అందులో విషం పెట్టారు.. నన్ను అలా చంపాలని ప్లాన్.. బాబు మోహన్
టాలీవుడ్‌లోని కమెడియన్లలో బాబు మోహన్‌ది విలక్షణ శైలి. డిఫరెంట్ కామెడీ టైమింగ్, డైలాగ్ డిక్షన్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ఇప్పటికీ తెరపై ఆయనను చూస్తే నవ్వు ఆపుకోవడం కష్టం. ఇక తెరపై బాబు మోహన్ - కోట శ్రీనివాసరావు కాంబినేషన్ తిరుగులేని ముద్ర వేసింది. వీరిద్దరూ కలిసి దాదాపు 60కి పైగా సినిమాలలో జోడిగా నటించి ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టింది.
ఖమ్మం జిల్లాకు చెందిన బాబు మోహన్ సినిమాల్లోకి రాకముందు పౌర సరఫరాల శాఖలో ఉద్యోగం చేశారు బాబు మోహన్ . ఆహుతితో బాబు మోహన్‌ను టాలీవుడ్‌కు పరిచయం చేశారు కోడి రామకృష్ణ. ఇందులో ఆయన పోషించిన క్యారెక్టర్‌కు పేరు రావడంతో కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా బాబు మోహన్ బిజీ అయ్యారు . అప్పట్లో బ్రహ్మానందం, కోటా శ్రీనివాసరావు, అలీ, మల్లిఖార్జునరావు వంటి సీనియర్లతో పోటి పడి మరి టాప్ కమెడియన్‌గా వెలుగొందారు బాబు మోహన్

చిన్నప్పటి నుంచి నటరత్న నందమూరి తారక రామారావుకు బాబు మోహన్ వీరాభిమాని. ఇక తెలుగుదేశం పార్టీకి ఆయన వీర విధేయుడు. ఈ క్రమంలోనే సినిమాల్లో బిజీగా ఉన్నప్పటికీ రాజకీయాల్లో దిగి.. 1999 ఎన్నికల్లో మెదక్ జిల్లా అంధోల్ నుంచి బాబు మోహన్ టీడీపీ అభ్యర్ధిగా బరిలో దిగి ఘన విజయం సాధించారు. అయితే ఆయనను అనుకోని అదృష్టం వరించింది. చంద్రబాబు నాయుడు కేబినెట్‌లో కార్మిక శాఖ మంత్రిగా బాబు మోహన్ ఛాన్స్ కొట్టేశారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడే మంత్రి పదవిని సైతం అందుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. కార్మిక శాఖ మంత్రిగా కార్మికుల సంక్షేమం కోసం బాబు మోహన్ కృషి చేశారు.
అయితే రాష్ట్ర విభజన తర్వాత అప్పటి పరిస్ధితుల దృష్ట్యా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన ఆయన కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్‌లో చేరారు. అక్కడా ఇమడలేక బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న బాబు మోహన్ ఇటీవల వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ.. తన కెరీర్, రాజకీయ జీవితంపై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తనకు పాన్ వేసే అలవాటు ఉండటం ఓసారి ప్రాణాల మీదకు తెచ్చిందని బాబు మోహన్ తెలిపారు. తనికెళ్ల భరణి తనకు పాన్‌లు అలవాటు చేశాడని బాబు మోహన్ వెల్లడించారు. మొదట్లో వద్దులే అన్న తాను పాన్ లేకుండా రోజు గడిచేది కాదని.. అలా రోజుకి 30 పాన్‌లు తినే స్టేజ్‌కి వెళ్లిపోయానని గుర్తుచేసుకున్నారు బాబు మోహన్

కేబినెట్‌లో మంత్రిగా అవకాశం దక్కినప్పుడు.. సీఎం చంద్రబాబు దగ్గరికి వెళ్లేటప్పుడు కూడా పాన్ తింటూనే వెళ్లడం అలవాటైందని తెలిపాడు. ఒకరోజున పాన్‌లు కట్టించుకుని కారులో బయల్దేరడానికి సిద్ధంగా ఉండగా.. తనకు పోలీస్ ఆఫీసర్ ఫోన్ చేసి మీ పాన్‌లో విషం కలిపాడని చెప్పడంతో షాకయ్యానని బాబు మోహన్ పేర్కొన్నారు. దానిని వెంటనే విసిరి పారేశానని బాబు మోహన్ చెప్పారు.
ఆ పాన్ తయారు చేసిన వ్యక్తి .. విషం కలిపిన పాన్ ఇవ్వమని మమ్మల్ని బెదిరించారని నా కాళ్లపై పడి ఏడ్చాడని ఆయన వెల్లడించారు. రాజకీయాలు ఇంత దారుణంగా ఉంటాయా? అని అసహ్యం వేసిందని బాబు మోహన్ తెలిపారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇంతకీ బాబు మోహన్‌కు విషం పెట్టి చంపాలని అనుకున్నది ఎవరు? దీని వెనుక ఉన్నది ఎవరు? అనేది మాత్రం తెలియరాలేదు.


Click it and Unblock the Notifications











