#PSPK28 : పవన్ ఫ్యాన్స్‌కి బిగ్ అప్డేట్.. హరీష్ శంకర్ కాంబో గురించి కీలక ప్రకటన
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక పక్క ఏపీలో రాజకీయాల్లో చురుగ్గా ఉంటూ మరో పక్క సినిమాల్లో నటిస్తున్నాడు. ఇప్పటికే ఆయన నటించిన వకీల్ సాబ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పటికే ఆయన మరో ఐదు సినిమాలకు ఓకే చెప్పాడు. అందులో రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉండగా మరో రెండు సినిమాలు స్క్రిప్ట్ పూర్తి చేసుకుని షూటింగ్ కి రెడీగా ఉన్నాయి. మరో సినిమా ప్రీ ప్రొడక్షన్ మొదలు కావాల్సి ఉంది. అయితే హరీష్ శంకర్ సినిమా గురించి రకరకాల ప్రచారాలు జరుగుతున్న క్రమంలో ఆ సినిమాను నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ కీలక ప్రకటన చేసింది. ఆ వివరాల్లోకి వెళితే
Recommended Video

వకీల్ సాబ్ మానియా
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమా ఏప్రిల్ 9న విడుదలైంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో శృతిహాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తొలిసారి లాయర్ పాత్రలో కనిపించాడు. హిందీలో సూపర్ హిట్ అయిన సినిమా పింక్ రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో మంచి స్పందన తెచ్చుకుంది. ఇక ఈ సినిమా షూట్ సమయంలోనే ఆయన మరో ఐదు సినిమాలు ఒప్పుకున్నాడు.

నాలుగు సినిమాలతో బిజీ
ఐదు సినిమాల విషయానికి వస్తే జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్ల సినిమా షూటింగ్ దశలో ఉంది, అలాగే నాగ వంశీ నిర్మాణంలో అయ్యప్పనుమ్ కోశియం రీమేక్ కూడా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాకి సాగర్ కే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రెండు సినిమాలు కాకుండా హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఒక సినిమా, సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో మరో సినిమా కూడా పవన్ కళ్యాణ్ ఓకే చేశారు. ఇక మరో సినిమా బండ్ల గణేష్ నిర్మాణంలో చేయాల్సి ఉంది. అయితే ఈ హరీష్ శంకర్ సంబంధించిన సినిమా గురించి రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి.

అప్పుడే అనుకున్నాం కానీ
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ప్రకటించింది మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ. నిజానికి ఉగాదికి మా సినిమా టైటిల్ అలాగే ఫస్ట్ లుక్ రిలీజ్ చేయాలని భావించామని కానీ కరోనా కారణంగా దాన్ని వాయిదా వేయాల్సి వచ్చిందని పేర్కొంది. అయితే ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి అని ఇంకా మొదలు కానీ తమ సినిమా గురించి ఇలా అందరూ ప్రస్తావించడం బాగానే ఉందని కాకపోతే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఏదైనా సరే తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో నుండి సరైన సమయంలో విడుదల చేస్తామని పేర్కొంది.

ఊహాగానాలు ప్రచారం చేయొద్దు
ఇక ఈ ట్వీట్ ను రీ ట్వీట్ చేసిన హరీష్ శంకర్ దయచేసి టైటిల్ విషయంలో కూడా ఎలాంటి ఊహాగానాలు ప్రచారం చేయవద్దని కోరారు. ఒరిజినల్ టైటిల్ వెల్లడి అయితే కనుక కచ్చితంగా అందరూ దాన్ని ప్రేమిస్తారని ఈ టైటిల్ ని రివీల్ చేయడానికి అందరికంటే ఎక్కువగా తానే ఎగ్జయిట్ అవుతున్నాను అని ఆయన చెప్పుకొచ్చారు.

వెనక్కి నెట్టిన కరోనా
అనుకున్నది అనుకున్నట్లు జరిగితే హరీష్ శంకర్ సినిమా షూటింగ్ జూలై లో మొదలు కావాల్సి ఉంది. కానీ కరోనా కేసులు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా కరోనా బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఆలస్యం అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓల ఈ సినిమాకు సంచారి అనే టైటిల్ పరిశీలిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అంతే కాక సినిమాలో పవన్ రెండు పాత్రల్లో నటిస్తున్నాడు అనే ప్రచారం కూడా జరిగింది. అందుకే నిర్మాణ సంస్థ ముందుకు వచ్చి ప్రకటించింది.


Click it and Unblock the Notifications











