మంచు వారి కొత్త ప్రాజెక్ట్.. ‘సన్ ఆఫ్ ఇండియా’గా మోహన్ బాబు
విలక్షణ నటుడు, కలెక్షన్ కింగ్ మెహన్ బాబు తెరపై తన నట విశ్వరూపాన్ని చూపించక చాలా రోజులే అవుతోంది. నిర్మాణంలోనూ మంచు వారు స్పీడ్ తగ్గించారు. ఒకప్పుడు లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ అంటే అందరికీ ఓ నమ్మకం ఉండేది. ఆ ప్రొడక్షన్ హౌస్ నుంచి సినిమా వస్తుందంటే అందరిలోనూ ఓ ఆశ ఉండేది. అయితే రాను రాను వారికి విజయమన్నదే వరించకుండా పోయింది. ఇక చివరగా గాయత్రి సినిమాతో మంచు వారు సినిమా నిర్మాణానికి స్వస్తి పలికినట్టు తెలుస్తోంది.
అయితే మళ్లీ ఇన్ని రోజులకు మోహన్ బాబు మేకప్ వేసుకునేందుకు రెడీ అవుతున్నాడు. అది కూడా ఇదివరకెన్నడూ చేయని ఓ విభిన్న చిత్రం కావడంతో అందరిలోనూ అంచనాలు పెరిగాయి. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మోహన్ బాబు తన కొత్త ప్రాజెక్ట పేరు, ఫస్ట్ లుక్‌ను విడుదల చేశాడు. 'సన్ ఆఫ్ ఇండియా'గా మోహన్ బాబు ఓ పవర్ ఫుల్ పాత్రను పోషించబోతోన్నట్టు తెలుస్తోంది. ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని యూనిట్ వెల్లడించింది.

మాటల రచయిత డైమండ్ రత్నంబాబు దర్శకుడిగా పరిచయం కాబోతోన్న ఈ సినిమాను లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ సంయుక్తంగా నిర్మించబోతోన్నాయి. ఇక మంచు వారు అంతా బిజీబిజీగా గడపబోతోన్నారు. ఓ వైపు మనోజ్ అహం బ్రహ్మాస్మి, విష్ణు మోసగాళ్లు, భక్త కన్నప్ప ప్రాజెక్ట్‌లతో బిజీ అయ్యారు. మంచు లక్ష్మీ హోస్టింగ్, వెబ్ సిరీస్‌లు అంటూ నిత్యం బిజీగానే ఉంటుంది. ఇకనైనా మంచు ఫ్యామిలీకి సక్సెస్ వస్తుందో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











