Vishwambhara Release Date: మెగాస్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. విశ్వంభర విడుదల కాబోయేది ఆరోజే!
తెలుగు సినీ రంగంలో సీనియర్ హీరోల హవా ఇప్పటికీ కొనసాగుతోంది. కుర్ర హీరోల కంటే కూడా సీనియర్ హీరోలే ఎక్కువగా హిట్లు కొడుతున్నారు. వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ జోష్ మీద ఉన్నారు. అయితే గతంలో రెండు సినిమాలు ఫ్లాప్ కాగా.. చిరంజీవి సరైన కథ కోసం ఎదురు చూసి మరీ ఓ సినిమాకు ఓకే చెప్పారు. అదే విశ్వంభర. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇటీవలే ప్రారంభం కాగా.. సినిమా విడుదల తేదీని ఫిక్స్ చేశారు. మరి ఈ చిత్రం ఎప్పుడు రాబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
'బింబిసార' ఫేం మల్లిడి వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' అనే సినిమాను చేస్తున్నారు. గతేడాదే మ్యూజిక్ సిట్టింగ్స్ తో ఈ సినిమాను ప్రారంభించగా.. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. సోషియో ఫాంటసీ జోనర్‌లో రూపొందుతున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వి వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డిలు దాదాపు 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

విశ్వంభర సినిమాలో మొత్తం ఆరు పాటలు ఉంటాయని గతంలోనే సంగీత దర్శకుడు కీరవాణి తెలిపారు. ఎంఎం కీరవాణియే ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. అలాగే చోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తుండగా.. కోటగిరి వెంకటేశ్వర రావు ఎడిటింగ్ బాధ్యతలు చూసుకోబోతున్నారు. అలాగే డైలాగ్స్ ను సాయి మాధవ్ బుర్రా రాయనున్నారు. కాస్ట్యూమ్ డిజైనర్ గా చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల వ్యవహరించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అనేక వార్తలు నెట్టింట వైరల్ అయ్యాయి. ముఖ్యంగా నటీనటుల విషయంపై పెద్ద ఎత్తున చర్చ సాగింది.
చిరంజీవి హీరోగా రాబోతున్న ఈ సినిమా మూడు లోకాల చుట్టూ తరిగే కథ అని చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా దేవ, మానవ, పాతాళ లోకాల్లో ఓ పాప చుట్టూనే కథ తిరిగుతుందని సమాచారం. ఈ సినిమాలో చిరంజీకి పోటీగా దగ్గుబాటి రాణా విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇదంతా ఇలా ఉండగా.. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని కూడా ఫిక్స్ చేశారు. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.

జనవరి 10వ తేదీన ఈ సినిమాను థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారట. జనవరి ఒకటవ తేదీ శుక్రవారం, రెండు, మూడో తేదీల్లో వీకెండ్స్ వస్తున్నాయి. అలాగే నాలుగో తేదీ భోగి, ఐదో తేదీ సంక్రాంతి, ఆరో తేదీన కనుమ కాగా.. పదో తేదీన విశ్వంభర విడుదల కానుంది. చూడాలి మరి ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్టు కొట్టి ఎంత మేర కలెక్షన్లు సాధిస్తుందనేది.


Click it and Unblock the Notifications











