ఆ సినిమాలో పాటలన్నీ ఫ్లాప్ .. రాజమౌళి హిట్ మూవీపై జక్కన్న బ్రదర్ షాకింగ్ కామెంట్స్
తన సినిమాలు, టేకింగ్, మార్కెటింగ్ స్ట్రాటజీలతో తెలుగు సినిమాకు అంతర్జాతీయ ఖ్యాతీని తీసుకొచ్చారు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. కనీసం కలలో కూడా ఊహించని ఆస్కార్ అవార్డ్‌ను సాధించుకొచ్చి కష్టపడితే ఏదైనా సాధ్యమేనని నిరూపించుకున్నారు. రెండు దశాబ్ధాలకు పైగా కెరీర్‌లో ఇప్పటి వరకు ఓటమి ఎరుగని దర్శకుడిగా జక్కన్న తన పేరిట చరిత్ర లిఖించుకున్నారు. సమీప భవిష్యత్తులో మరే దర్శకుడు ఆ రికార్డును ఛేదించడం అసాధ్యం అనడంలో అతిశయోక్తి లేదు. ఆర్ఆర్ఆర్ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత సూపర్‌స్టార్ మహేశ్ బాబుతో రాజమౌళి సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లే పనిలో జక్కన్న ఉన్నారు.
కాగా.. ఎస్ఎస్ రాజమౌళి కెరీర్‌లో సింహాద్రి సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. ఎన్టీఆర్‌కు మాస్ హీరోగా, జక్కన్నకు సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా ఈ సినిమా పేరు తీసుకొచ్చింది. స్టూడెంట్ నెం.1తో కెరీర్ ప్రారంభించిన ఎన్టీఆర్‌కు సింహాద్రి రూపంలో ఇండస్ట్రీ హిట్ దొరికింది. తొలుత స్టూడెంట్ నెం.1తో రాజమౌళి హిట్ అందుకున్నా .. ఈ సినిమాకు దర్శకత్వ పర్యవేక్షణ మొత్తం రాఘవేంద్రరావు సమక్షంలోనే జరిగింది. దీంతో తన మార్క్ చూపించాలని భావించిన జక్కన్న.. అన్ని రకాల మాస్ ఎలిమెంట్స్‌తో సింహాద్రి స్క్రిప్ట్‌ను రెడీ చేయించారు.

10 మంది చల్లగా ఉండటం కోసం ఒకడిని చంపినా, తను చావడానికైనా సిద్ధం అనే సూత్రాన్ని నమ్మి పాటుపడే కుర్రాడిగా ఎన్టీఆర్ అద్భుతంగా నటించాడు. సింహాద్రిగా, సింగమలైగా రెండు రకాల పాత్రలను అలవోకగా చేశాడు. ఎన్టీఆర్ సరసన అంకిత, భూమిక నటించిన ఈ సినిమా దాదాపు 55 కేంద్రాల్లో 175 రోజుల పాటు ప్రదర్శించబడింది. రూ. 8.5 కోట్ల బడ్జెట్‌తో 9 జూలై 2003లో విడుదలైన సింహాద్రి దాదాపు రూ. 25.7 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. 2023 నాటి లెక్కల ప్రకారం ఈ మొత్తం దాదాపు రూ.94 కోట్లకు సమానమని విశ్లేషకులు చెబుతున్నారు.
సింహాద్రి సినిమా సూపర్‌హిట్ కావడానికి కథ, కథనం, ఎన్టీఆర్ నటనతో పాటు పాటలు కూడా కీలక భూమిక పోషించాయి. నువ్వు విజిలెస్టే ఆంధ్రా సోడా బుడ్డి, చిన్నదమ్మే చీకులు, చీమ చీమ, నన్నేదో సేయమాకు, చిరాకు అనుకో, అమ్మైనా నాన్నైనా అనే పాటలు ఇప్పటికీ మాస్‌ను ఊపేస్తాయి. ఇక అన్నింటికి మించి కేరళలో జరిగే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ నేపథ్యంలో సాగే సింగమలై సాంగ్ గూస్ బంప్స్‌ను తెప్పిస్తుంది.
అలాంటిది సింహాద్రి పాటలను ఫ్లాప్ అన్నారు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్. ఆయన ఎవరో కాదు స్వయానా రాజమౌళి సోదరుడు, ఆ చిత్ర సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. సింహాద్రికి తాను మొత్తం ఫ్లాప్ సాంగ్సే ఇచ్చానని అన్నారు. మ్యూజిక్ సిట్టింగ్ సమయంలో నా గత చిత్రాల్లోని ఫ్లాప్ సాంగ్స్ వినిపించగా.. తనకు అవే కావని రాజమౌళి పట్టుబట్టాడని, దీంతో తమ్ముడి మాటను కాదనలేక ఆ ట్యూన్స్ కాస్త మార్చి సింహాద్రి చేశానని కీరవాణి అన్నారు. ఇక రమ్యకృష్ణ చేసిన ఐటెం సాంగ్ కూడా.. 1992లో సమర్పణ అనే సినిమాలోని ఓ పాట ట్యూన్స్ నుంచే చేశానని చెప్పారు. ప్రస్తుతం కీరవాణి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











