Messi: ఉప్పల్ స్టేడియంలో మెస్సీ మేనియా.. నాటునాటు పాటతో దుమ్ములేపిన రాహుల్ సిప్లిగంజ్
Messi - Rahul Sipligunj: ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ హైదరాబాద్ పర్యటన సాగుతుంది. 'గోట్ ఇండియా టూర్ 2025'లో భాగంగా శనివారం (డిసెంబర్ 13) ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు.మెస్సీకి అభిమానులు, అధికార యంత్రాంగం ఘన స్వాగతం పలికాయి. ఎయిర్‌పోర్ట్ నుంచి నేరుగా చారిత్రక ఫలక్‌నుమా ప్యాలెస్‌కు చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరిగిన 'మీట్ అండ్ గ్రీట్' కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో మెస్సీతో పాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ఫొటో సెషన్‌లో భాగమయ్యారు. సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు కూడా హాజరై ప్రపంచ క్రీడా లెజెండ్‌తో ముచ్చటించారు. చారిత్రక రాజప్రాసాదంలో మెస్సీ అడుగుపెట్టడం హైదరాబాద్‌కు అంతర్జాతీయ గుర్తింపును తీసుకొచ్చిందని అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు.

షెడ్యూల్ కంటే కొద్దిగా ఆలస్యంగా మెస్సీ పర్యటన కొనసాగుతున్నా, అభిమానుల ఉత్సాహంలో మాత్రం ఎలాంటి తగ్గుదల కనిపించలేదు. మెస్సీతో పాటు ఆయన సహచరులు రోడ్రిగో డి పాల్, లూయిస్ సువారెజ్ కూడా హైదరాబాద్‌లో సందడి చేస్తున్నారు. వీరంతా సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీతో కలిసి ఉప్పల్ స్టేడియంకు బయలుదేరగా, వేలాది మంది అభిమానులు స్టేడియానికి చేరుకున్నారు.
ఉప్పల్ స్టేడియం పరిసరాలు మెస్సీ అభిమానులతో కిక్కిరిసిపోయింది. ముఖ్యంగా 'జెర్సీ నంబర్ 10'ధరించిన అభిమానులు నీలి-తెలుపు రంగుల్లో స్టేడియం జన సముద్రంలా మార్చేంది. అలాగే.. లేజర్ షోలు, లైటింగ్, భారీ సౌండ్ సిస్టమ్‌తో స్టేడియం పండుగ వాతావరణాన్ని తలపించింది. ఈ కార్యక్రమంలో ఆస్కార్ విజేత ప్రసిద్ధ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఇచ్చిన లైవ్ పెర్ఫార్మెన్స్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నాటు నాటు పాటకు రాహుల్ సిప్లిగంజ్ చేసిన ప్రదర్శన అభిమానులను ఉర్రూతలూగించింది.ఈ సమయంలో మెస్సీ జట్టు, సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని జట్టుతో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడానున్నారు.
ఇదిలాఉంటే.. కోల్‌కతా సాల్ట్ లేక్ స్టేడియంలో గతంలో జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకుని, హైదరాబాద్ పోలీసులు పూర్తి స్థాయి భద్రతా ఏర్పాట్లు చేశారు. ఉప్పల్ స్టేడియం చుట్టూ భారీగా పోలీసు బలగాలను మోహరించారు. పాస్ ఉన్నవారికే ప్రవేశం కల్పించడంతో పాటు, ట్రాఫిక్ ఆంక్షలు విధించి ముందస్తు చర్యలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించారు.


Click it and Unblock the Notifications











