్లాన్ వర్కౌట్ అయితే ఫ్యాన్స్‌కు పండగే
రెబెల్ స్టార్ కృష్ణంరాజు ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయమైనా.. చాలా తక్కువ సమయంలోనే తన సత్తాను నిరూపించుకుని టాలీవుడ్‌లో స్టార్ హీరోగా ఎదిగిపోయాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. ఇలా సుదీర్ఘ కాలం పాటు ఇక్కడ సందడి చేసిన డార్లింగ్.. 'బాహుబలి'తో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. దీంతో అప్పటి నుంచి భారీ చిత్రాలనే చేస్తూ ముందుకు దూసుకెళ్తోన్నాడు. ఇలా ఇప్పటికే రెబెల్ స్టార్ ప్రభాస్.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్', ఓం రౌత్ తెరకెక్కిస్తోన్న 'ఆదిపురుష్', నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'ప్రాజెక్టు K', సందీప్ రెడ్డి వంగాతో 'స్పిరిట్' అనే భారీ చిత్రాలు చేస్తోన్నాడు.
ఎవరూ ఊహించని రీతిలో ఇప్పటికే పలు భారీ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకున్న ప్రభాస్.. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో 'రాజా డీలక్స్' (పరిశీలనలో ఉన్న పేరు) అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఈ మూవీ హర్రర్ కామెడీతో రాబోతుందని ప్రచారం జరుగుతోంది. ఇక, ఈ సినిమా పూజా కార్యక్రమాలు గత అక్టోబర్ 17వ తేదీ జరిగాయి. ఆ వెంటనే ఓ భారీ బంగ్లా సెట్‌ను రూపొందించిన చిత్ర యూనిట్ మొదటి షెడ్యూల్‌ను ప్రారంభించి కొన్ని కీలకమైన సన్నివేశాలను కూడా చిత్రీకరించింది. దీనికి సంబంధించిన పిక్ కూడా బయటకు వచ్చింది. అయితే, ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌కు బ్రేక్ వచ్చింది.

ప్రస్తుతం ప్రభాస్ తన డేట్లను 'సలార్' మూవీకి కేటాయించాడు. దీంతో డైరెక్టర్ మారుతి వేరే వ్యవహారాలపై ఫోకస్ చేసినట్లు తెలిసింది. దీని ప్రకారం.. ఈ సినిమాకు పని చేసే మ్యూజిక్ డైరెక్టర్ ఎంపిక గురించి ఆయన ఆలోచనలో పడినట్లు తెలిసింది. ఈ విషయంపై ప్రభాస్ ఎటూ తేల్చుకోలేకపోవడంతో మారుతి.. ఎస్ థమన్ పేరును సూచించినట్లు తెలిసింది. గతంలో ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ హర్రర్ నేపథ్యంతో వచ్చిన 'రాజు గారి గది 2', 'భాగమతి' వంటి చిత్రాలకు అతడు చక్కని బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. ఇదే విషయాన్ని ప్రభాస్‌కు చెప్పి మారుతి కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉండగా.. ప్రభాస్ - మారుతి కాంబినేషన్‌లో రాబోతున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు హీరోయిన్లుగా నటిస్తున్నట్లు ఇప్పటికే ఓ న్యూస్ లీకైంది. ఇక, ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











