గేమ్ ఛేంజర్‌ను చంపేస్తారా? తమన్ సెన్సేషనల్ కామెంట్స్‌పై చిరంజీవి ఎమోషనల్ రియాక్షన్
తమిళ దర్శక దిగ్గజం శంకర్- గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్‌ల కాంబోలో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకొచ్చింది. శంకర్ తొలిసారిగా ఓ స్ట్రెయిట్ తెలుగు సినిమాకు దర్శకత్వం వహించడంతో ఈ మూవీపై ఎక్కడా లేని అంచనాలు నెలకొన్నాయి. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ కారణంగా అనుకున్న స్థాయిలో వసూళ్లు రావడం లేదు.
ఇటీవలి కాలంలో ఫ్యాన్ వార్ అనేది దారుణంగా తయారైంది. తమ హీరోల సినిమాలను మించి కలెక్షన్స్, రికార్డులు మరే హీరోకి ఉండొద్దన్న చెత్త మనసున్న కొందరు అభిమానుల వల్ల ఆహ్లాదంగా ఉండే వాతావరణం దెబ్బ తింటోంది. మేం మేం బాగానే ఉన్నాం మీరు కొట్టుకోవద్దంటూ స్టార్ హీరోలు ఎన్నో వేదికల మీద నుంచి చెబుతున్నా కొందరు మారడం లేదు.

సామాజిక మాధ్యమాలు, టెక్నాలజీని ఉపయోగించి తమ ప్రత్యర్ధి హీరోలను దెబ్బ కొడుతున్నారు. నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేసి బాగున్నా సినిమాలను కూడా జనం ఆదరించకుండా థియేటర్‌కు రాకుండా కట్టేస్తున్నారు. దీంతో ఎంతో మంచి కంటెంట్ ఉన్న సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద దెబ్బయిపోతున్నాయి. గతంలో కొందరు హీరోల సినిమాలు ఇలాగే దారుణంగా ఫ్లాప్ అయిన సందర్భాలు ఉన్నాయి.
తాజాగా రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్‌పై కొందరు భారీ స్థాయిలో నెగిటివ్ టాక్ వ్యాప్తి చేస్తున్నారని మెగా అభిమానులు ఆరోపిస్తున్నారు. దీనికి మించి సినిమా రిలీజ్ రోజునే గేమ్ ఛేంజర్ హెచ్‌డీ ప్రింట్ అన్‌లైన్‌లో చక్కర్లు కొట్టడంతో ఇండస్ట్రీ వర్గాలే షాక్ అయ్యాయి. అయితే ఇంతటి నెగిటివిటీలోనూ గట్టి ఓపెనింగ్స్ రాబట్టిన రామ్ చరణ్ తన సత్తా ఏంటో చూపిస్తున్నాడు. బయట ఉన్న టాక్‌కి .. సినిమాకి అసలు సంబంధమే లేదని ప్రేక్షకులు చెబుతున్నారు.
కాగా.. గేమ్ ఛేంజర్ రిజల్ట్‌పై ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేసిన తమన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మనమే మన సినిమాను చంపేసుకుంటుంటే.. ఏం బతుకు బతుకుతున్నామో, బాధగా ఉంది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఓపెన్‌గా మా సినిమా సక్సెస్ అయ్యింది అని చెప్పలేకపోవడం అత్యంత దురదృష్టకరమని .. మీరూ మీరూ కొట్టుకోండి సినిమాను మాత్రం చంపకండి అని తమన్ కోరారు. తెల్లారితే లేస్తామో లేదో తెలియదు అలాంటిది ఎందుకు ఇంత నెగిటివిటీ అంటూ ఆయన ప్రశ్నించారు. సినిమా నచ్చకుంటే వదిలేయండి అంతేకానీ ఇలాంటి నెగిటివిటీ వల్ల నిర్మాతను బాధపెట్టకూడదని తమన్ అన్నారు.
Dear @MusicThaman
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 18, 2025
నిన్న నువ్వు మాట్లాడిన మాటలు హృదయాల్ని తాకేలా ఉన్నాయి. ఎప్పుడూ సరదాగా మాట్లాడుతూ వుండే నీలో ఇంత ఆవేదన వుండడం నాకు ఒకింత ఆశ్చర్యంగా కూడా అనిపించింది. కానీ మనసు ఎంత కలత చెందితే నువ్వింతగా స్పందించావో అని అనిపించింది.
విషయం సినిమా అయినా క్రికెట్ అయినా
మరో…
ఈ నేపథ్యంలో తమన్ వ్యాఖ్యలపై మెగాస్టార్ చిరంజీవి ఎక్స్‌లో స్పందించారు. నిన్న నువ్వు మాట్లాడిన మాటలు హృదయాల్ని తాకేలా ఉన్నాయి. ఎప్పుడూ సరదాగా మాట్లాడుతూ వుండే నీలో ఇంత ఆవేదన ఉందా? నీ మనసు ఎంత కలత చెందితే నువ్వింతగా స్పందించావో అంటూ చిరు ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ప్రభావం ప్రతి ఒక్కరిపై పడుతోందని .. పాజిటివ్‌గా ఉంటే అది మన జీవితాలను కూడా ముందుకు నడిపిస్తుందని మెగాస్టార్ సూచించారు. ప్రస్తుతం చిరు ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











