మంత్రి అయ్యాక తొలిసారిగా మెగాస్టార్ ఇంటికి రోజా.. సన్మానించి పంపిన చిరు దంపతులు
తెలుగు సినిమాల్లో తనదైన ముద్ర వేసుకున్న ఆర్.కె.రోజా తాజాగా ఆంధ్రప్రదేశ్ మంత్రిగా కూడా ఎన్నికైన సంగతి తెలిసిందే. మంత్రి అయిన తర్వాత బిజీ బిజీగా గడుపుతున్న ఆమె మెగాస్టార్ చిరంజీవి నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి దంపతులు ఆమెకు సన్మానం చేసినట్లు సమాచారం వివరాల్లోకి వెళితే

వైఎస్ జగన్ వెంట
సినీ నటిగా కెరీర్ ప్రారంభించిన ఆర్కే రోజా చాలాకాలంపాటు తెలుగులో టాప్ హీరోయిన్ గా కొనసాగింది. ఇక హీరోయిన్ గా అవకాశాలు తగ్గుతున్నాయి అనుకున్న సమయంలో సెల్వమణిని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమె ఆ తర్వాత 1999వ సంవత్సరంలో రాజకీయ రంగ ప్రవేశం చేసింది.
సుమారు పదేళ్లపాటు తెలుగు మహిళ అధ్యక్షురాలు గా పనిచేసిన ఆమె ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు కాంగ్రెస్ లో చేరదామని అనుకుంటున్న నేపథ్యంలో వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించడంతో ఆ తరువాతి కాలంలో ఆమె వైఎస్ జగన్ వెంట నడిచారు.

మంత్రి పదవి ఖాయం
ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆమె 2014వ సంవత్సరంలో కేవలం ప్రతిపక్షానికి మాత్రమే పరిమితం అయ్యారు. 2019 వ సంవత్సరంలో కూడా ఆమె ఎన్నికల్లో విజయం సాధించడంతో ఆమెకు మంత్రి పదవి ఖాయం అని అందరూ అనుకున్నారు. కానీ కొన్ని సమీకరణాల దృష్ట్యా ఆమె మంత్రి కాలేకపోయారు రెండో విడత కేబినెట్ విస్తరణలో భాగంగా ఆమె కు మంత్రి పదవి లభించింది.

బిజీబిజీగా
ఈ నేపథ్యంలోనే జబర్దస్త్ సహా సినిమాలకు దూరం అవుతానని ప్రజలకు సేవ చేయడమే తనకు ఇష్టమని ఆమె ప్రకటన కూడా చేశారు. అయితే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా సినీ రంగానికి తనకు చేతనైన సేవ చేస్తానని ప్రకటించిన ఆమె అప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో బిజీబిజీగా గడుపుతున్నారు. అయితే తాజాగా కాస్త తీరిక దొరకడంతో ఆమె హైదరాబాద్ తన కుటుంబ సమేతంగా విచ్చేశారు.

క్షేమ సమాచారం అడిగి
ఈ నేపథ్యంలోనే ఒకపక్క మెగాస్టార్ చిరంజీవి మరో పక్క కేసిఆర్ నివాసాలకు వెళ్లి వారిద్దరినీ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. మెగాస్టార్ ఇంటికి రోజా వెళ్లడంతో చిరంజీవి ఆయన సతీమణి సురేఖ, రోజా, ఆమె భర్త సెల్వమణి సహా పిల్లలిద్దరినీ సాదరంగా ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో ఆచార్య విడుదలైన క్రమంలో రోజా మెగాస్టార్ చిరంజీవికి శుభాకాంక్షలు తెలుపగా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజాకు మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. అలాగే ఇరువురి కుటుంబ సభ్యులు కూడా క్షేమ సమాచారం అడిగి తెలుసుకున్నారు.

సన్మానం
ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి రోజా శాలువా కప్పి సన్మానించారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. రాజకీయాలు పక్కన పెడితే సినిమా వాళ్ళందరూ ఒకటేనని ఈ తాజా ఘటన రుజువు చేస్తోంది. ఇక మెగాస్టార్ చిరంజీవి తో భేటీ అయిన అనంతరం రోజా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో కూడా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ కుటుంబ సభ్యులు కూడా సంప్రదాయబద్ధంగా రోజాను సత్కరించారు. ఇక కేసీఆర్ చిత్రపటాన్ని రోజా కేసీఆర్ కు బహుకరించారు.


Click it and Unblock the Notifications











