MSVG: మన శంకర వర ప్రసాద్ గారు ట్రైలర్ చూసి.. రామ్ చరణ్ ఏమన్నారంటే?
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ మన శంకర వరప్రసాద్ గారుపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన టైటిల్ గ్లింప్స్, మూడు పాటలు, పోస్టర్లు మెగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకోగా, తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను మరోస్థాయికి తీసుకెళ్లింది.
ఆదివారం తిరుపతిలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ మూవీ ట్రైలర్‌ను ఘనంగా విడుదల చేశారు. తిరుపతి అంటే తనకు ప్రత్యేకమైన సెంటిమెంట్ ఉందని ఈ సందర్భంగా అనిల్ రావిపూడి తెలిపారు. ' ఏ సినిమా మొదలుపెట్టినా, రిలీజ్ అయినా ముందు తిరుపతికి రావడం నా అలవాటు. వెంకటేశ్వర స్వామి దయ వల్లే నా కెరీర్ ఇలా సాగుతోంది. అలాంటి పవిత్ర స్థలంలో చిరంజీవిగారి సినిమా ట్రైలర్ విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది'అని ఆయన భావోద్వేగంగా మాట్లాడారు.

ట్రైలర్ గురించి మాట్లాడుతూ అనిల్ రావిపూడి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.'ఇది కేవలం రెండున్నర నిమిషాల ట్రైలర్ మాత్రమే. కానీ థియేటర్‌లో రెండున్నర గంటల సినిమా ఉంటుంది. టైమ్ మెషీన్‌లోకి వెళ్లి వింటేజ్ చిరంజీవిని చూసి వచ్చిన ఫీల్ ప్రేక్షకులకు కలుగుతుంది. చిరంజీవిగారి ఎనర్జీ, టైమింగ్ ప్రేక్షకులకు ఎంతగా నచ్చుతాయో మనందరికీ తెలుసు. ఆ దృష్టితోనే శంకర వరప్రసాద్ పాత్రను డిజైన్ చేశాను. నేను రాసిన దానికంటే చిరంజీవిగారు తన స్వాగ్‌తో వినోదాన్ని వంద రెట్లు పెంచారు. అందుకే ఆయన పేరుతోనే ఈ సినిమా చేశాను'అని తెలిపారు.
ఈ సినిమాలో 'వెంకటేష్' కీలక పాత్రలో నటించడం మరో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. చిరంజీవి- వెంకటేష్ కాంబినేషన్‌ను ఒకే ఫ్రేమ్‌లో చూడాలని ఎంతోమంది అభిమానులు కోరుకున్నారని, ఆ కోరికను ఈ సినిమాతో నెరవేర్చగలిగామని అనిల్ రావిపూడి చెప్పారు. అలాగే కథానాయికగా 'నయనతార'నటించడంపై ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. షూటింగ్ సమయంలో సమ్మె వంటి అడ్డంకులు ఎదురైనా, ఆమె సహకారం వల్లే సినిమా సమయానికి పూర్తయిందని, పైగా ప్రమోషన్స్‌లో కూడా పాల్గొనడం తనకు ఎంతో ధైర్యం ఇచ్చిందని అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో గురించి మాట్లాడుతూ.. 'మీసాల పిల్ల' సాంగ్ యూట్యూబ్‌ను షేక్ చేస్తోందని, 'శశిరేఖ' పాటతో పాటు చిరంజీవి-వెంకటేష్‌పై రూపొందించిన పండుగ సాంగ్ సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోందని తెలిపారు. ఈ పాటలు కేవలం మెగా అభిమానులకే కాకుండా, అన్ని వర్గాల సినీ ప్రేమికులను ఎంటర్టైన్ చేస్తున్నాయని చెప్పారు.
ఈ ట్రైలర్‌ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పటికే చూసినట్లు అనిల్ రావిపూడి వెల్లడించారు.'నిన్నే రామ్ చరణ్ గారు ట్రైలర్ చూశారు. ఆయన ఫస్ట్ రియాక్షన్ చాలా ఎక్స్ట్రార్డినరీగా ఉంది. ట్రైలర్ అద్భుతంగా ఉందని కాంప్లిమెంట్ ఇచ్చారు. మెగా అభిమానులు చిరంజీవిని ఎలా చూడాలనుకుంటారో, అచ్చం అలాగే ఈ సినిమాలో చూడబోతున్నారు'అని తెలిపారు. ఈ సినిమా పూర్తిస్థాయి ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్ అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా, సంక్రాంతి బాక్సాఫీస్‌పై భారీ అంచనాలతో నిలుస్తోంది. 'ఈ సంక్రాంతికి మళ్లీ థియేటర్‌కు వచ్చి నవ్వుకుందాం' అంటూ అనిల్ రావిపూడి ప్రేక్షకులను ఆహ్వానించారు. మొత్తంగా 'మన శంకర వరప్రసాద్ గారు' ట్రైలర్ మెగా అభిమానులకే కాకుండా, ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా చిరంజీవి సినిమా ఆకర్షించేలా ఉందని చెప్పాలి.


Click it and Unblock the Notifications











