చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి మెగా హీరోలు.. ఎవరెవరు వెళ్తున్నారంటే? ఇక కళ్లన్నీ గన్నవరం మీదే!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ , జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 164 అసెంబ్లీ, 21 లోక్‌సభ స్థానాల్లో గెలిచి తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించింది. ఫలితాలు విడుదలై దాదాపు వారం రోజులు కావొస్తున్నా ఇంకా ప్రభుత్వ ఏర్పాటుకు శ్రీకారం చుట్టలేదు. టీడీపీ, జనసేనలు ఎన్డీయేలో భాగస్వామ్య పక్షాలు కావడంతో ఈ వారం రోజులూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు ఢిల్లీలో సమావేశాలు, భేటీలు, తర్వాత మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. కేంద్రంలో ప్రభుత్వం కొలువుదీరడంతో పవన్, చంద్రబాబులు రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై కసరత్తు ప్రారంభించారు. దీనిలో భాగంగా మంగళవారం శాసనసభాపక్షనేతల ఎన్నిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
మంగళవారం మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ఎన్నికైన ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్‌ను జనసేన శాసనసభాపక్షనేతగా ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ ప్రతిపాదించగా.. ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. అటుపక్క విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్‌లో టీడీపీ , జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా శాసనసభాపక్షనేతగా చంద్రబాబు నాయుడును ఎన్నుకున్నారు. అలాగే చంద్రబాబును సీఎం అభ్యర్ధిగా పవన్ కళ్యాణ్ ప్రతిపాదించగా.. మూడు పార్టీల ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ తీర్మానాన్ని కూటమికి చెందిన నేతలు గవర్నర్‌కు పంపితే.. ఆయన పరిశీలించి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం పలకనున్నారు.

బుధవారం ఉదయం 11.27 గంటలకు ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు సమీపంలో కేసరపల్లి ఐటీ పార్క్ ఇందుకు వేదిక కానుంది. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోడీ సహా పలువురు ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు , ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. అలాగే వైసీపీ పాలనలో బాధితులుగా మిగిలిన 104 మంది కుటుంబాలను ప్రత్యేకంగా ఆహ్వానించారు.
అలాగే చంద్రబాబు నాయుడు సైతం వ్యక్తిగతంగా కొందరు ప్రముఖులకు ఆహ్వానాలు పంపారు. టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవిని స్టేట్ గెస్ట్ హోదాలో ఆహ్వానించారు. దీంతో మంగళవారం సాయంత్రం 5 గంటలకు చిరంజీవి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకోనున్నారు. ఆయనతో పాటు చిరంజీవి కుమారుడు , హీరో రామ్‌చరణ్‌కు కూడా ఆహ్వానం అందడంతో మెగాపవర్ స్థార్ సైతం బెజవాడ రానున్నారు.

కాగా.. ప్రజారాజ్యం పార్టీ స్థాపన, కాంగ్రెస్‌లో విలీనం, కేంద్రమంత్రిగా పనిచేసిన అనంతరం చిరంజీవి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా సినిమాలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. కానీ లక్షలాది మంది మెగాభిమానులు, కాపు సామాజిక వర్గంలో ఆయన పరపతి ఏమాత్రం తగ్గలేదు. అప్పటికీ, ఇప్పటికీ చిరంజీవిని వారు పెద్దన్నయ్యగా గౌరవిస్తూ.. ఆయన మాటను వేదవాక్కుగా భావించేవారు ఎందరో. అందుకే చిరంజీవి ఇప్పుడు వస్తానన్నా అనేక పార్టీలు రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలకడానికి రెడీగా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు.
రాజకీయాలకు దూరం జరిగిన తర్వాత తన సోదరుడు పవన్ కళ్యాణ్ పార్టీ పెడితే దానిపై ఎలాంటి స్పందనా వ్యక్తం చేయలేదు. పదేళ్లుగా మౌనంగానే ఉన్నారు. కానీ ఉన్నట్లుండి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ , లోక్‌సభ ఎన్నికల్లో కూటమికి చిరంజీవి బాహాటంగా మద్ధతు పలకడం చర్చనీయాంశమైంది. సీఎం రమేశ్, పంచకర్ల రమేష్ బాబులను పక్కపక్కన కూర్చోబెట్టుకుని ఎన్నికల్లో కూటమి అభ్యర్ధులను గెలిపించాలని కోరారు. మూడు పార్టీలు కూటమిగా ఏర్పడటం శుభపరిణామమన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లాలన్నదే తన కోరిక అని చిరు చెప్పారు. కూటమికి మద్ధతు తెలిపిన కృతజ్ఞతతోనే తన ప్రమాణ స్వీకారానికి చిరంజీవిని ఆహ్వానించారు చంద్రబాబు .


Click it and Unblock the Notifications











