HBD Chiranjeevi: మెగా ఫ్యాన్స్‌కు బర్త్‌డే సర్‌ప్రైజ్.. శక్తివంతమైన ఆయుధంతో చిరంజీవి
ఏజ్‌తో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ జెట్ స్పీడ్‌తో ముందుకు సాగుతున్నారు టాలీవుడ్ బడా హీరో మెగాస్టార్ చిరంజీవి. గతంలో కాస్త నెమ్మదిగా ప్రాజెక్టులను పట్టాలెక్కించిన ఆయన.. ఈ మధ్య కాలంలో మాత్రం ఎంతో వేగంగా సినిమాలు చేస్తున్నారు. ఇలా ఇప్పటికే చాలా చిత్రాలతో వచ్చి ప్రేక్షకులను, అభిమానులను అలరించారు.
ఈ మధ్య కాలంలో భారీ ప్రాజెక్టులు చేస్తూ దూసుకుపోతోన్న మెగాస్టార్ చిరంజీవి.. ఇప్పుడు 'విశ్వంభర' అనే సోషియో ఫాంటసీ సినిమాలో నటిస్తున్నారు. దీన్ని బింబిసార ఫేం మల్లిడి వశిష్ట రూపొందిస్తున్నాడు. ముల్లోకాలు అనే కాన్సెప్టుతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని హై రేంజ్‌లోనే తీస్తున్నారు.

విజువల్ వండర్‌గా తెరకెక్కుతోన్న 'విశ్వంభర' మూవీకి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది. అప్పటి నుంచి ఏమాత్రం బ్రేకులు లేకుండా ఈ చిత్రం షూటింగ్‌ను జరుపుతున్నారు. ముఖ్యంగా ప్రధాన తారాగణంపై ఎన్నో కీలకమైన సన్నివేశాలను షూట్ చేశారు. ఇలా ఇప్పటి వరకూ దాదాపు 60 శాతం పైగా టాకీ పార్టును కంప్లీట్ చేసేశారు.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ రూపొందుతోన్న 'విశ్వంభర' సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో పలు భాషల్లో తెరకెక్కిస్తున్నారు. దీంతో ఈ చిత్రంపై హైప్ క్రమంగా పెరుగుతూనే ఉంది. అయినా దీని నుంచి ఇప్పటి వరకూ పెద్దగా అప్‌డేట్లు ఏమీ రాలేదు. దీంతో ఫ్యాన్స్ నిరాశగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో తాజాగా దీని నుంచి ఓ ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చింది.
నేడు (ఆగస్టు 22) మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. దీన్ని పురస్కరించుకుని 'విశ్వంభర' చిత్రం నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో మెగాస్టార్ ఓ శక్తివంతమైన తిశూలం పట్టుకుని కనిపించారు. ఆయన లుక్ ఫ్యాన్స్‌ను ఫిదా చేసేలా ఉందని చెప్పొచ్చు. ఇక, దీనికి 'చీకటి, చెడు ఈ ప్రపంచాన్ని చుట్టుముట్టినప్పుడు ఓ శక్తివంతమైన తార ప్రకాశవంతంగా మారుతుంది' అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు.
ఇదిలా ఉండగా.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేస్తున్న 'విశ్వంభర' మూవీని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇందులో త్రిష హీరోయిన్‌గా.. సురభి, ఈషా చావ్లా, రమ్య పసుపులేటి, కునాల్ కపూర్, నవీన్ చంద్రలు కీలక పాత్రలను చేస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 10వ తేదీన విడుదల కాబోతుంది.


Click it and Unblock the Notifications











