కష్టజీవి, అభిరుచిగల నిర్మాత.. విజయ బాపినీడు మృతికి మోహన్‌బాబు సంతాపం
ప్రముఖ దర్శకుడు, నిర్మాత, ఎడిటర్ విజయబాపినీడు గారి మరణం నన్ను చాలా బాధించింది. ఆయనతో నా పరిచయం నేటిది కాదు. 1990 నుంచి విజయ బాపినీడు గారు నాకు బాగా తెలుసు. నాకు అత్యంత సన్నిహితమైన వ్యక్తుల్లో విజయ బాపినీడు గారు కూడా ఒకరు అని కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు అన్నారు.
విజయబాపినీడు రామోజీరావు గారి మయూరి సంస్థలో పని చేస్తున్న రోజుల నుంచి మంచి సాన్నిహిత్యం ఉంది. ఎంతో మృదు స్వభావి. గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి. విజయ బాపినీడు గారు మంచి దర్శకుడు మాత్రమే కాదు, అంతకుమించి మంచి రచయిత, ఎడిటర్, అభిరుచి గల నిర్మాత. చాలా హార్డ్‌వర్క్ చేస్తారు. ఆయన లాంటి గొప్ప వ్యక్తిని కోల్పోవడం తెలుగు సినిమా పరిశ్రమకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతున్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని మోహన్‌బాబు ఓ ప్రకటనలో తెలిపారు.

తెలుగు చలన చిత్రసీమలో కుటుంబ కథా చిత్రాలకు పెద్ద పీట వేసిన ప్రముఖ దర్శకుడు విజయ బాపినీడు ఇకలేరు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన అంతక్రియలు గురువారం హైదరాబాద్ మహాప్రస్థానంలో నిర్వహిస్తారు.
అమెరికాలో ఉన్న ఆయన పెద్దమ్మాయి రావడానికి సమయం పడుతున్న కారణంగా అంతక్రియలు గురువారం నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. విజయబాపినీడు పార్ధీవ దేహాన్ని ఫిలిం ఛాంబర్‌లో ఏర్పాటు చేసి శ్రద్ధాంజలి ఘటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











