వేణు మాధవ్ మృతితో ఎన్ శంకర్ ఎమోషనల్.. మా ఇద్దరి ఒకటే జిల్లా అంటూ
టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ హాస్య నటుడు వేణు మాధవ్ మృతి వార్త అన్ని వర్గాలను కలిచి వేస్తున్నది. ఆయన ఇక లేరనే వార్తను సినీ, రాజకీయ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. గత కొద్దికాలంగా కాలేయ, కిడ్నీ వ్యాధితో బాధపడుతూ బుధవారం మధ్నాహ్నం వేణు మాధవ్ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా ప్రముఖ దర్శకుడు, తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్.శంకర్ స్పందించారు.
వేణుమాధవ్ భౌతికంగా లేరనే వార్త నన్ను ఎంతగానో బాధపెట్టింది. తెలుగు సినిమా వినోదాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లి హాస్యనటుడిగా శిఖరాగ్రస్థాయికి చేరుకున్నారు. ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని పొందారు. వేణుమాధవ్ నా సినిమాలన్నింటిలో నటించాడు. మా ఇద్దరిది ఒకే జిల్లా. ఎంతో ఆత్మీయంగా ఉండేవాడు. అద్భుతమైన హాస్యనటుడిగా వెలుగొందిన వేణుమాధవ్ మరణం సినీ పరిశ్రమకు, మిత్రులకు, నాలాంటి సన్నిహితులకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబానికి ప్రగాఢ నుభూతిని తెలియజేస్తున్నాను అని ప్రముఖ దర్శకుడు, తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్.శంకర్ ఓ ప్రకటనలో తెలిపారు.

కాగా, యశోద హాస్పిటల్‌లో మృతి చెందిన వేణు మాధవ్ భౌతిక కాయాన్ని మౌలాలిలోని ఆయన నివాసానికి తరలించారు. అభిమానుల సందర్శనార్థం ఉంచుతారు. అలాగే సినీ ప్రముఖులు కడసారి దర్శించుకోవడానికి ఆయన పార్థీవ దేహాన్ని గురువారం ఫిలిం చాంబర్‌కు తరలించే అవకాశం ఉంది. అక్కడి నుంచి వేణు మాధవ్ అంతిమ యాత్ర ప్రారంభవుతుందని సినీ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











