'ఆ టైమ్ లో 70 లక్షలు ముంచేశాడు..స్నేహం పేరుతో నమ్మక ద్రోహం..మోసం'
దివంగత నేరేళ్ల వేణుమాధవ్ స్పూర్తితో ఎంతోమంది మిమిక్రీ కళాకారులు తెలుగునాట సత్తా చాటారు. వారిలో శివారెడ్డి ఒకరు. ఈ తరంలో మిమిక్రీ అనగానే వెంటనే గుర్తొచ్చే పేరు శివారెడ్డి. ఎన్నో సినిమాల్లో, వేదికలపై ఎందరో ప్రముఖుల గొంతును మిమిక్రీ చేసి నవ్వులు పూయించి మిమిక్రీనే ఇంటిపేరుగా మార్చుకున్నారు. దాదాపు మూడున్నర దశాబ్దాలుగా పాటలతో, కామెడీతో , మిమిక్రీతో , డ్యాన్సులతో ప్రేక్షకులను అలరిస్తున్నారు శివారెడ్డి. కొన్ని సినిమాల్లోనూ నటించి నటుడిగానూ సత్తా చాటారు. అలాంటిది ఈ మధ్యకాలంలో ఆయన తెరపై కనిపించడం లేదు.
ఇటీవల ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్, మిమిక్రీ , సినిమాల్లో అవకాశాలపై పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తాను స్నేహానికి ప్రాణమిస్తానని , తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు స్నేహితుల కోసం ఏమైనా చేస్తానని చెప్పుకొచ్చారు. తన స్నేహితుల్లో ఒకరు కరోనా కారణంగా కన్నుమూశాడని.. తాను మళ్లీ వాడిని చూడలేనని, మాట్లాడలేనని కలవలేనని శివారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరితో మాట్లాడుతున్నా.. ఆ వ్యక్తిని చనిపోయిన నా మిత్రుడి పేరుతో పిలిచేవాడినని గుర్తుచేసుకున్నారు.

స్నేహం కోసం ప్రాణమిచ్చే తనను ఓ మిత్రుడు మోసం చేశాడని శివారెడ్డి తెలిపారు. హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత ఒకతను పరిచయమయ్యాడని.. తన దగ్గర బాగా డబ్బున్నట్లు అతను, అతని కుటుంబం పసిగట్టిందని.. ఆ డబ్బుతో ఇళ్లు, ఆస్తులు, పొలాలు కొనాలని చూస్తున్నానని శివారెడ్డి వెల్లడించారు. జీవితంలో కష్టపడి రూ.60 నుంచి రూ.70 లక్షల డబ్బును దాచుకున్నానని చెప్పారు. మణికొండ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో స్థలాలు కొనాలని తెగ తిరిగానని.. అప్పటి స్పీకర్ సురేష్ రెడ్డి ఇంటి పక్కనే ఓ ల్యాండ్ చూశానని శివారెడ్డి గుర్తుచేసుకున్నారు. ఏది చూసినా ఇది బాలేదు, అది బాలేదని ఆ మిత్రుడు డీల్ చెడగొట్టేవాడని.. వాళ్ల నాన్నని కూడా వెంటబెట్టుకుని తిరిగేవాడినని తెలిపారు.
ఇది ఇలా సాగుతుండగానే.. తనకు అమెరికాలో ప్రొగ్రామ్ చేసే అవకాశం వచ్చిందని, ఇందుకోసం దాదాపు 2 నెలలు అక్కడే ఉండాల్సి ఉందని శివారెడ్డి పేర్కొన్నారు. అప్పటికి తనకింకా పెళ్లి కాలేదని, ఆ మిత్రుడు అంత డబ్బు నీదగ్గర ఉండొద్దు.. మా ఇంట్లో పెడతానని తీసుకెళ్లాడని .. అయితే ఆ సొమ్మును అప్పుల వాళ్లు ఇంటి మీదకి వస్తున్నారని వాడేశారని శివారెడ్డి చెప్పారు. అమెరికా నుంచి తాను తిరిగి రాగానే, యధావిథిగా ల్యాండ్లు చూడటం మొదలుపెట్టామని వాళ్లు ఏదో ఒక సాకు చెప్పి డీల్ కుదరనివ్వడం లేదన్నారు. దీంతో తాను నా డబ్బులు నాకు ఇవ్వమని అడిగానని, అయితే వాళ్లు కొంచెం తడబడ్డారని.. అప్పుడే నాకు డౌట్ వచ్చిందని తెలిపారు.
తన డబ్బు ఇస్తావా లేదా అని కూర్చొన్నానని అప్పుడు వాడేసిన విషయం చెప్పారని , త్వరలోనే ఇచ్చేస్తామన్నారని.. కానీ ఇవాళ్టీ వరకు తనకు చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదని శివారెడ్డి తెలిపారు. లేదంటే మణికొండలో నాలుగైదు ఎకరాలు కానీ.. నగరంలో ఎంతో కొంత ల్యాండ్ తన చేతుల్లో ఉండి, ఇప్పుడొక రేంజ్‌లో ఉండేవాడినని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన జీవితంలో అదొక పెద్ద షాకేనని, కానీ వరుసగా ప్రొగ్రామ్‌లు, సినిమాల్లో బిజీగా ఉండటంతో డిప్రెషన్ వరకు వెళ్లలేదని శివారెడ్డి చెప్పారు.


Click it and Unblock the Notifications











