రాజమౌళి కుటుంబంలో తీవ్ర విషాదం.. కీరవాణి తండ్రి శివశక్తి దత్తా కన్నుమూత
లెజెండరీ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన సోదరుడు, ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి తండ్రి శివశక్తి దత్తా కన్నుమూశారు. ఆయన వయసు 92 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శివశక్తి దత్తా సోమవారం రాత్రి హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

శివశక్తి దత్తా ప్రస్థానం
అక్టోబర్ 8, 1932న తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలోని కొవ్వూరులో జన్మించారు శివశక్తి దత్తా. ఆయన అసలు పేరు కోడూరి సుబ్బారావు. చిన్నప్పటి నుంచే నటన, కళలపై ఆసక్తితో ఇంట్లో నుంచి పారిపోయిన ఆయన ముంబైలోని ఓ కాలేజీలో చేరారు. అనంతరం స్వగ్రామానికి తిరిగొచ్చి కమలేశ్ అనే పేరుతో చిత్రకారుడిగా పనిచేశారు. చిత్రకారుడిగానే కాకుండా సంగీతంపై మక్కువతో హర్మోనియం, గిటార్, సితార్ వంటి వాయిద్య పరికరాలను వాయించడం నేర్చుకున్నారు.
రైటర్‌గా, గేయ రచయితగా
ఈ దశలో శివశక్తి దత్తా మనసు సినిమాలవైపు మళ్లింది. తన సోదరుడు విజయేంద్ర ప్రసాద్‌తో కలిసి మద్రాస్ రైలెక్కిన ఆయన స్క్రీన్ ప్లే రైటర్‌గా కొత్త అవతారమెత్తారు. కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన జానకి రాముడు సినిమాతో ఈ అన్నదమ్ముల పేర్లు ఇండస్ట్రీలో మారుమోగిపోయింది. గేయ రచయితగా ఎన్నో హిట్ సాంగ్స్‌కి సాహిత్యం అందించిన శివశక్తి దత్తా.. 2007లో చంద్రహాస్ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. రాజమౌళి దర్శకత్వం వహించిన సై, ఛత్రపతి, బాహుబలి 1, బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో పాటు ఎన్టీఆర్ కథానాయకుడు, హనుమన్, రాజన్న సినిమాలలో శివశక్తి దత్తా రాసిన పాటలు పాపులర్ అయ్యాయి. పెయింటర్‌గా, రచయితగా, దర్శకుడిగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు.
కళామతల్లి సేవలో కుటుంబం
శివశక్తి దత్తాకు ఒక అన్న, అక్క, నలుగురు తమ్ముళ్లు ఉన్నారు. రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్ర ప్రసాద్ ఆయనకు తమ్ముడు. ఇక శివశక్తి దత్తాకు ముగ్గురు సంతానం.. ఎంఎం కీరవాణి, కళ్యాణి మాలిక్, శివశ్రీ కంచి. వీరు సంగీత దర్శకులుగా, నటులుగా, రైటర్స్‌గా సినీ పరిశ్రమలోనే స్థిరపడి ఆయన వారసత్వాన్ని కంటిన్యూ చేస్తున్నారు. శివశక్తి దత్తా మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతిపట్ల సంతాపం తెలియజేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ సంతాపం
శివశక్తి దత్తా మృతి పట్ల సినీనటుడు, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కళలు, సాహిత్యంపై శివ శక్తి దత్తాకు ఎంతో అభిమానమని.. తెలుగు సంస్కృతి, సాహిత్యాలపై పట్టున్న దత్తాగారు పలు సినిమాలకు గేయ రచన చేశారని పవన్ గుర్తుచేశారు. దత్తా గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. అలాగే పితృ వియోగంతో బాధపడుతున్న కీరవాణి గారికి, ఆయన సోదరులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను అని పవన్ కళ్యాణ్ ఓ ప్రకటనలో తెలిపారు. మరోవైపు శివశక్తి దత్తా అంత్యక్రియలు మంగళవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని మహా ప్రస్థానంలో జరుగుతాయని కుటుంబ సభ్యులు వెల్లడించారు.


Click it and Unblock the Notifications











