భారతీయుడు -2 నిర్మాతలకు కొత్త తలనొప్పి.. ఓటీటీ స్ట్రీమింగ్‌కు చిక్కులు
తమిళ దర్శక దిగ్గజం శంకర్, దిగ్గజ నటుడు కమల్ హాసన్ కాంబినేషన్‌లో ఎప్పుడో 1996లో వచ్చిన భారతీయుడు వెండితెరపై సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఒక స్వాతంత్ర్య సమర యోధుడు దేశంలో పేరుకుపోయిన అవినీతిని నిర్మూలించేందుకు పోరాడటమే ఈ సినిమా వృత్తాంతం. ఆశయ సాధనలో భాగంగా చివరికి తన కన్న కొడుకు అవినీతిపరుడని తెలియడంతో తన బిడ్డయినా సరే శిక్ష విధిస్తాడు. కమల్ హాసన్ నటన, దేశభక్తి, స్వాతంత్య్రోద్యమ నేపథ్యం, పాటలు, శంకర్ టేకింగ్ అన్నింటికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.
అలాంటి బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్‌గా భారతీయుడు -2 తెరకెక్కించాలని ఎన్నోసార్లు డిమాండ్లు తెరపైకి వచ్చాయి. అయితే శంకర్, కమల్ హాసన్ వేరే ప్రాజెక్ట్స్‌లో బిజీగా ఉండటంతో ఈ సినిమా ఆలస్యమవుతూ వచ్చింది. ఎట్టకేలకు కరోనా సమయంలో లైకా ప్రొడక్షన్స్ చొరవతో భారతీయుడు -2 కార్యరూపం దాల్చి.. ఎన్నో అవాంతరాల మధ్య షూటింగ్ పూర్తి చేసుకుంది. కమల్‌కు తోడు సిద్ధార్ధ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, బాబీ సింహా వంటి భారీ స్టార్ క్యాస్టింగ్ ఉండటంతో భారతీయుడు-2పై అంచనాలు పెరిగిపోయాయి.

గత నెల 12న ప్రపంచవ్యాప్తంగా భారతీయుడు -2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాకు మార్నింగ్ షో నుంచే డివైడ్ టాక్ వచ్చింది. కథ, కథనం సరిగా లేకపోవడం, కమల్ హాసన్ పాత్ర తీరు తెన్నులు అంతగా ఆకట్టుకోకపోవడంతో భారతీయుడు -2 డిజాస్టర్‌గా నిలిచింది. భారతీయుడు-2లో శంకర్ మార్క్ కనిపించకపోవడంతో ఆయన 1996లోనే ఆగిపోయారని, ఇంకా అప్‌డేట్ కాలేదని కౌంటర్లు వేస్తున్నారు. థియేటర్లలో రిలీజ్ కాకముందే భారతీయుడు -2 శాటిలైట్ రైట్స్, ఓటీటీ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయాయి. కానీ స్క్రీన్ మీదకు వచ్చిన తర్వాత ఇండియన్ -2 దారుణంగా ఫెయిలైంది. కేవలం రూ.70 కోట్ల షేర్ మాత్రమే సాధించి భారీ నష్టాలను మిగిల్చింది.
అనంతరం 4 వారాలు తిరక్కుండానే ఆగస్ట్ 9 నుంచి భారతీయుడు -2ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఓటీటీ ఫ్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ చేశారు మేకర్స్. ఆశ్చర్యకరంగా 6 వారాలు కాకుండానే ఓటీటీలో స్ట్రీమింగ్ చేయడం నిర్మాతలను ఇబ్బందుల్లో పడేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలను బట్టి.. ఓటీటీ నియమ నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను మల్లీఫ్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా.. భారతీయుడు-2 మేకర్స్‌కు లీగల్ నోటీసులు పంపింది.
సాధారణంగా హిందీలో విడుదలయ్యే సినిమాలు 8 వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ కావాల్సి ఉంది. ఈ మార్గదర్శకాలను ఉల్లంఘించిన వారు టాప్ 3 నేషనల్ మల్టీప్లెక్స్ చెయిన్ అయిన పీవీఆర్, ఐనాక్స్, సినీపోలీస్‌లలో తమ సినిమాలను విడుదల చేయలేరు. వాస్తవానికి భారతీయుడు-2 హిందీ వెర్షెన్‌ని సెప్టెంబర్ 6న ఓటీటీలో రిలీజ్ చేయాల్సి ఉంది. అలాంటిది అంతకుముందు ఈ సినిమా ఓటీటీలో ముందే వచ్చేస్తుండటంతో మల్టీప్లెక్స్ యాజమాన్యాలు ఫైర్ అయ్యాయి. మరి ఈ ఇష్యూని భారతీయుడు-2 మేకర్స్ ఎలా సెటిల్ చేస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











