ఇంట్లో బంగారు కోడిపెట్ట మాయం..పోలీసులకు చిరంజీవి ఫిర్యాదు!
కృషి, పట్టుదల , క్రమశిక్షణ ఉంటే సామాన్యులైనా అసాధారణ విజయాలు సాధించొచ్చని నిరూపించిన అతికొద్దిమందిలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. గాడ్ ఫాదర్ లేకుండా ఎంట్రీ ఇచ్చి మహామహులున్న తెలుగు చిత్ర పరిశ్రమకే గాడ్ ఫాదర్‌గా నిలిచారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని ఎంతోమంది నటీనటులు, దర్శకులు, టెక్నీషియన్స్ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు, ఇంకా పెడుతున్నారు. 70కి చేరువైనా ఈ వయసులోనూ కుర్ర హీరోలను మించిన స్పీడుతో సినిమాలు చేస్తున్నారు మెగాస్టార్.
నాలుగు దశాబ్ధాలుగా టాలీవుడ్‌ను మకుటం లేని మహారాజుగా ఏలుతున్నారు చిరంజీవి. బ్రేక్ డ్యాన్స్‌ని తెలుగువారికి పరిచయం చేసిన చిరు.. భారతదేశంలో రూ.కోటికి పైగా పారితోషికం తీసుకున్న తొలి నటుడిగానూ చరిత్రలో నిలిచిపోయారు . ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ వేడుకల్లో అతిథిగా పాల్గొనే ఆహ్వానం అందుకున్న తొలి దక్షిణ భారత నటుడిగా ఘనత దక్కించుకున్నారు.

కెరీర్‌లో నాలుగు నంది అవార్డులు, 9 ఫిల్మ్‌ఫేర్ సౌత్ పురస్కారాలు, ఆంధ్రా యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ చిరంజీవి అందుకున్నారు. భారతీయ చిత్ర పరిశ్రమకు అందించిన సేవలకు గాను దేశ అత్యున్నత పురస్కారాలైన పద్మభూషణ్, పద్మవిభూషణ్‌లతో మెగాస్టార్‌ను గౌరవించింది కేంద్ర ప్రభుత్వం. తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన ప్రేక్షకులకు ఎంతో కొంత సేవ చేయాలనే లక్ష్యంతో బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్‌లను స్థాపించి వేలాది ప్రాణాలను నిలబెట్టారు.
కెరీర్ తొలినాళ్లలో తాను ఎన్నో ఇబ్బందులు పడ్డానని ఆ సమయంలో వెన్నుతట్టి ప్రోత్సహించే వారు ఉంటే బాగుండేదని మెగాస్టార్ పలుమార్లు తెలిపారు. తాను పడిన బాధలు ఇప్పటి తరం పడకూడదని , యంగ్ టాలెంట్‌ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో చిన్న హీరోల ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌కి కూడా వెళ్లి వారిని ఆశీర్వదించి వస్తారు. ఏదైనా సినిమా ఘన విజయం సాధిస్తే ఎంతో సంతోషించి వారిని తన ఇంటికి పిలిపించి సత్కరించే పెద్దమనసు చిరంజీవిది. ఇటీవల హీరో విశ్వక్‌సేన్ నటించిన లైలా , బ్రహ్మానందం కుమారుడు రాజా గౌతమ్ నటించిన బ్రహ్మా ఆనందం చిత్రాల ప్రీ రిలీజ్ ఈవెంట్‌లకు హాజరయ్యారు. తమకు నందమూరి , మెగా కాంపౌండ్ అన్న తేడాలు లేవని మా అందరినీ తెలుగు సినీ కాంపౌండ్ అని వేదిక మీదే చెప్పారు.
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే చిరంజీవి ఎప్పటికప్పుడు పోస్ట్‌లు పెట్టడంతో పాటు రీల్స్‌తోనూ ఆకట్టుకుంటూ ఉంటారు. తాజాగా ఆయన పెట్టిన వీడియో వైరల్ అవుతోంది. మా ఇంట్లో బంగారు కోడిపెట్ట ఉండేదని .. అది ఈ మధ్య కనిపించడం లేదని దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశానని, కానీ వాళ్లు బంగారు కోడిపెట్ట ఉండటం ఏంటని తన కంప్లయంట్ పట్టించుకోవడం లేదని చెప్పారు.
కానీ మార్చి 22న సాయంత్రం హైదరాబాద్ హైటెక్స్‌లో ఎంఎం కీరవాణి ఆధ్వర్యంలో ఒక సంగీత కచేరి జరుగుతుందని.. అక్కడ నా బంగారు కోడిపెట్ట ఉంటుందని చెప్పారని చిరు తెలిపారు. నాక్కూడా అదే అనిపించి.. నా బంగారు కోడిపెట్టను పట్టుకోవడానికి కొంతమందిని పంపిస్తానని, మీరు కూడా అక్కడికి వెళ్లి నా బంగారు కోడిపెట్టను పట్టుకుని, వాటేసుకుని , తీసుకొచ్చేయండి అంటూ చిరు పిలుపునిచ్చారు. సో.. అదన్నమాట మేటర్.


Click it and Unblock the Notifications











