National Cinema Day 2023: సినీ ప్రియులకు గుడ్ న్యూస్ - 99 రూపాయలకే మల్టీప్లెక్సులో సినిమా చూసే అవకాశం!
Movie Tickets: సినీ ప్రేక్షకులకు మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అదిరిపోయే వార్త చెప్పింది. ఈనెల 13వ తేదీన జాతీయ సినిమా దినోత్సవం సందర్భంగా బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం 99 రూపాలయకే మల్టీప్లెక్సుల్లో సినిమా టిక్కెట్ అందించేందుకు ముందుకు వచ్చింది. అయితే ఈ ఆఫర్ అక్టోబర్ 13వ తేదీ ఒక్కరోజు మాత్రమే అందుబాటులో ఉండబోతున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రియులు తెగ ఆసక్తిగా వేచి చూస్తున్నారు.
ఎక్కువ మొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టి సినిమా చూడలేని వాళ్లంతా ఆరోజు కేవలం 99 రూపాయలకే టిక్కెట్ కొనుక్కొని సినిమా చూడొచ్చు. ముఖ్యంగా స్నేహితులతో పాటు ఫ్యామిలీనీ కూడా వెంట తీసుకెళ్లి మీకు నచ్చిన సినిమా చూసి ఎంజాయ్ చేయచ్చు. అక్టోబర్ 13వ తేదీ శుక్రవారం కావడంతో ఆరోజు చాలా సినిమాలు విడుదల అయ్యే అవకాశం కనిపిస్తోంది. జాతీయ సినిమా దినోత్సవాన్ని పురస్కరించుకొని దాదాపు 4 వేల కంటే ఎక్కువ స్క్రీన్లలో ఈ అవకాశం కల్పించారు.

ఈ అద్భుతమైన ఆఫర్ ప్రముఖ థియేటర్లు అయిన పీవీఆర్, ఐమాక్స్, సినీ పోలీస్, మిరాజ్, సిటీప్రైడ్, ఏషియన్, ముక్తా ఏ2, మూవీ టైమ్, వేవ్, ఎం2కే, డిలైట్ లలో అందుబాటులో ఉంటాయి. ఆన్ లైన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకున్న వారికి మాత్రమే రూ.99కే టిక్కెట్ లభిస్తుంది. నేరుగా థియేటర్ల వద్దకు వెళ్లిన వారికి ఈ ఆఫర్ వర్తించదు. సో ఇంకెందుకు ఆలస్యం.. ఆ అద్భుతమైన అవకాశాన్ని ఉపయోగించుకొని మీకు నచ్చిన సినిమా చూసి ఎంజాయ్ చేసేయండి.

2022లో మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తొలి సారిగా జాతీయ సినిమా దినోత్సవాన్ని జరుపుకోవడం మొదలు పెట్టింది. గతంలో జాతీయ సినిమా దినోత్సవాన్ని సెప్టెంబర్ 16వ తేదీ రోజన ప్రతిపాదించారు. కానీ ఆ తర్వాత జాతీయ సినిమా దినోత్సవ వేడుకలను సెప్టెంబర్ 23వ తేదీకి మార్చారు. గతేడాది కూడా మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా 99 రూపాలయే టికెట్ట అందించే ఆఫర్ పెట్టింది. అయితే ఆ ఆఫర్ ను ఉపయోగించుకొని ఆ ఒక్కరోజే 6.5 మిలియన్ల మంది సినిమా చూశారు.

ఇదే విషయాన్నిమల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. గతేడాది భారతీయ సినీ పరిశ్రమలో అత్యధిక మంది సినిమా థియేటర్లకు వెళ్లి సినిమా చూసిన రోజుగా సెప్టెంబర్ 23వ తేదీ నిలిచిందని ప్రెసిడెంట్ కమల్ జియాన్ చందానీ ప్రకటించారు. ఈ ఏడాది అంతకు మించి రికార్డు నమోదు కావాలని అన్నారు. సినీ ప్రియులంతా ఈ అద్భుతమైన ఆఫర్ ను ఉపయోగించుకొని ఫ్యామిలీ, స్నేహితులతో కలిసి సినిమా చూడాలాని చెప్పుకొచ్చారు. మరి కేవలం 99 రూపాయలకే ఆన్ లైన్ ద్వారా టిక్కెట్ కొనుగోలు చేసి మల్టీప్లెక్సుల్లో సినిమాలను ఎంత మంది చూస్తారు, గతేడాది రికార్డును ఈసారి కొల్లగొడతారో లేదో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











