ఆ సాయంత్రం ఎన్నటికీ మరువలేనిది.. హ్యాపీ మూడ్‌లో రామ్ చరణ్
టాలీవుడ్ అగ్రనటుడు, మెగాస్టార్ చిరంజీవి జీవితంపై సీనియర్ జర్నలిస్టు వినాయకరావు ఓ పుస్తకం రాశారు. 'మెగాస్టార్ ది లెజెండ్' పేరుతో పుస్తకం రచించిన ఆయన పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో నిన్న (మార్చి 2) ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిరంజీవి తనయుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హాజరయ్యారు.
అయితే తాజాగా ఆ బృహత్తర పుస్తకావిష్కర కార్యక్రమానికి హాజరు కావడం పట్ల తన ఫీలింగ్స్ తెలుపుతూ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ పెట్టారు రామ్ చరణ్. ''నిన్నటి సాయంత్రం ఏ నాటికీ మర్చిపోలేనిది. చిరంజీవిగారి మీద పుస్తకాన్ని రచించిన వినాయకరావుగారికి ధన్యవాదాలు. ఈ పుస్తకాన్ని లాంచ్ చేయడం నాకు లభించిన గౌరవంగా భావిస్తున్నా. నాన్న సినీ ప్రయాణంలో కలిసి పయనించిన ఎందరో ప్రముఖులతో కలిసి వేదికను పంచుకోవడం ఆనందంగా ఉంది'' అని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.

ఇకపోతే రామ్ చరణ్ ప్రస్తుతం RRR సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ తో పాటు మరో స్టార్ హీరో ఎన్టీఆర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరికీ సమాన ప్రాధాన్యత ఇస్తూ చెర్రీని అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ ని కొమురం భీం గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు జక్కన్న.


Click it and Unblock the Notifications











