60 ప్లస్‌లోనూ తగ్గేదేలే .. కొడుకుకి పోటీగా మెగా బ్రదర్ , చెమటోడుస్తోన్న నాగబాబు
మెగాస్టార్ చిరంజీవి వేసిన బాటలో మెగా ఫ్యామిలీ ఈ రోజున తెలుగు చిత్ర పరిశ్రమలోనే ఓ ప్రభావవంతమైన పాత్ర పోషిస్తోంది. చిరు తర్వాత ఆయన రెండో తమ్ముడు నాగబాబు ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. చిన్నా చితకా పాత్రలు, సపోర్టింగ్ రోల్స్ చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మెగా ఫ్యామిలీకి చిరంజీవి మూలస్తంభమైనా.. కుటుంబంలో మిగిలిన వ్యవహారాలు చక్కబెట్టేది, వెనకుండి నడిపించేది నాగబాబే.
1961 అక్టోబర్ 29న మొగల్తూరులో జన్మించారు నాగబాబు. విద్యాభ్యాసం తర్వాత తన అన్నయ్య బాటలోనే చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన ఆయన.. రాక్షసుడి సినిమాలో ఓ రోల్‌లో కనిపించారు. తర్వాత మరణ మృదంగం, త్రినేత్రుడు, లంకేశ్వరుడు, కొండవీటి దొంగ, ధర్మ, సూపర్ ఎక్స్‌ప్రెస్, పరిష్కారం, అల్లరోడు, ఆంటీ తదితర చిత్రాల్లో నటించారు. ఈ దశలో రుక్మిణీ సినిమాలో ఆయన పోషించిన బండబాబు రోల్ నాగబాబుకు మంచి పేరు తీసుకొచ్చింది. తర్వాత ఆయన హీరోగా వచ్చిన కౌరవుడులో తన విశ్వరూపం చూపించారు నాగబాబు.

తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా టర్న్ అయిన నాగబాబుకు కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చందమామ సినిమా మరోసారి నటుడిగా గుర్తింపు తీసుకొచ్చింది. గతేడాది బేబి సినిమాతో మరోసారి తన విలక్షణ నటనతో ఆకట్టుకున్నారు. తెలుగులోనే కాదు.. తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల్లోనూ నాగబాబు నటించారు. నటుడిగానే కాకుండా నిర్మాతగానూ చిత్ర పరిశ్రమపై తనదైన ముద్ర వేశారు నాగబాబు.
తన తల్లి అంజనా దేవి పేరిట అంజనా ప్రొడక్షన్స్ పేరుతో నిర్మాతగా మారిన ఆయన 1988లో రుద్రవీణను నిర్మించి .. తొలి సినిమాతోనే నేషనల్ అవార్డ్ , నంది అవార్డ్ అందుకున్నారు. తర్వాత త్రినేత్రుడు, ముగ్గురు మొనగాళ్లు, బావగారు బాగున్నారా, కౌరవుడు, గుడుంబా శంకర్, స్టాలిన్, ఆరెంజ్ చిత్రాలు నిర్మించారు. అయితే ఆరెంజ్ సినిమా భారీ నష్టాలను తీసుకురావడంతో ఆర్ధికంగా తీవ్ర ఇబ్బందులు పడ్డారు నాగబాబు. ఈ సినిమా పరాజయం తర్వాత సినీ నిర్మాణానికి దూరమైన ఆయన జబర్దస్త్ కార్యక్రమానికి జడ్జిగా తెలుగు లొగిళ్లకు బాగా దగ్గరయ్యారు.
ఇక తన సోదరులు , కుటుంబంపై నాగబాబు ఈగ వాలనివ్వరు. ఎవరైనా ఏదైనా వాళ్లను ఉద్దేశించి అంటే వెంటనే కౌంటర్ ఇచ్చేస్తారు. రాజకీయాలపై ఆసక్తితో తొలుత ప్రజారాజ్యం పార్టీలో కీలక పాత్ర పోషించిన ఆయన ఇప్పుడు జనసేన పార్టీకి ప్రధాన కార్యదర్శిగా సేవలందిస్తున్నారు. త్వరలో జరగనున్న ఏపీ మంత్రి వర్గ విస్తరణలో చంద్రబాబు నాయుడు కేబినెట్‌లో ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఇక తన వారసుడిగా వరుణ్ తేజ్‌ను హీరోగా నిలబెట్టిన నాగబాబు.. కుమార్తె నిహారికను కూడా నిర్మాతగా ఇండస్ట్రీలో నిలదొక్కుకునేలా ప్రోత్సహించారు. 60 ఏళ్లు దాటినా ఇప్పటికీ ఎంతో ఆరోగ్యంగా ఉంటారు నాగబాబు. ఎంత బిజీగా ఉన్నా సరే వర్కవుట్స్, వ్యాయామం, యోగా వంటి వాటిని ఆయన వదిలిపెట్టరు. తాజాగా జిమ్‌లో వర్కవుట్స్ చేస్తూ కండలు తిరిగిన శరీరాన్ని చూపిస్తున్న నాగబాబు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











