Balagam టీమ్‌కు చిరంజీవి సర్‌ప్రైజ్: డైరెక్టర్ వేణు జబర్ధస్త్ స్కిట్ గుర్తు చేస్తూ!
ఈ మధ్య కాలంలో తెలుగులో మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే సినిమాలు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పల్లె పద్దతులు, జీవన స్థితిగతులను చూపిస్తూ మూవీలు రూపొందుతోన్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో కనిపించే సామాన్య పరిస్థితుల నేపథ్యంతో రూపొందిన చిత్రం 'బలగం'. సుదీర్ఘ కాలంగా టాలీవుడ్‌లో కమెడియన్‌గా సత్తా చాటుతోన్న జబర్ధస్త్ వేణు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను ప్రముఖ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించడంతో అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి.
తెలంగాణలోని పల్లెటూరి సంస్కృతికి అద్దం పట్టేలా రూపొందిన 'బలగం' మూవీకి ఆరంభంలోనే అదిరిపోయే టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే ఆరంభం నుంచే ఈ చిత్రానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఊహించని రీతిలో రెస్పాన్స్ దక్కుతోంది. అలాగే, వేరే ప్రాంతాల్లోనూ ఇది మంచి స్పందననే సొంతం చేసుకుంటోంది. ఫలితంగా ఈ చిత్రానికి కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. ఇలా ఇప్పటి వరకూ ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 7.84 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 3.28 కోట్లు షేర్ కలెక్ట్ చేసింది. తద్వారా హిట్ స్టేటస్‌తో పాటు రెండు కోట్ల రూపాయల వరకూ లాభాలను కూడా సొంతం చేసుకుంది.

తక్కువ బడ్జెట్‌తో వచ్చి సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న 'బలగం' మూవీని తాజాగా మెగాస్టార్ చిరంజీవి వీక్షించారు. ఇది ఆయనకు ఎంతో బాగా నచ్చడంతో చిత్ర యూనిట్‌పై ప్రశంసల వర్షం కురిపించడంతో పాటు అందరినీ సన్మానించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. 'సినిమాను అంత బాగా తీసేసి మాకు షాక్ ఇస్తే ఎలాగయ్యా. నీ జబర్ధస్త్ స్కిట్లు చూసేవాడిని. అందులో ఉగ్గుకథలు, బుర్రకథలు చెప్పేవాడివి. ఇప్పుడు సినిమాను చక్కగా తీశావు. మంచి కమర్షియల్ ప్రొడ్యూసర్ ఉన్నా.. నువ్వు ఎలా తీయాలనుకున్నావో అలాగే తీశావు. అందరికీ కంగ్రాట్స్' అంటూ అందరినీ సత్కరించారు.
'బలగం' మూవీలో ప్రియదర్శి, కావ్య కల్యాణ్‌రామ్ ప్రధాన పాత్రలు పోషించారు. వేణు దర్శకత్వం వహించిన ఈ సినిమాను దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌లో హన్సితా రెడ్డి, హర్షిత్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. భీమ్స్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు. అలాగే, ఇందులో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తదితరులు కీలక పాత్రలను చేశారు.


Click it and Unblock the Notifications











